స్వాగత ఆర్భాటాలొద్దు

స్వాగత ఆర్భాటాలొద్దు

22-11-2017

స్వాగత ఆర్భాటాలొద్దు

హైదరాబాద్‌లో జరగనున్న అంతర్జాతీయ పారిశ్రామికవేత్తల సదస్సు (జిఇఎస్‌)కు హాజరవుతున్న ఇవాంక బందోబస్తుపై అమెరికా ఫెడరల్‌ బ్యూరో, ఎస్‌పిజి, తెలంగాణ పోలీసుల కసరత్తు కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబి) కొన్ని సూచనలను చేస్తూ అలర్ట్‌ చేసింది. సదస్సు జరగనున్న హెచ్‌ఐసిసి పరిసర ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, ఇవాంక పర్యటించే ప్రాంతాల్లోనూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాద సంస్థల కదలికలపై నిఘాను మరింత పెంచాలని కోరింది. ఇవాంక భద్రతకు తీసుకున్న చర్యలను ఐబి సేకరించింది. ఆమె పర్యటనకు సంబంధించిన వివరాలేవీ బహిర్గతం చేయొద్దని, మినిట్‌ టు మినిట్‌ ప్రోగ్రాం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సదస్సుతో పాటు పర్యటన వివరాలను కొంత మంది ఉన్నతాధికారులతో తప్ప ఎవరితోనూ చర్చించొద్దని గట్టిగా ఆదేశించినట్లు సమాచారం.

విమానాశ్రయంలో స్వాగత కార్యక్రమాలేవీ ఉండొద్దని, ఇవాంకను ఆహ్వానించేందుకు నేతలను, సదస్సు నిర్వాహకులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదని కోరింది. ఇదిలా ఉండగా, ఇవాంక పర్యటనకు కావాల్సిన బుల్లెట్‌ ప్రూఫ్‌ కారును అమెరికా నుంచి ప్రత్యేకంగా తెప్పిస్తున్నారని తెలిసింది. ఇప్పటికే ఫెడరల్‌ బ్యూరో అధికారులు ఆయుధాలను ఉపయోగించేందుకు వీలుగా మన కస్టమ్స్‌ అధికారులను అనుమతి కోసం లేఖ రాసిన విషయం తెలిసిందే. అయితే కారు వినియోగంపై అనుమతి కోరుతూ లేఖ రాసినట్లు సమాచారమేదీ లేదని అధికారులు అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సలహాదారు నేతృత్వంలో ఇవాంక పర్యటన బందోబస్తుపై అధికారులు ఎప్పటికపుడు చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవంగా ఇప్పటి వరకు ఇవాంకతో పాటు పలువురు విదేశీ ప్రముఖులు చార్మినార్‌, లాడ్‌బజార్‌, గోల్కొండ కోట తదితర ప్రాంతాలను సందర్శించడం, షాపింగ్‌ చేయడం పర్యటనలో భాగంగా ఉంటుందని పేర్కొంటున్నప్పటికీ ఇవాంక పాల్గొనడం అనేది చివరి నిమిషం వరకు తేలకపోవచ్చని అధికారులు అంటున్నారు. ఏది ఏమైనా బందోబస్తు మాత్రం ఏర్పాటు చేస్తున్నామని, అమెరికా ఫెడరల్‌ బ్యూరో, ఎస్‌పిజి సూచనల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.