ఇవాంకాకు కాప్‌లెస్‌ సెక్యూరిటీ

ఇవాంకాకు కాప్‌లెస్‌ సెక్యూరిటీ

20-11-2017

ఇవాంకాకు కాప్‌లెస్‌ సెక్యూరిటీ

హైదరాబాద్‌లోని హెచ్‌ఐసిసిలో జరగనున్న గ్లోబల్‌ ఎంటర్‌ప్యూనర్‌ సదస్సు (జిఇఎస్‌)కు హాజరవుతున్న ఇవాంక ట్రంప్‌కు కాప్‌లెస్‌ బందోబస్తు ఏర్పాటు చేయాలని అమెరికా భద్రతాధికారులు సూచించారు. సాధారణంగా వివిఐపిలు ఎవరైనా రోడ్డు మార్గంలో వెళ్లినా, ఏదైనా సభలో పాల్గొన్న వేదికతో పాటు రోడ్డు మార్గంలో భారీ ఎత్తున పోలీసులను మోహరించి బందోబస్తు చేయడం అనవాయితీ. సభలు, సమావేశాలు జరిగితే పెద్ద పెద్ద భవనాలపై బైనాక్యూలర్స్‌తో పాటు ఆయుధాలను ధరించిన వారిని నియమిస్తారు. కానీ ఇందుకు భిన్నంగా అమెరికా ఫెడరల్‌ బ్యూరో అధికారులు బందోబస్తును కోరారు. చేస్తే మీరు చేయండి లేకపోతే మేం చూసుకుంటామని కూడా మన పోలీసులకు ముక్తాయింపు ఇవ్వడంలో ఆ దిశలో బందోబస్తుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు.

ఇవాంకా పాల్గొననున్న జిఇఎస్‌ వేదికపై కేవలం ఒకే ఒక యూనిఫాం ఐపిఎస్‌ అధికారి ఉండాలని సూచించిన యుఎస్‌ భద్రతాధికారులు, ఆమె ప్రయాణం చేసే దారి పొడవునా, షాంపింగ్‌ తదితర ప్రాంతాల్లో కాల్‌లెస్‌ బందోబస్తును ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంటే పోలీసులు బందోబస్తులో ఉండాలి కానీ, యూనిఫాంలో ఉండకుండా, బందోబస్తు విధుల కోసం వచ్చారన్న విషయం తెలియకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాంకా బందోబస్తు కోసం దాదాపు 10 వేల మంది పోలీసులను వేర్వేరు ప్రాంతాల్లో వినియోగించాలనుకున్న అధికారులు తాజా ఆదేశాలతో చురుకైన వారిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమయ్యారు.

సాధారణ పోలీసులను బందోబస్తు కోసం వినియోగించకుండా ఆక్టోపస్‌, గ్రేహాండ్స్‌, అంతర్గత భద్రతా విభాగం (ఐఎస్‌డబ్ల్యు) తదితర విభాగాల్లోని సిబ్బందిని వినియోగించుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. హెచ్‌ఐసిసితో పాటు గోల్కోండ, ఫలక్‌నుమా ప్యాలేస్‌ తదితర చోట్ల పరిసర ప్రాంతాలలోని ప్రజలతో సమావేశమవుతున్న పోలీసులు ఇవాంక పర్యటన సందర్భంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా భరించాలని కోరుతున్నారు. హెచ్‌ఐసిసి, గోల్కొండ, ఫలక్‌నుమా ప్రాంతాలలో తాత్కాలికంగా బిగించిన సిసి కెమెరాల కోసం ఏర్పాటు ప్రత్యేక కంట్రోల్‌ రూంలను తమకు అప్పగించాలని ఇప్పటికే యుఎస్‌ భద్రతాధికారులు కోరారు. వీరికి సహాయకులుగా తెలంగాణ పోలీసులు ఉంటారు.