ప్రపంచ మహాసభ వేడుకలు... ఐదు రోజులు... ఐదు వేదికలు

ప్రపంచ మహాసభ వేడుకలు... ఐదు రోజులు... ఐదు వేదికలు

25-11-2017

ప్రపంచ మహాసభ వేడుకలు... ఐదు రోజులు... ఐదు వేదికలు

డిసెంబర్‌లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో వివిధ కార్యక్రమాలను సదస్సులను ఏర్పాట్లు చేశారు. ఇందులో తెలంగాణ సాహిత్యానికి పెద్ద పీట వేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలుగు భాష ఆవిర్భావ వికాసాలకు ప్రధాన భూమిక తెలంగాణ. ఇక్కడి నుంచే తెలుగు విస్తరించింది. ఇందుకు అనేక శాసనాలు, చరిత్ర ఆధారంగా ఉంది. ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా ఈ ఘన చరిత్రను చాటి చెబుతాం. ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను తట్టుకుని నిలిచి గెలిచిన రెండువేల ఏళ్ల నాటి గొప్ప భాష తెలుగు.ఈ భాష, సంస్కృతులను సుస్థిరం చేసేలా ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తాం అని రాష్ట్ర సాహిత్వ అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి తెలిపారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని, విశిష్టతను విశదీకరించేందుకు, తెలంగాణలో తెలుగు భాష ఆవిర్భవించి వికసించిన తీరుతెన్నులను ప్రపంచానికి సమున్నతంగా చాటిచెప్పేందుకు ప్రపంచ తెలుగు మహాసభలను ఐదు రోజుల పాటు, ఐదు వేదికలపై నిర్వహించనున్నట్టు తెలిపారు. డిసెంబర్‌ 15 నుంచి 19వ తేదీ వరకు 5 రోజుల పాటు జరగనున్న తెలుగు మహాసభల నిర్వహణపై ఆయన తెలుగు భాషా పండితులకు దిశానిర్దేశం చేశారు.

రవీంద్రభారతిలోని రాష్ట్ర సాహిత్య అకాడమీ కార్యాలయంలో నిర్వహించిన  ఈ సమావేశంలో అన్ని జిల్లాలకు చెందిన తెలుగు భాషా పండితులు పాల్గొన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, సీఎంవో ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌ సాంస్కృతిక శాఖ సంచాలకులు హరికృష్ణ హాజరయ్యారు.

అద్వితీయంగా సభల నిర్వహణ :

ప్రధాన వేదిక ఎల్బీ స్టేడియంతో పాటు రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, పబ్లిక్‌ గార్డెన్స్‌లోని తెలుగు లలితకళాతోరణం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సదస్సులు, చర్చా గోష్టులు, కవి సమ్మేళనాలు జరుగుతున్నాయి. నెక్లెస్‌రోడ్డు పీపుల్‌ప్లాజాలో జానపద కళారూపాలను ప్రదర్శిస్తారు. శాస్త్రీయ కళలపై రవీంద్ర భారతిలో కార్యక్రమాలను నిర్వహిస్తారు. తెలుగు వర్సిటీలో ఐదు రోజుల పాటు నిరంతర కవి సమ్మేళనాలు ఉంటాయి. ఇందిరాప్రియదర్శిని ఆడిటోరియం లో పిల్లలు, మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. ఈ ఐదు వేదికల నిర్వహణ బాధ్యతలను భాషా పండితులే పర్యవేక్షిస్తారు. ఏ వేదికపై, ఏ సమయంలో, ఏ కార్యక్రమాన్ని నిర్వహించేది వాళ్లే నిర్ణయిస్తారని సిధారెడ్డి తెలిపారు. 30 దేశాల నుంచి  సుమారు 500 మంది విదేశీ ప్రతినిధులు, 15 రాష్ట్రాల నుంచి 1,500 మంది తెలుగు భాష, సాహిత్యాభిమానులు ఈ సభల్లో పాల్గొంటారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 6వేల మంది ప్రతినిధులు పాల్గొననున్నట్లు అంచనా వేశారు. డిసెంబర్‌ 15న ప్రారంభ, 19వ తేదీన ముగింపు వేడుకలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతులను ఆహ్వానించనున్నట్లు తెలిపారు. మహా రాష్ట్ర గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌రావు , మారిషస్‌ ఉపాధ్యక్షుడు కూడా ఈ సభల్లో పాల్గొననున్నారు.

ప్రతినిధుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు  :

అతిథులకు ప్రతినిధులకు ఈ వేడుకలు  ఒక మధురస్మృతిగా నిలిచిపోయేలా ఘనగా నిర్వహించేందుకు సాహితయ అకాడమీ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యంగా భోజనాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. తెలుగు సంస్కృతి, తెలంగాణ విశిష్టత ఉట్టిపడేలా రకరకాల వంటకాలను ఈ వేడుకల సందర్భంగా వడ్డించనున్నారు. ప్రతినిధులకు వసతి, భోజనం, రవాణా తదితర ఏర్పాట్లలో లోటుపాట్లకు తావు లేకుండా నిర్వహించాలని భావిస్తున్నారు.