హైటెక్ సిటీగా అమరావతి

హైటెక్ సిటీగా అమరావతి

12-07-2018

హైటెక్ సిటీగా అమరావతి

దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామని, అమరావతి హైటెక్‌ సిటీగా మారబోతుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ అన్నారు. హైదరాబాద్‌లో  ఏపీ ఎకనమిక్‌ డెవలప్మెంట్‌ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన వివిధ దేశాల కాన్సులేట్‌ జనరల్స్‌, వివిధ దేశాల ఇండియన్‌ అంబాసిడర్స్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల సమావేశంలో మంత్రి లోకేష్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తరువాత అనేక సమస్యలు ఎదుర్కొన్నామని, కనీస రాజధాని కూడా లేకుండా ప్రయాణం ప్రారంభించామన్నారు. ఇతర దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఏపీకి తలసరి ఆదాయం తక్కువగా ఉందని, కేవలం నాలుగేళ్లలోనే సమస్యలు అధిగమించి అభివృద్ధివైపు అడుగులు వేస్తున్నామన్నారు.

టెక్నాలజీ వివినియోగంతోనే 15 శాతం వృద్ధి సాధించడం సాద్యమవుతుందని, ఏపీలో టెక్నాలజీని పెద్ద ఎత్తున వినియోగిస్తున్నామన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా గ్రీన్‌ ఫీల్డ్‌ రాజధాని అమరావతి నిర్మిస్తున్నామని, రాజధాని నిర్మాణ కోసం 35 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ప్రభుత్వానికి ఇచ్చారన్నారు. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ సింగపూర్‌ చేసిందని, ముఖ్యమైన భవనానలు నార్మన్‌ ఫాస్టర్స్‌ రూపొందించిందని, బ్లూ జోన్‌ డచ్‌ రూపొందించిందని తెలిపారు. అధునాత టెక్నాలజీల అభివృద్ధి అమరావతిలో జరగబోతుందని, హెచ్‌సీఎల్‌ కంపెనీ అధునాత టెక్నాలజీలపై అమరావతిలో పరిశోధన, అభివృద్ధి చేయబోతుందన్నారు. ఏపీలో ఉన్న యువతి, యువకులకు అధునాత టెక్నాలజీల్లో ఉద్యోగాలు అందిపుచ్చుకోవడానికి సిద్దం చేస్తున్నామని, నిరంతరం స్కిల్‌ డెవలప్మెంట్‌, పరిశ్రమలకు కావాల్సిన శిక్షణ ఇస్తున్నామన్నారు. వివిధ దేశాల్లో పనిచేస్తున్న మీరంతా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకారం అందించాలని పేర్కొన్నారు.