రేవంత్ సస్పెన్షన్ కోరుకుంటున్నారా ?

రేవంత్ సస్పెన్షన్ కోరుకుంటున్నారా ?

20-10-2017

రేవంత్ సస్పెన్షన్ కోరుకుంటున్నారా ?

తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరడానికి దాదాపుగా నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి… ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారనే విషయం వాస్తవమే అని కాంగ్రెస్ నేతలు సైతం ధృవీకరిస్తున్నారు.

ఈ క్రమంలో ఆయన సొంత పార్టీ అయిన టీడీపీని ఇబ్బంది పెట్టేలా వ్యాఖ్యానించడం చాలామందికి నచ్చడం లేదు. కాంగ్రెస్ తో పొత్తు కోసం చర్చలు జరుపుతున్నానన్న రేవంత్… ఏపీలోని టీడీపీ మంత్రులు, నేతలపై కూడా విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తెలంగాణలో ఏపీ మంత్రులకు పనేంటని… యనమలకు కేసీఆర్‌ రూ.2 వేల కోట్లు కాంట్రాక్టు ఇచ్చారని… పరిటాల సునీత కొడుకు, పయ్యావుల అల్లుడి బార్‌కు తెలంగాణలో బీర్ల కంపెనీ లైసెన్స్ ఎలా వచ్చిందని రేవంత్ ప్రశ్నించడం ఏపీలోని టీడీపీ నేతలను కూడా ఇబ్బంది పెడుతోంది.

అయితే రేవంత్ ఇలా టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడం వెనుక అసలు కారణం వేరే ఉందని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. టీడీపీలోనే ఉంటూ కాంగ్రెస్ లో చేరడం వల్ల ఇబ్బందులు వస్తాయని భావిస్తున్న రేవంత్ రెడ్డి… టీడీపీ తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.

టీడీపీ అలా చేయడం వల్ల తాను కాంగ్రెస్ లో చేరడానికి లైన్ క్లియర్ అవుతుందని రేవంత్ భావిస్తున్నారని కొందరు టీ టీడీపీ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు రేవంత్ ఉద్దేశం ఏమిటనే విషయం తెలుసుకున్న తరువాత ఆయనను సస్పెండ్ చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటానని ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన సన్నిహితుల దగ్గర వ్యాఖ్యానించినట్టు సమాచారం.