పీసిసి పదవి కోసం పోటా పోటీ

పీసిసి పదవి కోసం పోటా పోటీ

22-11-2019

పీసిసి పదవి కోసం పోటా పోటీ

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ) అధ్యక్ష పదవికోసం కాంగ్రెస్‌ నాయకుల్లో పోటాపోటీ ఏర్పడింది. ప్రస్తుతం?అధ్యక్షుడిగా ఉన్న ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మార్చే ప్రతిపాదనపై ఏఐసీసీ ఇంతవరకు అధికారికంగా ప్రకటన చేయనప్పటికీ, ఈ స్థానాన్ని దక్కించుకోవడానికి తీవ్రమైన పోటీ నెలకొంది. ఉత్తమ్‌ను మార్చే పక్షంలో తమకు పీసీసీ అధ్యక్షపదవిని ఇవ్వాలని కోరుతూ పలువురు కీలక నేతలు ఉన్నత నాయకత్వంపై ఒత్తిడి పెంచుకున్నారు. 2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని చతికిలపడిన కాంగ్రెస్‌లో ఇప్పుడు కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసి గెలిచిన చాలా మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ మారారు. అంతేగాక, పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్‌ సంఖ్యాబలం తగ్గింది. ప్రతిపక్ష పార్టీ హోదాను కూడా కోల్పోయింది.

ప్రస్తుతం సీఎల్‌పీ నేతగా భట్టి విక్రమార్క ఉన్నారు. కాగా, పీసీసీ రేసులో తాము ఉన్నట్లు ఇప్పటికే భువనగిరి ఎంపీ, సీనియర్‌ కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కోమటిరెడ్డికే పదవిని ఇవ్వాలని కోరుతూ ఆదిలాబాద్‌ జిల్లా నుంచి గాంధీభవన్‌ వరకూ కాంగ్రెస్‌ కార్యకర్తలు సంకల్పపాదయాత్ర చేయడం విశేషం. ఇక జగ్గారెడ్డి తనకు పీసీసీ అధ్యక్షపదవిని అప్పగిస్తే, 2023లో పార్టీని అధికారంలోకి తెస్తానని ప్రకటించారు. ఆయన ఒకటిరెండురోజుల్లో ఢిల్లీకి వెళ్లి ఏఐసీసీ పెద్దలను కలుస్తానని కూడా ప్రకటించారు. తెలంగాణ పీసీసీ చీఫ్‌ పదవిని దక్కించుకునేందుకు అనేక మంది నేతలు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మాజీ మంత్రి మర్రి శశిధర్‌ రెడ్డి, సీనియర్‌ నేతలు షబ్బీర్‌ అలీ, కొండా విశ్వేశ్వరరెడ్డి, భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్‌, మహిళల కోటాలో సీనియర్‌ నేత, మాజీ మంత్రి జే. గీతారెడ్డి తదితరులు తమ అద ష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఒకటి రెండు నెలల్లో మున్సిపల్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా, మరో నాలుగేళ్లపాటు వారినే కొనసాగించాలి. ఈ నేపథ్యంలో, పార్టీని వ్యవస్థాపరంగా బలోపేతం చేయగలిగే నేత కోసం ఏఐసీసీ ఆన్వేషిస్తోంది. అలాంటి నేతను గుర్తించే వరకు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డిని మార్చే అవకాశం లేకపోవచ్చని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి.

ఎన్నికలతో నిమిత్తంలేకుండా పార్టీ కేడర్‌ను ఉత్తేజపరిచి, ప్రజా ఉద్యమాలు నడిపేందుకు ఒక యువ నాయకుడు కావాలని పార్టీ వ్యవహారాలు చూసే ఇన్‌చార్జీ ఆర్‌సీ కుంతియాకు కొంత మంది నేతలు కలిసి పదే పదే కోరుతున్నారు. ఈ నేపథ్యంలోనే, పీసీసీ రేసులో ఇంతవరకు వినిపించని పేర్ల వివరాలను కూడా ఏఐసీసీ తెప్పించుకుని పరిశీలిస్తోందని సమాచారం. పార్టీని నడపడంలో మంచి వ్యూహకర్తలుగా పేరుతెచ్చుకున్న పీసీసీ మాజీ అధ్యక్షులు డీ. శ్రీనివాస్‌, కేకే, మాజీ మంత్రి డీకే అరుణలు పార్టీని వీడారు. డీఎస్‌, కేకే టీఆర్‌ఎస్‌లో చేరగారు. అనేకానేక వార్తలు, ఉత్కంఠ పరిణామాల తర్వాత, డీఎస్‌ ఆ పార్టీలో సైలెంటయ్యారు. డీకే అరుణ బీజేపీలో చేరి ఆ పార్టీ అధ్యక్షపదవికోసం పోటీపడుతున్నారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌ రెడ్డికి మంచి అవకాశాలు ఉన్నా, ఇటీవల కాలంలో అనేక వివాదస్పద ప్రకటనలు చేసి పార్టీకి దూరమయ్యారని కొందరు నేతలు చెప్పారు.