గ్లోబల్ సమ్మిట్ కు చురుగ్గా ఏర్పాట్లు

గ్లోబల్ సమ్మిట్ కు చురుగ్గా ఏర్పాట్లు

27-10-2017

గ్లోబల్ సమ్మిట్ కు చురుగ్గా ఏర్పాట్లు

భారత్‌-అమెరికా దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ -2017 కోసం చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నవంబరు 28 నుంచి 30 వరకు మూడురోజులు జరిగే సమ్మిట్‌లో దాదాపు 1500 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటారు. 28న ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కుమార్తె, వైట్‌హౌజ్‌ సలహాదారు ఇవాంకా ట్రంప్‌తో కలిసి గ్లోబల్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ సమ్మిట్‌ను ప్రారంభిస్తారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు ప్రమఖులు ఈ కార్యక్రమంలో  పాల్గొంటారు. ప్రధాని మోదీ సమ్మిట్‌లో ప్రారంభోపన్యాసం చేసిన తర్వాత ఇవాంకా ట్రంప్‌ ప్రసంగిస్తారని అమెరికా దౌత్య కార్యాలయ అధికారులు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్‌ విభాగం అధికారుల సమన్వయంతో గ్లోబల్‌ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు చేస్తోంది.  విమెన్‌ ఫస్ట్‌... ప్రాస్పరిటీ ఫర్‌ ఆల్‌  అంశంతో ఏర్పాటు చేస్తున్న అంతర్జాతీయ సదస్సు మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారిస్తుంది. ఇవాంకా ట్రంప్‌తో పాటు అమెరికాకు చెందిన 400 మందికి పైగా ప్రతినిధులు సదస్సులో పాల్గొంటారు అలాగే భారత్‌ నుంచి వివిధ రంగాలకు చెందిన మరో 400 మంది ప్రతినిధులు అధికారికంగా హాజరవుతారు.

మిగిలిన సుమారు 700 మంది ప్రతినిధులు వివిద దేశాల నుంచి తరలిరానున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌లో పాల్గొనేందుకు వచ్చే విచ్చేసిన అంతర్జాతీయ ప్రతినిధుల గౌరవార్ధం ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రభుత్వం తరపున నవంబరు 28న తాజ్‌ ఫలక్‌నుమాలో విందు ఇవ్వనున్నారు. 29న ప్రధాని నరేంద్ర మోదీ తిరిగి ఢిల్లీ వెళతారు. మరుసటి రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు అతిధుల కోసం చారిత్రాత్మక గోల్కొండ కోటలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింభించే విధంగా పలు రకాల సాంస్కవృతిక, సంగీత నృత్య ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు.

ఇవాంకా ట్రంప్‌ ఇష్టాగోష్ఠి

అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంకా హైదరాబాద్‌లో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ఇష్టాగోష్ఠిలో పాల్గొనే అవకాశం ఉంది. జిఈఎస్‌ సమ్మిట్‌ సందర్భంగా స్థానిక పారిశ్రామికవేత్తలతో ఇష్టాగోష్ఠిగా ఆమె సమావేశమై, హైదరాబాద్‌ సంస్కృతి సంప్రదాయాల గురించి తెలుసుకునే అవకాశం ఉంది.