హైకోర్ట్ ఆగ్రహం... బెజవాడ, గుంటూరు వాసులకు సర్కార్ గుడ్ న్యూస్...!

AP High Court Serious On YCP Govt Over Rising Of COVID

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్న నేపధ్యంలో ఆక్సీజన్ కొరత అనేది చాలా తీవ్రంగా ఉంది. ఆక్సీజన్ కొరతను తగ్గించడానికి ఏపీ సర్కార్ చర్యలు చేపట్టినా సరే సాధారణ పరిస్థితి ఇప్పటిలో వచ్చే అవకాశాలు కనపడటం లేదు. రోజు రోజుకి కేసులు పెరగడం మరణాలు పెరగడంతో ప్రభుత్వం కఠినంగానే ముందుకు వెళ్తుంది. ఇక ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ మీద దృష్టి పెడుతుంది. ఏపీలో ఆక్సీజన్ కొరతను తగ్గించడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెప్పించే ఆలోచనలో ఉన్నారు.

ఇదిలా ఉంటే... తాజాగా కరోనా పరిస్థితిపై ఏపీ హైకోర్ట్ లో విచారణ జరిగింది. ఏపీలో కోవిడ్ పరిస్థితులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయా అని ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది. ఇపుడు ఉన్న ఆక్సిజన్ నిల్వలు ఎంత కాలం సరిపోతాయన్న న్యాయస్థానం... కేంద్రం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాలు తెరిచారా అని ప్రభుత్వాన్ని హైకోర్ట్ నిలదీసింది. ఏపీ లిబర్టీ అసోసియేషన్ వేసిన పిటిషన్ పై విచారణ సందర్బంగా ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది ఏపీ హైకోర్టు.

పరిస్థితికి సరిపడా చర్యలు చేపట్టామన్న ప్రభుత్వ సమాధానంపై, తీసుకున్న చర్యలపై న్యాయస్థానం సంతృప్తి చెందలేదు. ఇక కరోనా నివారణ, వైధ్యంపై కూడా విచారణ జరిపింది. రాష్ట్రంలో ఎన్ని ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసారని, టెస్టులు ఎంత మేర పెంచారని హైకోర్టు ప్రశ్నలు వేసింది. రిపోర్టులు ఎన్ని రోజుల్లో వస్తున్నాయన్న ప్రశ్నకు గతంలో 3 రోజులు పట్టేదని ఇపుడు 5 రోజుల నుండి 3 రోజుల్లో వస్తున్నాయని ప్రభుత్వం వివరించింది. ఈ సమయంలో రోగి పరిస్థితి ఏంటని న్యాయస్థానం నిలదీసింది.

ఆసుపత్రుల్లో బెడ్లు, సౌకర్యాలు సరిపడా ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. సుమారు గంటపాటు విచారణ జరిపింది. అన్ని వివరాలను పిటిషనర్ కౌన్సిల్ తోపాటు తమకు ఇవ్వాలని విచారణ రేపటికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఆక్సిజన్ నిల్వలను సమకూర్చేందుకు ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ప్రైవేట్ గ్యాస్ ఏజన్సీల నుంచి ఆక్సిజన్ కొనుగోలు చేస్తుంది. చెన్నై నుంచి గన్నవరం మండలం సూరంపల్లి ప్రైవేట్ గ్యాస్ ఏజెన్సీకి తరలివచ్చిన 23 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ లో కొంత భాగాన్ని ఏపీ సర్కార్ కొనుగోలు చేసింది. ఒప్పందం ప్రకారం ఖమ్మం జిల్లాకు ఆక్సిజన్ తరలించాల్సి ఉండగా రాష్ట్రానికి అందించాలని విజ్ఞప్తి చేసింది. సదరు ఏజెన్సీ నిర్వహకుడి నుంచి రాష్ట్ర అవసరత దృష్ట్యా 13 మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసారు. కొనుగోలు చేసిన ఆక్సిజన్ ను గుంటూరు, విజయవాడ పరిసరాలోని కొవిడ్ ఆసుపత్రులకు తరలించారు.

 


                    Advertise with us !!!