తెలంగాణ ఎన్నికల్లో అంతా ఓపెన్ సీక్రెటే!

తెలంగాణ ఎన్నికల్లో అంతా ఓపెన్ సీక్రెటే!

20-11-2018

తెలంగాణ ఎన్నికల్లో అంతా ఓపెన్ సీక్రెటే!

తెలంగాణలో అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికల్లో బహిరంగంగానే అభ్యర్థులు డబ్బులను నీళ్ళులాగా ఖర్చుపెడుతున్నారు.  ఎన్నికల్లో పోటీకే కోట్లాది రూపాయలను ఇచ్చినట్లు వస్తున్న వార్తలు నిజమైతే, ఇక విజయంకోసం?కూడా వారు కోట్లను ఖర్చుపెట్టడానికి సిద్ధమవుతారు. ఇప్పటికే చాలామంది. తమ ఎన్నికల నిధుల కోసం ఆస్తులను విక్రయిస్తూ రంగంలోకి దిగుతున్నారు.

టికెట్లు ఇవ్వడానికి ఏం కావాలో చెప్పాలని పార్టీ పెద్దలను అడుగుతున్న నేతలు, ఓటర్లను ఆకర్షించడానికి ఆడంబర ప్రచారానికీ వెనుకాడటం లేదు. ప్రధానంగా సంపన్నులు, వివిధ పార్టీలలోని కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో పరిస్థితి అంచనాకు అందడం లేదు. ఈ ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టే ఖర్చు దాదాపు 5వేల కోట్లు దాటవచ్చన్నది ఓ అంచనా. ముఖ్యంగా రాష్ట్రంలోని పదిహేను నియోజకవర్గాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. ఈ ఎన్నికల్లో ఖర్చులకు ఎవరూ అదరడంలేదు. పెరిగిన ఆర్ధిక స్థోమత, ఆస్తుల విలువల అమాంతపై పెరుగుదలతో డబ్బుకు విలువ లేకుండాపోతోంది. గతంలో ఎన్నికల్లో ఎంత ఖర్చుపెడితే అంత నామోషీగా ఫీలయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు ఇదే గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎన్నారైలు, వ్యాపారులు, రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడిదారులు, ఐటీ కంపెనీల అనుయాయులు ఎన్నికల రంగంలోకి కాలుమోపడంతో ఖర్చులు గణనీయంగా పెరిగాయి. దీంతో ఎన్నికల ఖర్చుల కోసం అభ్యర్థులు ఆస్తులు అమ్ముకుంటున్నారు. తాజాగా రాష్ట్రంలో స్థిరాస్తుల క్రయవిక్రయాలు గడచిన రెండు నెలలుగా ఊపందుకున్నాయి. ప్లాట్లు, ఓపెన్‌ స్థలాలు భారీగా విక్రయాలు జరిగిపోతున్నాయి. గతంలో ఎన్నికలు సమీపించగానే రియల్‌ వ్యాపారం తగ్గేది. కానీ ఈ ఏడాది అందుకు భిన్నంగా స్థిరాస్తులు అమ్మి నగదును రెడీ చేసుకుంటున్న నేతలు ఎక్కువగా కనిపిస్తున్నారు.. వారు తమ అనుయాయులు, సమీప బంధువులు, ఇతరుల బినామీల పేర్లమీద ఉన్న ఆస్తుల కూడా అమ్మి నగదు కూడబెడుతున్నారు.

గతంలో ఎన్నికల సమయం, ప్రచారం అంతా కలిపితే 30 రోజుల్లోపే పూర్తయ్యేది. కానీ ఇప్పుడు తెలంగాణ ముందస్తు ఎన్నికలతో 90 రోజుల సమయం ప్రజలకు పండగ వాతావరణం తెచ్చింది. అసెంబ్లిరద్దైన వెంటనే టీఆర్‌ఎస్‌ 105 మంది అభ్యర్ధులను ప్రకటించింది. వారు వెంటనే ఎన్నికల గోదాలోకి దూకారు. ప్రచార పర్వానికి తెరలేపారు. ఇంకేముంది నాటినుంచే ఖర్చులు షురూ అయ్యాయి. ఒక్కో అభ్యర్ధి రోజుకు రూ. 2లక్షలకుపైగా ఖర్చు చేయడం బహిరంగ రహస్యమే. ఆపార్టీ ఈ పార్టీ అని కాకుండా పోటీలో నిల్చేందుకు రెడీగా ఉన్న ఆశావహులు కూడా అప్పుడే ప్రచారం ఆరంభించారు. దీంతో ఖర్చుకు లెక్కాజమా లేకుండా పోతోంది.

ప్రచారంలో నీళ్లలా ఖర్చు

పోటీలో ఉన్న అభ్యర్ధి వాహనాలు, మంది మార్బలం, ఇంటింటి ప్రచారం ఉదయమే ఖర్చులతో స్టార్ట్‌ అవుతోంది. పొద్దున్నే 200 లేదా 300 మందికి మించిన కార్యకర్తలతో అల్పాహారంతో ప్రారంభిస్తున్నారు. అక్కడినుంచి ఖర్చులు సాయంత్రం మందు పార్టీదాకా ఆగకుండా భరించాల్సిందే. మధ్యాహన్‌ం భోజనం, రాత్రి డిన్నర్‌, ఆ తర్వాత మందుతో విందు కామన్‌గా అలవాటుగా మారాయి. ఈ విషయంలో విపక్షాలు కొంత వెసులుబాటును పొందాయి. వారు ఇప్పుడిప్పుడే అభ్యర్ధులను ప్రకటించడంతో వీరికీ ఇకపై తప్పనిసరి అవుతోంది.

గ్రామస్థాయినుంచీ ఖర్చులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఒక్కో నియోజకవర్గంలో రూ. 10నుంచి రూ. 20కోట్లకు ఖర్చు మించనుంది. మరో 15నుంచి 25 చోట్ల పోటీ తీవ్రంగా ఉన్న ప్రతిష్టాత్మక నియోజకవర్గాల్లో ఖర్చు రూ. 300కోట్లకుపైగానే ఉండనుందని అంచనా. ఒక్కో పార్టీ ఇప్పుడు తమ అభ్యర్ధులకు ఆర్ధికంగా వెన్నుదన్నుగా నిల్చేందుకు రూ. 10వేలకోట్లనుంచి రూ. 20వేలకోట్లను వెచ్చించనున్నాయని ఇటీవలే ఒక సర్వేలో వెల్లడైంది. గడచిన కర్నాటక ఎన్నికల్లో ఇదేవిధంగా వ్యయం అంచనాలు మించిందని సెంటర్‌ ఫర్‌ మీడియా స్టడీస్‌ అనే సంస్థ సర్వేలో పేర్కొంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 సెక్షన్‌ 77 ప్రకారం ప్రతీ అభ్యర్ధి ప్రత్యేకంగా ఖాతాను నిర్వహించి ఎన్నికల వ్యయాన్ని పక్కాగా చూపాలి. కానీ ఇందులో అన్నీ అవాస్తవాలే అంకెల గారడీలేననేది తెలిసిందే.