తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలు

Telugu Association Of London TAL Ugadi 2021 Celebrations

తెలుగు అసోసియేషన్ ఆఫ్ లండన్ (తాల్) ఉగాది వేడుకలను 24 ఏప్రిల్ 2021 న ఘనంగా జరుపుకున్నారు. గత సంవత్సరాలకు భిన్నం గా తొలిసారి అంతర్జాలంలో అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ గేయరచయిత భువనచంద్ర హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా సింగర్ ఎస్పీ శైలజ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ తాల్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకోగా, ఎంపీ సీమ మల్హోత్రా యూకేలో తాల్ చేస్తున్న కార్యక్రమాలను అభినందించారు. ఈ సందర్భంగా అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ముఖచిత్రంతో ఉన్న తాల్ ‘మా తెలుగు’వార్షిక సంచికను విశిష్ట అతిథులుగా ప్రముఖ రచయిత కాళిపట్నం రామారావు, సాహితివేత్త ఓలేటి పార్వతీశం ఆవిష్కరించారు. ప్రముఖ రచయిత్రి హేమ మాచర్ల సంపాదకీయం వహించిన ఈ సంచిక విడుదలకు సూర్య కందుకూరి మరియు తాల్ వైస్ చైర్మన్ రాజేష్ తోలేటి సహకరించారు.

ఆద్యంతం సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో, లండన్ లోని తెలుగువారే కాదు, తెలుగురాష్ట్రాల్లోని కళాకారులు అదిరే అభి, సినీ గాయకులు సాకేత్ కొమండూరిమరియు సాహితి చాగంటి, లండన్ RJ శ్రీవల్లి, పేరడిగురుస్వామి, 4 లెగ్స్ కిరణ్, ఇమిటేషన్ రాజు వారి వారి ప్రదర్శనలతో అలరించారు. సురభి డ్రామా థియేటర్ వారి మాయాబజార్ నాటకం ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. TAL Cultural Center (TCC)విద్యార్థులుప్రదర్శించిన భరత నాట్యం, కర్ణాటక సంగీతం, తెలుగు పద్యాలు అబ్బురపరిచాయి.

ఈ కార్యక్రమం లో గాన గంధర్వుడు అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కి తాల్ నివాళులు అర్పించింది. యూకేలోని తెలుగు గాయకులతో ఎస్ పీ శైలజ కలిసి ఎస్ పీ బాలు పాటలతో SPB కి స్వరాభిషేకం చేసారు. యూకే వైద్య మరియు కీలక రంగాల్లో సేవలందిస్తున్న తెలుగు వారికి ధన్యవాదాలు తెలుపుతూ రూపొందించిన ప్రత్యేక కార్యక్రమానికి సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. ఈ వేడుకల్లో తాల్ సభ్యులు ఉత్సాహంగా పాల్గొనగా, చైర్మన్ భారతి కందుకూరి తెలుగు వారి అందరికి ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ, తాల్  చేపడుతున్న వివిధ  సేవాకార్యక్రమాలను వివరించారు. అలాగే ఈ వేడుకలను ఇంత వైభవముగా నిర్వహించిన కన్వీనర్లు వెంకట్ నీల , విజయ్ బెలిదే మరియు వారి బృందం ని అభినందించారు.

తాల్ ట్రస్టీలు కిషోర్ కస్తూరి, నవీన్ గాదంసేతి, రవీందర్ రెడ్డి గుమ్మకొండ, గిరిధర్ పుట్లూర్, అనిల్ అనంతుల, అనిత నోముల, ఈ కార్యక్రమ విజయానికి కారకులయిన కళాకారులు, చిన్నారులు, సహాయ సదుపాయాలు అందించిన వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. Sports ట్రస్టీ అనిత నోముల మాట్లాడుతూ మే 15 న ప్రారంభం అయి 3 నెలలపాటు జరిగే TAL Premier League (TPL) గురించి వివరించి, అందరూపాల్గొని యూకే తెలుగు క్రీడాకారులను ప్రోత్సహించాలని కోరారు. సుమారు ఎనిమిది గంటలపాటు సాగిన ఈ కార్యక్రమాన్నివివిధ అంతర్జాల మాధ్యమాలలో అంతరాయం లేకుండా నిర్విరామంగా పనిచేసిన తాల్ సాంకేతిక బృంద కీలక సభ్యులు వంశీ మోహన్ సింగులూరి మరియు కిరణ్ కప్పెటలను తాల్ సభ్యులందరూ కొనియాడారు. అన్ని వయసుల వారిని అలరించిన ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా అయిదు వేల మందికి పైగా వీక్షించారు.ఈ సందర్భగా భారత దేశంలో పాండెమిక్ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వీక్షకులకు Hands, Face, Space మరియు Sanitise, Mask & Social distancing ని గుర్తుచేసింది.

Click here for Event Gallery

 

The events photos and videos for your use are available at:

https://www.facebook.com/TeluguAssociationofLondon/


                    Advertise with us !!!