అధినేతల ప్రచార హోరు....

అధినేతల ప్రచార హోరు....

17-11-2018

అధినేతల ప్రచార హోరు....

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం తరువాత తమ ప్రచారాన్ని ముమ్మరం?చేయాలని అన్నీ పార్టీల ప్రధాన నాయకులు నిర్ణయించుకున్నారు. తెలంగాణలో ప్రచార హోరు పెరగడటంతో ఆయా పార్టీల అధినేతలు రంగంలోకి దిగనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. తమ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రచార జోరును పెంచనున్నారు. డిసెంబర్‌ మొదటి వారంలో ప్రధాని నరేంద్రమోడీ మూడు నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. ఈనెల 25,27,28 తేదీల్లో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ప్రచారం చేయనున్నారు. రోజుకు నాలుగు నియోజకవర్గాల చొప్పున మొత్తం 12 నియోజకవర్గాల్లో పర్యటన చేయనున్నారు.

ఉత్తరప్రదేశ్‌ ముఖ్య మంత్రి యోగి ఆధిత్యనాధ్‌, పలువురు కేంద్ర మంత్రులు రానున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు, బిజెపి జాతీయ నేతలు తెలంగాణలో బిజెపి అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్నారు. అమిత్‌షా ఇటీవలే ఉత్తర తెలంగాణలో ఒక బహిరంగ సభలో పాల్గొని, హైదరాబాద్‌లో కీలక సమావేశం నిర్వహించారు. సెట్లర్లు ఉన్న చోట ఆంధ్రప్రదేశ్‌ నుంచి బిజెపి నేతలు కూడా వచ్చి అంతర్గత ప్రచారం చేస్తున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నేతలు కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. కాంగ్రెస్‌ నేతత్వంలోని మహాకూటమి సీట్ల సర్దుబాటు దాదాపు ముగిసినందున ఎఐసిసి జాతీయ అధ్యక్షులు రాహుల్‌గాంధీ వచ్చే వారంలో ఎన్నికల ప్రచారానికి రానున్నారు. ఇప్పటికే రాహుల్‌ గాంధీ ఒక దశ ప్రచారం చేశారు. ఇప్పుడు పలు బహిరంగసభల్లో, రోడ్‌ షోలలో పాల్గొననున్నారు.

సోనియాగాంధీ ఈనెల 23 తర్వాత బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మధ్య మధ్యలో కాంగ్రెస్‌ అగ్రనేతలు కూడా రానున్నారు.ప్రియాంకగాందీ కూడా ఎన్నికల ప్రచారానికి రావచ్చునని ప్రచారం జరుగుతుంది. తెలంగాణ కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపేయినర్‌ విజయశాంతి పలు సభల్లో పాల్గొన్నారు.మహా కూటమిలో భాగస్వామ్యమైన టిడిపి కూడా తన వంతు గా ప్రచారానికి అగ్ర నేతలను పిలుస్తున్నది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, రెండు,మూడు సభల్లో పాల్గొనే అవకాశం ఉంది. నందమూరి హరిక్రిష్ణ కుమార్తె ఎన్నికల బరిలోకి దిగుతున్నందున స్టార్‌ క్యాంపేయినర్లుగా బాలక్రిష్ణ జూనియర్‌ ఎన్టీఆర్‌, కళ్యాణ్‌రామ్‌ కూడా ప్రచారానికి రావచ్చునని తెలుస్తోంది.

తెలంగాణ జన సమితి అధినేత ప్రొఫెసర్‌ కోదండరామ్‌ జనగామ్‌ నుంచి పోటీ చేయకపోతే ఎన్నికల ప్రచారంలో విస్తతంగా పాల్గొనే అవకాశం ఉంది. సిపిఐ జాతీయ స్థాయి నేతలు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. టిఆర్‌ఎస్‌ అధినేత, ఆపధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండో విడత ఎన్నికల ప్రచారానికి సన్నద్దమవుతున్నారు. ఇది వరకే పలు ఉమ్మడి జిల్లాల వారీగా మూడు బహిరంగసభల్లో కెసిఆర్‌ పాల్గొన్నారు. అభ్యర్థుల ప్రకటనకు ముందు కొంగర కాలన్‌లో జరిగిన ప్రగతి నివేదన సభ ద్వారానే ఎన్నికల ప్రచారానికి శంఖారావం ఊదారు. డిసెంబర్‌ 3వ తేదీలోగా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున టిఆర్‌ఎస్‌ నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.