ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం
Nela Ticket
Kizen
APEDB

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

20-03-2017

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించింది. కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, వైకాపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా కడప ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకున్న తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైకాపాకు గట్టి షాకే ఇచ్చింది. 40 ఏళ్ల వైస్‌ కంచుకోటను తాము బద్దలు కొట్టామంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు.

కడప స్థానిక సంస్థల ఎన్నికల స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి రవీంద్రనాథరెడ్డి (బీటెక్‌ రవి) వైకాపా అభ్యర్థి వైఎస్‌ వివేకానందరెడ్డిపై విజయకేతనం ఎగురవేశారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి 433 ఓట్లు రాగా, వైకాపాకు 399 ఓట్లు వచ్చాయి. బీటెక్‌ రవి 34 ఓట్ల తేడాతో గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. వైకాపా అభ్యర్థి గౌరు వెంకటరెడ్డిపై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శిల్పా చక్రపాణిరెడ్డి 64 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 565 ఓట్లు రాగా, వైకాపాకు 501 ఓట్లు వచ్చాయి.  నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైకాపా అభ్యర్థి ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పై తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాకాటి నారాయణరెడ్డి విజయం సాధించారు. మొత్తం ఐదు రెవెన్యూ డివిన్ల పరిధిలో 852 ఓట్లుండగా, ఎన్నికల్లో 851 ఓట్లు పోలయ్యాయి. అందులో 465 ఓట్లు తెలుగుదేశం పార్టీకి, 378 ఓట్లు వైకాపాకు వచ్చినట్లు కలెక్టర్‌ ముత్యాలరాజు తెలిపారు.