డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు
Ramakrishna

డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు

12-09-2017

డిసెంబర్ 15 నుంచి 19 వరకు ప్రపంచ తెలుగు మహాసభలు

హైదరాబాద్ నగరంలో  డిసెంబర్ 15 నుంచి 19 వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. దీనికి సంబంధించిన సన్నాహక కార్యక్రమాలను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. అక్టోబర్ నెలలోనే ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించాలని ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే అక్టోబర్ 5 నుంచి 9వరకు దాదాపు 90 దేశాల ప్రతినిధులు పాల్గొనే ప్రపంచ టూరిజం సదస్సు హైదరాబాద్ లోనే జరుగుతున్నది. నవంబర్ 28 నుంచి దాదాపు 170 దేశాలు పాల్గొనే ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సు కు కూడా హైదరాబాద్ వేదిక. ఈ రెండు కార్యక్రమాల్లో అధికార యంత్రాంగమంతా తలమునకలై ఉన్నారు. అదే సమయంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరిపితే, అనుకున్నంత ఘనంగా నిర్వహించలేమని ప్రభుత్వం భావించింది. కాబట్టి ఆ రెండు ప్రపంచ సదస్సులు ముగిసిన తర్వాత డిసెంబర్ లో ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాలని ప్రగతి భవన్లో మంగళవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో నిర్ణయించారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. సాహిత్య అకాడమీకి రూ.5 కోట్లు, అధికార భాషా సంఘానికి రూ.2 కోట్లు నిర్వహణ ఖర్చుల కింద మంజూరు చేశారు. ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణకు సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. 

ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిధారెడ్డి, అధికార భాష సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, తెలుగు యూనివర్సిటీ విసి సత్యనారాయణ, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాల చారి తదితరులు పాల్గొన్నారు. 

తెలంగాణలో తొలిసారిగా ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు భాషను పరిరక్షించే రెండు కీలక నిర్ణయాలను ముఖ్యమంత్రి ప్రకటించారు.

1.  వచ్చే విద్యా సంవత్సరం నుంచి తెలంగాణలోని అన్ని రకాల పాఠశాలల్లో మొదటి తరగతి నుంచి 12వ తరగతి వరకు ఖచ్చితంగా తెలుగు భాషను ఒక సబ్జెక్టుగా బోధించాలని సిఎం కేసీఆర్ విద్యా సంస్థలను కోరారు. తెలుగును ఖచ్చితంగా బోధించే పాఠశాలలకు మాత్రమే తెలంగాణలో అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉర్థూ కోరుకునే విద్యార్థులకు ఉర్థూ భాషను కూడా ఆప్షనల్ సబ్జెక్టు ఉండాలని నిర్ణయించారు. ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత, ఇంటర్మీడియట్ తరగతుల్లో బోధించే తెలుగు సబ్జెక్టుకు సంబంధిచిన సిలబస్ రూపకల్పన చేయాల్సిందిగా సాహిత్య అకాడమీని సిఎం ఆదేశించారు. వెంటనే సిలబస్ రూపొందించి, పుస్తకాలు ముద్రించాలని ఆదేశించారు. సాహిత్య అకాడమీ రూపొందించిన సిలబస్ నే అన్ని పాఠశాలల్లో బోధించాలని, ఎవరిష్టం వచ్చినట్లు వారు పుస్తకాలు ముద్రించుకుని బోధించడం కుదరదని కూడా సిఎం స్పష్టం చేశారు. పాఠశాలల్లో తెలుగు సబ్జెక్టు బోధించడం, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రభుత్వం రూపొందించిన సిలబస్ నే బోధించడం విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా, ఖచ్చితంగా వ్యవహరిస్తుందని సిఎం స్పష్టం చేశారు.

2.  తెలంగాణలో నిర్వహించే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇకపై తమ బోర్డులను ఖచ్చితంగా తెలుగులో రాయాలని సిఎం పిలుపునిచ్చారు. అన్ని రకాల బోర్డులపై పైన స్పష్టంగా తెలుగులో రాయాలని, ఇతర భాషలు రాసుకోవడం నిర్వాహకుల ఇష్టమని స్పష్టం చేశారు.

ఈ రెండు నిర్ణయాలకు సంబంధించి త్వరలోనే మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేయాలని  నిర్ణయించారు.

సమావేశంలో తీసుకున్న మరికొన్ని నిర్ణయాలు : 

- ప్రపంచ తెలుగు మహాసభల్లో తెలంగాణ ప్రాంతంలో తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి జరిగిన ప్రయత్నంపై చర్చా గోష్టులు నిర్వహిస్తారు. తెలంగాణలో వర్థిల్లిన తెలుగును ప్రపంచ నలుమూలలకూ తెలిపే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. గోల్కొండ నుంచి వెలువడిన తెలుగు సాహిత్యాన్ని పరిచయం చేయాలి. తెలుగు భాషలోని వివిధ ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలు ఈ మహాసభల్లో ఉంటాయి. 

- ఎల్.బి. స్టేడియం ప్రధాన వేదికగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతాయి. రవీంద్రభారతి, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, లలిత కళాతోరణం, నిజాం కాలేజి గ్రౌండ్స్, భారతీయ విద్యాభవన్, పింగిలి వెంకట్రాంరెడ్డి హాల్, శిల్ప కళావేదిక తదితర వేదికల్లో కార్యక్రమాలు జరుగుతాయి. 

- ఉదయం సాహిత్య గోష్టులు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. బతుకమ్మ, గోండు నృత్యాలు, కోలాటం, పేరిణి లాంటి ఆటలు, కలుపుపాట, నాటు పాట, బతుకమ్మ లాంటి పాటలు, వినోద ప్రక్రియలు సాంస్కృతిక కార్యక్రమాల్లో ఉంటాయి. తానీషా-రామదాసు సంబంధం, రామదాసు కీర్తనలు, తందనాన రామాయణం, శారదాకారులు, హరికథ ప్రక్రియ తదితర అంశాలను ప్రదర్శించాలి. పద్యగానం, సినీ పాటల విభావరి నిర్వహించాలి. చుక్క పొడుగు నుంచి పొద్దు గూకే వరకు గ్రామీణ ప్రాంతాల్లో పాడుకునే నాట్ల పాటలు, కోత పాటలు, దుక్కి పాటలు, జానపద గేయాలు లాంటి అంశాలు ప్రదర్శించాలి.  

- వివిధ రకాల నాటక ప్రక్రియలు అంటే ఆదివాసి, గిరిజన, శాస్రీకుయ, జానపద నృత్యాలు లాంటివి ప్రదర్శించాలి. 

- మహిళలు పాడే పాటలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒక తరం నుంచి మరో  తరానికి ఎలా అందజేయబడ్డాయో కళ్లకు కట్టినట్లు చూపించాలి. 

- దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు పండితులు, భాషా పండితులు, అవధానులు, కవులు, కళాకారులు, రచయితలు, కళాకారులను ఆ మహాసభలకు ప్రభుత్వం తరుఫున ఆహ్వానిస్తారు. 

- దేశ, విదేశాల్లో అతిథులను ఆహ్వానించడానికి, ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఔచిత్యం వివరించడానికి సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. అమెరికా, యూరప్, గల్ప్ దేశాలతో పాటు మారిషన్, సింగపూర్, మలేసియా లాంటి దేశాల్లో అక్కడున్న తెలుగు వారి కోసం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ తో పాటు దేశ నలుమూలల్లో తెలుగు వారు నివసించే ప్రాంతాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తారు. తెలంగాణలోని ముఖ్యమైన పట్టణాల్లో కూడా సన్నాహక సమావేశాలు జరుగుతాయి. 

- కేవలం తెలుగువారినే కాకుండా భారతీయ భాషల్లో సాహిత్య అకాడమీ, జ్ఞానపీఠ్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ప్రముఖులను కూడా ఈ మహాసభలకు ఆహ్వానిస్తారు. 

- ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో తెలుగు భాష ప్రక్రియలకు సంబంధించి పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించాలి. 

- తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషి చేసిన కవులు, పండితులు, సాహితీ వేత్తలు, కళాకారులను గుర్తించి సన్మానం చేయాలి. 

- అతిథులందరికీ ప్రభుత్వం తరుఫునే బస, భోజనం, రవాణా సౌకర్యాలు కల్పించాలి. 

- మహాసభలకు ముందే తెలుగు భాషాభివృద్దికి దోహదపడే పుస్తకాల ముద్రణ జరగాలి. 

- మహాసభలకు వచ్చిన అతిథులకు నగరంలోని పర్యాటక ప్రాంతాలను చూపించాలి. 

- అతిథులకు తెలంగాణను పరిచయం చేయడం కోసం తెలంగాణ దర్శిని పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ తయారు చేయాలి. 

- తెలంగాణ జీవన చిత్రాన్ని, మానవ సంబంధాలను అద్భుతంగా ఆవిష్కరించే బతుకమ్మ నేపథ్యాన్ని వివరించే కళారూపాలు ప్రదర్శించాలి.

- నగరంలో డాక్టర్ సి. నారాయణ రెడ్డి స్మారక మందిరం నిర్మించాలి. రెండు మూడు రోజుల్లోనే స్థలం ఎంపిక చేసి నిర్మాణ ప్రక్రియ ప్రారంభించాలి. 

- తెలంగాణ సాహిత్య అకాడమీ నోడల్ ఏజన్సీగా పనిచేస్తుంది. అధికార భాషా సంఘం, సాంస్కృతిక శాఖ, తెలుగు విశ్వ విద్యాలయం, గ్రంథాలయ పరిషత్ తదితర సంస్థలు కీలక భూమిక నిర్వహించాలి. 

- పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయ స్థాయిల్లో వివిధరకాల పోటీలు నిర్వహించాలి.  వాటిలో వ్యాస రచన, వక్తృత్వ, కవితా రచన, కథా రచన,  నాటకాలు లాంటి ప్రక్రియలుండాలి.  

- మహాసభల సందర్భంగా హైదరాబాద్ నగరాన్ని అలంకరించాలి. ప్రధాన కూడళ్లలో కటౌట్లు, ద్వారాలు ఏర్పాటు చేయాలి.  జిల్లాల్లో కూడా అలంకరణలు ఉండాలి. రాష్ట్రమంతా పండుగ వాతావరణ నెలకొనాలి.  

- ప్రారంభ, ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి, ప్రధాని, ఉప రాష్ట్రపతులను ఆహ్వానించాలి.