సమాన అవకాశాలివ్వని పార్టీలు

సమాన అవకాశాలివ్వని పార్టీలు

16-11-2018

సమాన అవకాశాలివ్వని పార్టీలు

'అన్ని రంగాల్లోనూ పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. ఆకాశంలో సగం, అవకాశాల్లో సగ్ఞం అంటూ హడావిడి చేసే రాజకీయ పార్టీలు టిక్కెట్ల కేటాయింపులో మాత్రం మహిళలకు మొండి చెయ్యి చూపించింది. మహిళలు అన్ని రంగాల్లోనూ అంటే ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో ముందుండాలి అనే రాజకీయ పార్టీల నినాదాలు వాటిని అమలు చేయడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో మొక్కుబడిగా అసెంబ్లీ టిక్కెట్లు కేటాయించి మహిళలకు తగిన స్థానం కల్పించ లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్‌), కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలను పరిగణలోకి తీసుకుంటే మహిళలకు అంతంత మాత్రంగానే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాయి. టిఆర్‌ఎస్‌ పార్టీ 4గురు మహిళలకు సీట్లు కేటాయించగా, మహాకూటమిలోని కాంగ్రెస్‌ పార్టీ 10 మందికి, బిజెపి 9 మందికి టిక్కెట్లు ఇచ్చాయి. మహిళల ఆత్మాభిమానం కాపాడుతున్నామంటూ పదేపదే ప్రకటించే తెలుగుదేశం పార్టీ అయితే ఒక్క స్థానాన్ని కూడా మహిళలకు కేటాయించ లేదు. టిఆర్‌ఎస్‌ నుండి రేఖా నాయక్‌, కోవా లక్ష్మి, పద్మాదేవేందర్‌రెడ్డి, గొంగడి సునీతలకు టిక్కెట్లు కేటాయించారు. అటు బిజెపి బోధ్‌ నుండి మాధవిరాజ్‌, నిర్మల్‌ నుండి సువర?రెడ్డి, ముధోల్‌ స్థానం నుండి రమాదేవి, భద్రాచలం నుండి కుంజా సత్యవతి, భూపాల్‌పల్లి నుండి కీర్తిరెడ్డి, వైరా స్థానం నుండి రేష్మ, ఇల్లందు నుండి నాగస్రవంతి, చాంద్రాయణగుట్ట నుండి షాహెజాద్‌, రామగుండం స్థానం నుండి వనితలను ఎన్నికల బరిలోకి దించుతున్నట్లు ప్రకటించింది.

మరోవైపు కాంగ్రెస్‌ పార్టీ తొలి విడత, రెండో విడత జాబితాలో 10 చోట్ల మహిళలకు టిక్కెట్లను కేటాయించింది. వాలిల్లో ఆదిలాబాద్‌ నుండి సుజాత, ఆర్మూర్‌ స్థానాన్ని ఆకుల లలితకు, స్టేషన్‌ఘనపూర్‌ నుండి ఇందిర, పరకాల నుండి కొండా సురేఖలకు పార్టీ టిక్కెట్లను కేటాయించింది. అలాగే ములుగు నుండి సీతక్క, గద్వాల నుండి డికె అరుణ, మహేశ్వరం స్థానం నుండి సబితాఇంద్రారెడ్డి, జహీరాబాద్‌ నుండి గీతారెడ్డి, నర్సాపూర్‌ స్థానం నుండి సునీతాలక్ష్మారెడ్డి, కోదాడ నుండి పద్మావతిరెడ్డిలను ఎన్నికల బరిలోకి దింపింది. ఈవిధంగా ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ 10 స్థానాలు కేటాయించి ముందుండగా, బిజెపి 9 స్థానాలతో రెండో స్థానం, టిఆర్‌ఎస్‌ 4 సీట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకూ ప్రకటించిన తొమ్మిది స్థానాల్లో ఒక్క మహిళా అభ్యర్థిని లేకపోవడం గమనార్హం.