త్వరలో నల్లగొండ ఉప ఎన్నిక?
Nela Ticket
Kizen
APEDB

త్వరలో నల్లగొండ ఉప ఎన్నిక?

12-09-2017

త్వరలో నల్లగొండ ఉప ఎన్నిక?

త్వరలో మరో ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అధినేత సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డికి రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పదవి కట్టబెట్టి, ఆయన చేత పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయించాలని భావిస్తున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో టిడిపి ఘన విజయం సాధించి ప్రతిపక్షంపై పైచేయి సాధించడంతో, అదే రీతిలో మన రాష్ట్రంలో కూడా ఉప ఎన్నిక ద్వారా బలాన్ని నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ తలపోస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ నుండి నల్లగొండ ఎంపిగా గెలిచిన గుత్తా సుఖేందర్‌ రెడ్డి, ఆ  పార్టీకి గుడ్‌బై చెప్పి టీఆర్‌ఎస్‌లో చేరారు. రాష్ట్రంలో మంత్రి కావాలనే తన చిరకాల వాంఛపై సృష్టమైన హామీ మేరకే ఆయన అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.                  

అయితే, మంత్రివ్గ పునర్వ్యవస్థీకరణ జరగకపోవడంతో ఆయనకు అవకాశం లభించలేదు. దీంతో మరో రూపంలో గుత్తా కోరిక నెరవేర్చాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందులో భాగంగానే రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ పదవికి కార్పొరేషన్‌ హోదా కల్పించడంతోపాటు క్యాబినెట్‌ హోదా ఇచ్చి ఆ పదవికి గుత్తా సుఖేందర్‌రెడ్డిని ఎంపిక చేయనున్నారు. దీంతో మంత్రి కావాలనే కోరికను పరోక్షంగా నెరవేర్చడమే కాకుండా, ఆయన ప్రాతినిధ్య వహిస్తున్న నల్లగొండ ఎంపి పదవికి రాజీనామా చేయించి, ఉప ఎన్నికకు తెర తీయాలనుకుంటున్నారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థులుగా గత ఎన్నికల్లో టిడిపి నుంచి పోటీ చేసి రెండవ స్థానంలో నిలిచిన తేరా చిన్నపరెడ్డిని లేదా జెడ్‌పి చైర్మన్‌ బాలూ నాయక్‌లతో పాటు గుత్తా సుఖేందర్‌రెడ్డి కుమారుని పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.