మేయర్‌ పదవికి పోటాపోటీ

మేయర్‌ పదవికి పోటాపోటీ

03-09-2017

మేయర్‌ పదవికి పోటాపోటీ

రేసులో కార్పొరేటర్లు శివప్రసన్న, పావని, వరలక్ష్మి, శేషుకుమారి 

ముఖ్యమంత్రి నిర్ణయం కోసం నేతల ఎదురుచూపు 

కాకినాడ నగరపాలక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం మేయర్‌ అభ్యర్థి ఎంపికపై దృష్టి సారించింది. కాకినాడ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని సమర్థవంతమైన అభ్యర్థిని మేయర్‌గా నియమించేందుకు తెదేపా నేతలు కసరత్తు ప్రారంభించారు. కాకినాడ నగరపాలక మేయర్‌ పదవిని జనరల్‌ మహిళకు కేటాయించిన నేపథ్యంలో తమ పార్టీ తరఫున ఈ పదవిని కాపు సామాజిక వర్గానికే కేటాయిస్తామని ఎన్నికలకు ముందే తెదేపా నాయకత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితిలో ఎన్నికల్లో గెలుపొందిన ఆ సామాజిక వర్గానికి చెందిన నలుగురు కార్పొరేటర్లు ప్రస్తుతం మేయర్‌ రేసులో ఉన్నారు. వీరికి సంబంధించి పూర్తి వివరాలను పార్టీ అధిష్ఠానానికి పంపి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయానికి వదిలేయాలని నేతలు నిర్ణయించారు. నగరపాలక సంస్థలో ఎన్నికలు జరిగిన 48 డివిజన్లలో 35 స్థానాలను తెదేపా, భాజపా కూటమి కైవసం చేసుకోగా రెబల్స్‌గా గెలుపొందిన మరో ముగ్గురు కూడా ఆ పార్టీకి అనుబంధంగానే ఉన్నారు. తెదేపా తరఫున కార్పొరేటర్లుగా గెలుపొందిన వారిలో సుంకర శివప్రసన్న, సుంకర పావని, అడ్డూరి వరలక్ష్మి, మాకినీడు శేషుకుమారి మేయర్‌ పదవికి ప్రధానంగా పోటీ పడుతున్నారు. వీరితో పాటు మరో నలుగురు కూడా మేయర్‌ పదవి కోసం తెరవెనుక ప్రయత్నాలు సాగిస్తున్నారు. కాకినాడ నగరపాలక సంస్థలో 30 ఏళ్ల తరువాత తెదేపాకు అవకాశం రావడం, స్మార్ట్‌సిటీ అభివృద్ధికి సంబంధించిన పనులు పెద్ద ఎత్తున చేపట్టాల్సి ఉండడంతో మేయర్‌ ఎంపిక ప్రతిష్టాత్మకంగా మారింది.ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయంపై ప్రస్తుతం అందరి దృష్టీ కేంద్రీకృతమైంది.

వైకాపా ఓటమిపై మథనం 

కాకినాడ నగరపాలక ఎన్నికల్లో వైకాపా ఓటమిని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జీర్ణించుకోలేక పోతున్నారు. దీనికి తారితీసిన కారణాలను వారు అన్వేషిస్తున్నారు. కాకినాడలో ప్రజల మద్దతు తమకే ఉందని, విజయం ఖాయమన్న ధీమాతో ఉన్న వైకాపా కేవలం 10 డివిజన్లకే పరిమితం అవడం వారిని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. దీనికి ఎవరు బాధ్యులన్న విషయంపై నేతలు సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. సీట్ల పంపిణీ సమయంలోనే మూడు గ్రూపులుగా విడిపోయిన వైకాపా నేతలు తమ అభ్యర్థులకు అవకాశం కల్పించేందుకు పోటీపడ్డారు. ఈ సందర్భంగా సర్దుబాట్లు చేయడంలో విఫలమైన నాయకులు సొంత వర్గాన్ని దెబ్బతీసుకునే చర్యలకు దిగడంపై పార్టీ ముఖ్య నేతలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

తెదేపా నేతల్లోనూ చర్చ 

కాకినాడ నగరంలో జగన్నాథపురం పరిధిలో అయిదు డివిజన్లలో తెదేపా ఓటమి చెందడంపై ఆ పార్టీ నేతలనూ తీవ్ర ఆందోళనకు గురిచేసింది. దీనికి దారితీసిన పరిస్థితులను వారు విశ్లేషించుకుంటున్నారు. ఈ ప్రాంతంలో తెదేపాకు 10కి పైగా డివిజన్లు వస్తాయన్న నమ్మకంతో ఉన్న నేతలకు అయిదు స్థానాల్లో వైకాపాకు గెలవడం మింగుడుపడడం లేదు. అభ్యర్థుల ఎంపిక, సామాజిక సమీకరణాల్లో సరైన ప్రాతినిధ్యం కల్పించక పోవడం, అందరినీ కలుపుకోకపోవడం తదితర కారణాల వల్లే పార్టీకి బలం ఉన్న చోట ఓటమిపాలైనట్లు తెదేపా నేతలు పేర్కొంటున్నారు. ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దేందుకు పార్టీ నాయకులు రంగంలోకి దిగారు.జగన్నాథపురంలో నేతలు, కార్యకర్తలకు మధ్య అంతరం ఉంది. ఇక్కడ అయిదు స్థానాలను కోల్పోవడంపై తెదేపా నాయకత్వం సీరియస్‌గా పరిగణించింది.