ఆ శక్తితో టీఆర్ఎస్ కు గుణపాఠం : సోనియా

ఆ శక్తితో టీఆర్ఎస్ కు గుణపాఠం : సోనియా

24-11-2018

ఆ శక్తితో టీఆర్ఎస్ కు గుణపాఠం : సోనియా

తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల్ని, కలల్ని నెరవేర్చడంలో టీఆర్‌ఎస్‌ సర్కారు పూర్తిగా విఫలమైందని యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ విమర్శించారు. ప్రజల బాగోగులు గాలికొదిలేసి, తన కుటుంబ బాగోగుల్ని మాత్రమే కేసీఆర్‌ చూసుకున్నారని ఆరోపించారు. మాటపై నిలబడని వ్యక్తులను ఎన్నటికీ నమ్మ కూడదని ప్రజలకు పిలుపునిచ్చారు రాజకీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, నష్టం జరుగుతుందని తెలిసీ, ఇక్కడ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకే ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణ ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ రాష్ట్రం ఏర్పాటైన తరువాత తొలిసారిగా తెలంగాణకు వచ్చారు. మేడ్చల్‌లో జరిగిన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రజలు కాంగ్రెస్‌తో చేతులు కలపాలని, తమ ఓటు శక్తితో టీఆర్‌ఎస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌, ప్రజాకూటమి అభ్యర్థులకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రజల కలల్ని నెరవేర్చలేదు. దళితులు, ఆదివాసీలు, మహిళలు, వెనుకబడిన వర్గాల కోసం ఇచ్చిన హామీల్ని కూడా పూర్తి చేయలేదు. ఇది ఎన్నికల సమయం. ఈ ఎన్నికలు మనందరికీ ఒక అవసరం. తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్‌ పార్టీతో కలిసి సమస్యల నుంచి విముక్తి పొందాలి. మీ ఓటే మీ శక్తి. ఆ శక్తితో టీఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి. కాంగ్రెస్‌, ప్రజాకూటమిని గెలిపించేందుకు మీరు ఓటు వేయాలి. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సభ నుంచి మిమ్మల్ని కోరుతున్నాను. తెలంగాణ అభివృద్ధిలో ప్రజలంతా మాతో చేతులు కలపాలి. ఈ సభకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. జైహింద్‌.. జై తెలంగాణ అంటూ సోనియా ప్రసంగాన్ని ముగించారు.