పాపం 'కాకా' తనయులు...

పాపం 'కాకా' తనయులు...

16-10-2018

పాపం 'కాకా' తనయులు...

ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో అగ్రశ్రేణి నాయకుల్లో ఒకరిగా ముద్రపడిన  మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి (కాకా) పోయిన తరువాత ఆయన వారసులుగా ఉన్న కుమారులు గడ్డం వినోద్‌, వివేక్‌ల రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. కాంగ్రెస్‌ పార్టీని వదలి అధికారపార్టీలో ఉంటే ప్రయోజనం లభిస్తుందన్న ఆశతో టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ మంత్రి గడ్డం వినోద్‌కు పార్టీ టికెట్‌ దక్కలేదు. ఆయన చెన్నూర్‌ అసెంబ్లీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకొని నిరీక్షించి భంగపడ్డారు. తనకు టికెట్‌ దక్కకపోవడంపై బాహాటంగానే వినోద్‌ అసంతృప్తి వెళ్లగక్కారు.

కాంగ్రెస్‌ నుండి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముందునుండి అసహనం వ్యక్తం చేస్తున్న వినోద్‌కు ఈసారి టికెట్‌ రాకపోవడంపై ఆయన వర్గీయులు అలకపాన్పెక్కారు. బాల్క సుమన్‌కు మద్దతుగా ప్రచారం సాగించలేమని, అభ్యర్థిత్వాన్ని మార్చి వినోద్‌కు ఇవ్వాలని రెండుసార్లు వినోద్‌ వర్గీయులు సమావేశం నిర్వహించుకోవడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వద్దన్నా వినకుండా వివేక్‌ చొరవతోనే తాను టీఆర్‌ఎస్‌లోకి వెళ్ళాల్సి వచ్చిందని, పెద్దపెల్లి ఎంపీ టికెట్‌ వివేక్‌కు, చెన్నూర్‌ లేదా బెల్లంపల్లి స్థానాల్లో తనకు ఇస్తామని ఆశచూపి మోసం చేశారని వినోద్‌ కార్యకర్తల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తమ్ముడు వివేక్‌ తీరుపై గుర్రుగా ఉన్న వినోద్‌ కాంగ్రెస్‌ పెద్దలతో ఉన్న అనుబంధం మేరకు ఆపార్టీలో చేరేందుకు సీనియర్లతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలిసింది.

మంత్రి కేటీఆర్‌తో భేటీ అయిన వినోద్‌ వర్గీయులకు ఎట్టిపరిస్థితుల్లోనూ బాల్క సుమన్‌ను మార్చేది లేదని తేల్చిచెప్పడంతో తాము ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తామని వినోద్‌ వర్గీయులు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. కాంగ్రెస్‌లో చేరితే పెద్దపల్లి ఎంపి టికెట్‌ వివేక్‌కు, చెన్నూర్‌ లేదా బెల్లంపల్లి స్థానాలను వినోద్‌కు కట్టబెడుతామని కాంగ్రెస్‌ సీనియర్లు హామీ ఇచ్చినట్లు తెలిసింది. వెంకటస్వామితో పార్టీకి ఉన్న అనుబంధం మేరకు రెండు టికెట్లపై భరోసా ఇచ్చినట్లు సమాచారం.

మరోవైపు ప్రభుత్వ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న జి.వివేక్‌ ఆచితూచి అడుగేస్తున్నట్లు సమాచారం. తాను మాత్రం టీఆర్‌ఎస్‌తో తెగతెంపులు చేసుకొని తాడోపేడో తేల్చుకునేందుకు వినోద్‌ సన్నద్దమవుతుండగా కార్యకర్తలు కూడా ఆయన వెన్నంటూ ఉంటామని మద్దతు ప్రకటించడం గమనార్హం. తాజాగా మారిన పరిణామాలపై జి.వినోద్‌ను వివరణ కోరగా కార్యకర్తలు పోటీ చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, అధిష్టాన వైఖరిలో మార్పువస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కార్యకర్తలు, అభిమానుల అభిమతం మేరకే తాను రాజకీయ నిర్ణయం తీసుకుంటానని, ప్రస్తుతం ఏమీ మాట్లాడలేనని స్పష్టం చేయడం గమనార్హం.