కడపలో ఉక్కు పరిశ్రమకు ఏపీ కేబినెట్ పచ్చజెండా

కడపలో ఉక్కు పరిశ్రమకు ఏపీ కేబినెట్ పచ్చజెండా

06-11-2018

కడపలో ఉక్కు పరిశ్రమకు ఏపీ కేబినెట్ పచ్చజెండా

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అమరావతిలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరిగింది. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు రూ.18వేల కోట్ల వ్యయం అవుతుందని అంచనాకు వచ్చి, ఆ మొత్తాన్ని బ్యాంకుల నుంచి రుణ సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు సమాచారం. మూడు మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటుకు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం పట్ల కేంద్రం చూపుతున్న వివక్షపైనా మంత్రివర్గంలో కీలకంగా చర్చించారు.

దొనకొండ మెగా ఇండస్ట్రీయల్‌ హబ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాయలసీమ స్టీల్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయించింది. రామాయపట్నం పోర్టు ఏర్పాటు పైనా ఈ సమావేశంలో కీలక చర్చ జరిగింది. గ్రామీణ నీటి సరఫరా కోసం భారీగా అవసరమయ్యే నిధులను సమీకరించాలని నిర్ణయించారు. 2019 జనవరి 31 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో అన్న క్యాంటిన్లు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. విశాఖ ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో మార్పులు చేర్పులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు పిపిపి విధానంలో చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం.