ఫలక్‌నుమా ప్యాలెస్ కనువిందు

ఫలక్‌నుమా ప్యాలెస్ కనువిందు

29-11-2017

ఫలక్‌నుమా ప్యాలెస్ కనువిందు

 హైదరాబాద్‌లో విడది చేసిన అమెరికా అధ్యక్షుడి కుమార్తె, ముఖ్య సలహాదారు ఇవాంక ట్రంప్ తన కోసం ఏర్పాటు చేసిన విందుతో మురిసిపోయారు. దేశ, విదేశాల వంటకాలతో ఫలక్‌నుమా ప్యాలెస్ ప్రాంగణం ఘుమఘుమలాడింది. కేంద్ర ప్రభుత్వం ఈ విందును ఏర్పాటు చేసింది. ఇవాంకతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ, ఆది గోద్రేజ్, కుమార మంగళం బిర్లా, మహేంద్ర కోటక్, భారతీ మిట్టల్, చెర్రీ బ్లెయిర్, సంజయ్‌బారు, తెలుగు రాష్ట్రాలకు చెందిన పారిశ్రామికవేత్తలు శోభా కామినేని, ప్రతాప్ సి.రెడ్డి, ఉపాసన కె తదితరులూ విందు ఆరగించారు. 108 అడుగుల పొడవైన డైనింగ్ టేబుల్‌పై వంద మంది పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు భోజనం చేశారు. ప్రత్యేకంగా నియమించిన వంద మంది సర్వర్లు వారికి వడ్డించారు.

దమ్‌కా బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, హలీం, కబాబ్, మటన్ కోఫ్తా, మొఘలాయ్ మటన్, పత్తర్‌కా గోష్, ముర్గపిస్తా సాలన్, నాన్ రోటీ, రుమాలీ రోటీ, బగారా బైగన్, కుబానీ-కా-మీఠా, డ్రైఫ్రూట్స్ ఖీర్ ఇలా ఒక్కటేమిటీ, ఎవరికి ఏది కావాలంటే అది క్షణాల్లో సర్వ్ చేశారు. మన దేశానికి చెందిన వంటకాలే కాదు, ఇటాలియన్, అమెరికన్, చైనీస్ వంటి విదేశీ వంటలూ అందించారు. అంతకుముందు ప్యాలెస్‌లో ఏర్పాటు చేసిన ట్రీ ఆఫ్ లైఫ్ షోకేజ్ ఆన్ ఫ్యాబ్రిక్స్ అండ్ క్రాఫ్ట్స్‌ను తిలకించారు. ఇంకా కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా సాంస్కృతిక కార్యక్రమాలనూ వీక్షించారు.