మారిన టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం

మారిన టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం

16-10-2018

మారిన టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహం

తెలంగాణ శాసనసభ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పటికప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది. తాజాగా మరోసారి కేసీఆర్‌ను గెలిపించండి అన్న నినాదంతో ముందుకెళ్ళాలని అనుకుంటోంది. గత ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌ను ఉపయోగించుకుని, అధికార పగ్గాలు చేపట్టిన ఉద్యమ పార్టీ అధినాయకుడు కే. చంద్రశేఖర్‌రావు ప్రభుత్వాధినేతగా నాలుగున్నర ఏళ్ళ కాలంలో చేపట్టిన పలు అభివ ద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు వాటిపై విస్తృత ప్రచారాన్ని చేసి తనకు రావాల్సిన ఇమేజ్‌ను కేసీఆర్‌ తెచ్చుకున్నారు. తాను ప్రవేశపెట్టిన వినూత్న పథకాల వల్ల తెలంగాణ ప్రజలలో అధిక సంఖ్యాకులు ఎలా లబ్ది పొందుతున్నరో అన్న అంశాలు, ఎన్నికల నాటికి ప్రజలలోకి బలంగా చొప్పించడంలో కూడా ఆయన సఫలీకతులయ్యారు. కాకపోతే ఈ ఎన్నికల్లో ఆయన తన కుమారుడు కే. తారకరామారావుకు ప్రధాన బాధ్యతను అప్పగిస్తూ చేస్తున్న ప్రచారం కొంతమందిలో సందేహాన్ని సృష్టించింది.

కాబోయే ముఖ్యమంత్రిగా తన కుమారుడిని నియమించాలని కేసీఆర్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలతో ప్రారంభించి, కేటిఆర్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తూ, చివరకు కొంగర కలాన్‌ ప్రగతి నివేదన సభ ఏర్పాట్లు, నిర్వహణ బాధ్యతను తనయునికే అప్పగించడం, ప్రకటిత అభ్యర్థుల నియోజకవర్గాలలో చోటుచేసుకుంటున్న అసమ్మతి, అసంతప్తుల బుజ్జగింపులు, సమయోచిత నిర్ణయాల బాధ్యతలను కేటిఆర్‌కే అప్పగించడం, హరీష్‌రావు సైతం, కేటిఆర్‌ సీఎం అయి, ఆయన వద్ద మంత్రిగా పని చేయడానికి సిద్దమని, పని గట్టుకుని ప్రకటించడంతో తెరాస అధినేత, యువరాజు పట్టాభిషేకానికి రూట్‌ క్లియర్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఎన్నికల్లో ఊహించని విధంగా అనూహ్య రీతిలో ఆజన్మ విరోధులైన జాతీయ కాంగ్రెస్‌, ప్రాంతీయ టీడీపీ, కొత్తగా మొగ్గ తొడగనున్న టీజీఎస్‌లు మహా కూటమిగా ఏర్పడటం, పార్టీలో పెరిగిన అసమ్మతి టీఆర్‌ఎస్‌కు ఆందోళనను కలిగించింది. వారి పొత్తులు, సర్దుబాట్లు, ఓట్ల మార్పిడీలు అనుకున్నట్లుగా జరిగితే, ప్రస్తుతం తెరాస ప్రభుత్వ అభివద్ధి, సంక్షేమ కార్యక్రమాలవల్ల తమకు పూర్తి విజయం లభిస్తుందా లేదా అన్న అభద్రతాభావం టీఆర్‌ఎస్‌లో కలిగింది. దీనివల్లే కేసీఆర్‌ తన ప్రచారంలో తిట్లపర్వాన్ని ఎత్తుకున్నారని తెలుస్తోంది.

కేసిఆర్‌, నాలుగేళ్ళ పాలనలో చేపట్టిన పలు సంక్షేమ, అభివ ద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలలో ఆయన పరిపాలన పట్ల అధిక శాతం సానుకూల వైఖరి ఉంది. ప్రధానంగా లబ్దిదారుల ఓటు బ్యాంకే తమకు మరోసారి అధికార పీఠాన్ని హస్తగతం చేయగలదనే ఆత్మవిశ్వాసం కేసిఆర్‌కు ఉంది. ఈ ఎన్నికల్లో తెరాస అధికారాన్ని తిరిగి దక్కించు కోగలిగితే, కేటిఆర్‌ను ముఖ్యమంత్రి చేస్తారనే భావన, ఇటు తెరాస శ్రేణుల్లో, అటు సీనియర్లలో, ప్రజల నోళ్ళలో ప్రస్తుతం నానుతున్న అంశం. కాబోయే ప్రతిపాదిత ముఖ్యమంత్రిగా తారక రాముడి విషయం ప్రధానంగా ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపనుందో అన్న అనుమానాలతో, అసలుకే మోసం వస్తే ఎలా అన్న సందేహాలతో, తెరాస నాయకులు ప్రస్తుతం మరోసారి తమ వ్యూహాన్ని మార్చుకున్నారు. ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని చెబుతూ ప్రచారాన్ని చేపట్టారు. 'ఔర్‌ ఏక్‌ బార్‌ కేసిఆర్‌' నినాదంతో ముందుకు సాగాలని, ఈ నినాదాన్నే ప్రజలలోకి చొప్పించాలని అధికార పార్టీ నాయకులు నిర్ణయించుకున్నారు. దానికి తగ్గట్టుగా ప్రచారాన్ని చేస్తున్నారు.