తాను కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : చంద్రబాబు

తాను కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : చంద్రబాబు

05-12-2018

తాను కేసీఆర్ కోసం కాదు.. ప్రజల కోసం : చంద్రబాబు

ప్రజాకూటమి సభలకు వస్తున్న ప్రజా స్పందనను చూస్తుంటే కేసీఆర్‌ ప్రభుత్వంపై తిరుగుబాటుగా కన్పిస్తోందని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లో పలు నియోజక వర్గాల్లో ప్రజాకూటమి అభ్యర్థులకు మద్దతుగా చంద్రబాబు రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కేసీఆర్‌ కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల కోసమే వచ్చానని తెలిపారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని అన్నారు. నాలుగున్నరేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ కుటుంబానికి తప్ప సామాన్య ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పేర్కొన్నారు. ఈ రోజు, రేపు డబ్బులు సంచులు వస్తాయి. మనల్ని ఎవరూ కొనలేరు. పోరాటానికి సిద్ధంగా ఉండండి. భయపడవద్దు అని ప్రజల్ని కోరారు. డబ్బు సంచులు పంచితే గెలవరు, ప్రజల ఆదరాభిమానాలుంటే గెలుస్తారని అన్నారు.

35 ఏళ్ల పాటు కాంగ్రెస్‌తో పోరాడాం. చివరికి అదే పార్టీతో కలిసి పనిచేసే పరిస్థితి వచ్చింది. ఇది రాహుల్‌ గాంధీ, నా స్వార్థం కోసం కాదు. ప్రధాని మోదీ దేశంలోని అన్ని వ్వవస్థలను భ్రష్టు పట్టించారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. చివరికి పోలీసుల మీద బీజేపీ కార్యకర్తలు దాడి చేస్తున్నారు. ఇదేనా పాలనా తీరు. దేశాన్ని రక్షించడానికే కాంగ్రెస్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేశాం. మోదీ రెండు తెలుగు రాష్ట్రాలను మోసం చేశారు. విభజన హామీలను నెరవేర్చలేదు. అయినా కేసీఆర్‌ మోదీని ఎందుకు ప్రశ్నించటం లేదు. ప్రజలు అవకాశం ఇచ్చిన ఐదేళ్లు కూడా పని చేసుకోలేక పోయారు. నా వద్ద పనిచేసిన తిరిగి నన్నే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి భయపడను అని చంద్రబాబు సృష్టం చేశారు.