వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

25-05-2019

వైఎస్‌ జగన్‌ ప్రమాణస్వీకారానికి వేదిక ఖరారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వేదిక ఖరారు అయింది. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఆయన ఈ నెల 30వ తేదీన ప్రమాణం చేయనున్నారు. ప్రధానంగా ఈ స్టేడియంలో 35 వేల మంది గ్యాలరీల్లో కూర్చొనే అవకాశం ఉండడం, దిగువన మరో 20 వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉండటంతో అధికారులు ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మొత్తం 50వేల మందికి పైగా కూర్చొనే వెసులుబాటు ఉంది. ఈ మేరకు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులను ఆదేశించారు. పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యే అవకాశం ఉండటంతో ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏయే శాఖలు ఏర్పాట్లు చేయాలన్న దానిపై సీఎస్‌ దిశానిర్దేశం చేశారు. పోలీస్‌, మున్సిపల్‌, ప్రోటోకాల్‌, సమాచార తదితర 15 శాఖల ఉన్నతాధికారులు సమీక్ష జరిపారు. ప్రమాణస్వీకారోత్సవానికి తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌తో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఇతర వీవీఐపీలంతా హాజరయ్యే అవకాశం ఉండటంతో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.