మడమ తిప్పనన్న జగన్ ఇప్పుడు ఏం చేస్తాడన్న చంద్రబాబు

మడమ తిప్పనన్న జగన్ ఇప్పుడు ఏం చేస్తాడన్న చంద్రబాబు

28-08-2017

మడమ తిప్పనన్న జగన్ ఇప్పుడు ఏం చేస్తాడన్న చంద్రబాబు

వైసీపీ అధినేత జగన్ నిజంగా మడమ తిప్పని వాడైతే వెంటనే తమ పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే జూన్ నెలలో జగన్ తన ఎంపీల చేత రాజీనామా చేయిస్తానని చెప్పారని, కాని ఆ విషయం ప్రస్తావించకుండా 20 మంది ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించమంటున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేలు టీడీపీ చేస్తున్న అభివృద్ధిని చూసే వచ్చారన్నారు. ఎన్నికల పేరుతో అభివృద్ధిని కుంటుపర్చలేనని, అంతగా ఎన్నికలకు ఉత్సాహం ఉంటే ఎంపీల చేత రాజీనామా చేయించాలని సవాల్ విసిరారు.

చారిత్రాత్మక విజయం……..

నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీది చారిత్రాత్మక విజయమన్నారు చంద్రబాబు. నంద్యాలలో గెలుపును తాను ముందే ఊహించారన్నారు. అనేక మార్గాల ద్వారా తనకు అందిన సమాచారం మేరకు నంద్యాలలో భారీ మెజారిటీతో గెలుస్తున్నట్లు తనకు ముందుగానే తెలుసునన్నారు. తాను ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వంటి నేతలతోనే ఎదుర్కొన్నానన్నారు. వ్యక్తిగత దూషణలకు దిగిన జగన్ కు నంద్యాల ప్రజలే బుద్ధి చెప్పారన్నారు. ఇటువంటి ప్రతిపక్షాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదన్నారు. తన మీద నమ్మకంతోనే 2014 ఎన్నికల్లోనూ ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని చంద్రబాబు చెప్పారు. ఇప్పటికైనా జగన్ ఆత్మవిమర్శ చేసుకుని ఏపీలో అభివృద్ధికి సహకరించాలని కోరారు. విశ్వసనీయతే గెలిపించిందని చంద్రబాబు మీడియా సమావేశంలో వెల్లడించారు.