అమెరికాలో దుండగుడి కాల్పుల్లో మృతిచెందిన శరత్ కుటుంబసభ్యులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్ పరామర్శించారు. శరత్ మృతిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం ఆదేశాలమేరకు శరత్ భౌతికకాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. షికాగో కాన్సులేట్ అధికారులతో చర్చిస్తున్నట్లు తెలిపారు. జరిగింది హత్యకావడం శని, అదివారాలు సెలవుదినాలు అయినందువల్ల ఏర్పాట్లలో ఆలస్యమవుతున్నదని చెప్పారు. శరత్ కుటుంబసభ్యులు ఎవరైనా అమెరికా వెళ్లాలనుకుంటే వీసా, ఇతర ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. భాదిత కుటుంబసభ్యులకు ప్రభుత్వం అండగా నిలస్తుందని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి భరోసా ఇచ్చారు.