తానా మహాసభలో పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు

22వ తానా మహా సభలకు శ్రీ పవన్‌ కల్యాణ్‌ ముఖ్య అతిధిగా వస్తున్నారు అన్న వార్త కంటే ఆయన ముఖ్య ప్రసంగం చేయనున్నారనే వార్త చాలా మందిలో ఆసక్తిని కలిగించింది. పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాల్లోకి రావడం, జనసేన పార్టీ తరుపున తనదైన స్టైల్‌ లో చాలా ఆవేశంతో 'తాట తీస్తా' లాంటి డైలాగ్‌ లతో అనేక సార్లు మాట్లాడటం తో తానా సభలో ఆయన ప్రసంగంకోసం అందరూ ఎదురు చూడటం మొదలెట్టారు.

తానా సభల ప్రాంగణానికి పవన్‌ కళ్యాణ్‌ రావటం, నేరుగా స్టేజిమీదికి తీసుకు వెళ్ళటం, ఆయన మైక్‌ తీసుకొని తన ప్రసంగం మొదలెట్టటం అంతా 2- 3 నిమిషాల్లో జరిగిపోయాయి. దాదాపు 10000 మంది ఉన్న ఆడిటోరియం పవన్‌ ప్రసంగంను వినటం మొదలెట్టారు. తానా నాయకులు అందరూ కూడా పవన్‌ కళ్యాణ్‌ ప్రసంగం అవ్వగానే ఆయనతో స్టేజి పంచుకోవాలి అని ఉద్దేశ్యంతో స్టేజి మీద ఓ పక్కకు చేరారు. పవన్‌ మాట్లాడుతూ తాను రాజకీయ లేదా సినిమా ప్రసంగం చేయటానికి రాలేదని, సంపూర్ణ పరాజయం పొందాక మొదటిసారిగా తన మనసు లో మాట అందరితో పంచుకోవాలనే వచ్చానని తన ప్రసంగం మొదలెట్టారు.

నిజంగానే చాలా ఆర్థ్రత తో గుండె లోతుల్లోంచి వచ్చిన మాటలతో శ్రీ పవన్‌ కళ్యాణ్‌ ''మంచి సమాజం కోసం అందరూ ప్రయత్నించాలి '' అంటూ చెప్పిన కొన్ని మాటలు ఇక్కడ క్లుప్తంగా ఇస్తాను...

'' మొదటి నుంచి నేను ఎక్కువ విజయాలు చూడలేదు...10వ తరగతిలో ఫెయిల్‌ అయ్యాను అనే కంటే...ఏమాత్రం క్రియేటివిటీ లేని, బట్టి పట్టి చదివి పరీక్ష రాసే పద్దతి నచ్చక ఫెయిల్‌ అయ్యాను అన్నొచ్చు''.

సినిమాలలో కూడా పెద్ద స్టార్‌ అయ్యాను గాని అనేకవిజయాలు లేవు. ఖుషి తరువాత మళ్ళీ అలాంటి విజయం గబ్బర్‌ సింగ్‌ తో వచ్చింది. అన్ని రోజులు ఓపిక తో ఎదురుచూసాను.

''చిన్నప్పుడు ప్రతి రోజు మా అమ్మ సాయత్రం దీపం వెలిగించగానే దణ్ణం పెట్టుకొనేది.. ఎవరికి దణ్ణం పెడుతున్నావ్‌ అని అడిగితే బల్బ్‌ కనిపెట్టిన ఎడిసన్‌ కి అన్నమాట నన్ను బాగా ప్రభావితం చేసింది. అప్పుడు ఆ శాస్త్రవేత్త గురించి తెలుసుకొంటే ఆయన అనేక సార్లు ఫెయిల్‌ అవుతూ చివరకు విజయం సాధించాడు అన్న విషయం నాకు బాగా అర్ధం అయ్యింది.''

''అలాగే నెల్సన్‌ మండేలా బయట వున్నా, జైలులో ఉన్నా ఒక నాయకుడి గా ప్రజలను ప్రభావితం చేశారు..ఆయన రాజకీయ నాయకుడు కాదు..కానీ ఆయన ప్రజలను మంచి సమాజం కోసం ముందుకు తీసుకెళ్లారు''.

''గత నెలలో జన సేన కి వచ్చిన అపజయంతో నేను నిరుత్సాహ పడలేదు. ఒక్క 15 నిముషాలలో నేను నా సంపూర్ణ పరాజయాన్ని సంపూర్ణం గా అర్ధం చేసుకున్నాను. సినిమాలలో లాగానే, ఈ పరాజయంతో ఇంకా శక్తిని, ఇంకా ఉత్సాహంను తెచ్చుకొని ముందుకు వెళతాను. నేను డబ్బులు కోసం, పేరు ప్రతిష్టలు కోసం రాజకీయాల్లోకి రాలేదు..అవి సినిమాల ద్వారా వస్తున్నాయ్‌.. నేను ఎదురు చూస్తున్న మంచి సమాజం కోసం ...ఆ సమాజం కోసం కొందరినన్నా ప్రభావితం చేయాలన్న తలంపు తో రాజకీయాల్లోకి వచ్చాను.''

'' ఎప్పుడైతే డబ్బు లేకుండా ఎన్నికలకు వెళ్ళాలి అనుకొన్నామో... కులాలు, మతాలు లేకుండా వోట్‌ అడగాలి అనుకొన్నామో... గెలుపు-ఓటమి లకు సిద్ధపడి ముందుకు వెళ్లాం''.

''అమెరికా లాంటి దేశం లో కూడా, ఇంత చదువు చదివి స్థిరపడిన మీ మధ్య కూడా కులాల పరంగా తెలుగు సంఘాలు రావటం చాలా బాధాకరం. మీఅందరు వాటికి అతీతం గా ఉండి... మీ ద్వారా సమాజానికి మంచి జరిగేలా ఉండాలని నేను కోరుతున్నాను.''

డబ్బులు ఇచ్చి వోట్‌ వేయించుకొన్న నాయకుడు ఆ ఓటర్‌ కి ఎలాంటి గౌరవం ఇవ్వడు అని తెలుసుకోండి. మీరు అర్ధం చేసుకుని మీ ఊళ్లలో,మీకు తెలిసిన వారికి అర్ధం అయ్యేలా చెప్పి వారిని మార్చండి. మీ ద్వారా మీకు తెలిసిన వారిని ప్రభావితం చేసి వారి వలన మంచి సామాజం తయారు అయ్యేలా వారిని తయారు చేయండి''

పవన్‌ మాట్లాడుతూ మధ్యలో నాదెళ్ల మనోహర్‌ ని పిలవడం, ఆయన కూడా తానా సభ్యుల్ని అభినందించటం జరిగింది. చివరగా తానా అధ్యక్షులు శ్రీ సతీష్‌ వేమన, శ్రీ మూల్పూరి వెంకట్రావు, శ్రీ నరేన్‌ కొడాలి, శ్రీ రవి గౌరినేని శ్రీ పవన్‌ కళ్యాణ్‌,శ్రీ నాదెళ్ల మనోహర్‌ గారి సత్కరించారు.

Click here for Event Gallery


                    Advertise with us !!!