నోటా...పెరిగితే అభ్యర్థి విలువ తగ్గినట్లే!

నోటా...పెరిగితే అభ్యర్థి విలువ తగ్గినట్లే!

16-10-2018

నోటా...పెరిగితే అభ్యర్థి విలువ తగ్గినట్లే!

ఎన్నికల సమయంలో అభ్యర్థులు చేసే వాగ్దానాలకు, మాటలకు ఒక్కోసారి అంతులేకుండా పోతుంది. శుష్కవాగ్దానాలతో, కల్లబొల్లి కబుర్లతో ఓటర్లను ఏమార్చి వారితో ఓట్లు వేయించుకుని తరువాత మొహం తిప్పే అభ్యర్థుల వైఖరిపై ఏమీ చేయాలో తెలియక, ఎలా ఆగ్రహం వ్యక్తం చేయాలో తెలియక ప్రజలు కొట్టుమిట్టాడేవారు. ఇలాంటి సమయంలో వారికి లభించిన ఆయుధం 'నోటా'. మాటలగారడీ అభ్యర్థులను తాము ఎన్నుకోలేమంటూ వారిని తిరస్కరిస్తూ నోటాతోవారికి చెక్‌ పెట్టేందుకు ఓటర్‌కు ఇప్పుడు అవకాశం?లభించింది.

ప్రజాస్వామ్యంలో ఓటే ప్రధాన ఆయుధం. ప్రజలు ఓటేస్తే గెలుస్తారు. వేయకపోతే ఓడిపోతారు. మరి తిరస్కరిస్తే.. చెల్లకుండా పోతారు. ఇప్పుడు చెల్లని ఓట్ల కంటే కూడా చెల్లని అభ్యర్థుల సంఖ్య పెరిగిపోతోంది. ఈవీఎమ్‌ల పుణ్యమా అని ప్రజాస్వామ్య భారతంలో ప్రజలకు ఈ మహదవకాశం దక్కింది. ఉన్న వారిలో ఎవరో ఒకర్ని చచ్చినట్టు ఎన్ను కోవాల్సిన పనిలేదు. వారెవరూ వద్దనుకునే ఆప్షన్‌ అందిరావడంతో జనం రోజురోజుకూ, ఎన్నిక ఎన్నికకూ నోటా బాట పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఉన్న అభ్యర్థుల కంటే 'నోటా'కాటుపడ్డ ఓట్లే ఎక్కువగా ఉన్న దాఖలాలూ ఉన్నాయి. ఓటు హక్కు ఎంత ముఖ్యమో..దాన్ని అంతే పవిత్రంగా, నిబద్ధంగా వినియోగించడమూ అంతే రాజ్యాంగ అవసరం. రాజ్యాంగం మనకు కల్పించిన ఈ ఓటు హక్కు మాటలతో మైమరపించి, అరచేతిలో వైకుంఠం చూపించి తరువాత మరచిపోయే అభ్యర్థులకు తగిన శాస్తిని నోటా ద్వారా చేయవచ్చు. నోటా నొక్కడం ద్వారా తాను మిమ్మల్ని నమ్మలేనని మొహం మీదనే చెప్పేయవచ్చు.

నమ్మి ఓటు వేయడం కంటే నమ్మకం లేదని చెప్పడమే మేలనుకునే యువత సంఖ్య పెరుగుతోంది. అందుకే నోటా పదునెక్కుతోంది. మాయమాటలు చెప్పి..ఓటర్లను బుట్టలో వేసుకున్నామనుకుంటే అది భ్రమేనన్న చైతన్యం పెరుగుతోంది. అందుకే నోటా కాటు పడకూడదనుకుంటే నోటి మాటకు విలువివ్వాలి. చేయగలిగేదే చెప్పాలి. నిజాయితీని నిలబెట్టుకోవాలి. ఓటు మాట ఎలా ఉన్నా ముందు నోటా బారిన పడకుండా తమ పరువును కాపాడుకోవాల్సిన అగత్యం ఇప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులకూ ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో ఏదైనా చేయవచ్చు అని అనుకునే అభ్యర్థులకు నోటా ఓ గుణపాఠం. నోటా ఎక్కువైతే ఆ అభ్యర్థి విలువ తగ్గినట్లే.