తెలంగాణ తెలుగు వెలుగులు జిగేలుమనేలా నిర్వహణ ఉండాలి

తెలంగాణ తెలుగు వెలుగులు జిగేలుమనేలా నిర్వహణ ఉండాలి

15-11-2017

తెలంగాణ తెలుగు వెలుగులు  జిగేలుమనేలా నిర్వహణ ఉండాలి

తెలంగాణ తెలుగు వెలుగులు ప్రపంచ పటంమీద జిగేలుమనేలా ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ఆతిథ్యంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వచ్చే నెలలో హైదరాబాద్‌లో జరిగే ప్రపంచ తెలుగు మహాసభల ఏర్పాట్లపై బుధవారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని వివిధ ప్రాంతాలతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి తెలుగుభాషా పండితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు, కవులు, రచయితలు, ప్రముఖులు మహాసభల్లో పాల్గొంటారని చెప్పారు. వీరందరికీ అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ మహాసభల్లో తెలుగు భాషా ప్రక్రియలన్నింటికీ సంబంధించిన ప్రదర్శనలు జరుగాలన్నారు. పదసాహిత్యం, గద్యసాహిత్యం, అవధానం, జానపదం, సంకీర్తనా సాహిత్యం, కథాకథన రూపాలు తదితర అంశాల్లో ఉద్దండులైన ఎంతోమంది తెలంగాణ బిడ్డలు తెలుగు భాషాభివృద్ధికి, తెలుగు భాష వైభవానికి కృషిచేశారు. వారందరినీ స్మరించుకోవాలి. వారు తెలుగుభాషకోసం చేసిన కృషిని చాటిచెప్పాలి. 

తెలంగాణలో వెలుగొందిన భాషా ప్రక్రియలన్నింటినీ మరోసారి ప్రపంచానికి చూపాలి. వందల ఏండ్లనుంచి తెలంగాణలో తెలుగుభాష వర్ధిల్లుతూ వస్తున్నది. అనేకమంది పండితులు, కవులు, రచయితలే కాకుండా నిరక్ష్యరాస్యులు కూడా బతుకమ్మలాంటి పాటలద్వారా జానపద పరంపర కొనసాగించారు. ఈ గొప్ప చరిత్రను ఘనంగా చాటేందుకు తెలుగుమహాసభలు ఉపయోగపడాలి. మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదికలద్వారా ప్రదర్శనలు నిర్వహించాలి. రోజు సాయంత్రం ఎల్బీ స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి అని దిశానిర్దేశం చేశారు.