మహాసభలకు గ్రంథాలయాల తోడ్పాటు

మహాసభలకు గ్రంథాలయాల తోడ్పాటు

09-12-2017

మహాసభలకు గ్రంథాలయాల తోడ్పాటు

తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌ అయాచితం శ్రీధర్‌

ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణలో గ్రంథాలయాలు కూడా కీలకపాత్రను పోషిస్తున్నట్లు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్‌, మహాసభల వ్యూహ సంఘం సభ్యుడు అయాచితం శ్రీధర్‌ అన్నారు. రాష్ట్రంలో గ్రంథాలయాలు ప్రపంచ తెలుగు మహాసభల సన్నాహక కేంద్రాలుగా పని చేస్తున్నాయి. భాషా, సాహిత్యాభిమానులు మహాసభలకు హాజరయ్యేలా సాధారణ ప్రజలు సైతం పాల్గొనేలా రాష్ట్రవ్యాప్తంగా వివిధ పద్ధతుల ద్వారా సన్నద్దం చేసే బాధ్యతను కూడా గ్రంథాలయ పరిషత్తు చేస్తోందని ఆయన చెప్పారు.

రాష్ట్రంలో 568 శాఖా, జిల్లా గ్రంథాలయాలు, వరంగల్‌, నిజామాబాద్‌లోని ప్రాంతీయ, హైదరాబాద్‌లోని కేంద్ర గ్రంథాలయం మహాసభల సన్నాహాక కేంద్రాలుగా, కార్యాలయాలుగా పనిచేశాయని, చాలా జిల్లాల్లో కలెక్టర్లు గ్రంథాలయాలనే మహాసభల కార్యాలయాలుగా వినియోగించుకుంటున్నారని తెలిపారు.  1946-52 కాలంలో తెలంగాణ తొలిదశ ఉద్యమానికి గ్రంథాలయాలే ఉద్యమ కేంద్రాలుగా ఉన్నాయి. ఆనాటి భాగ్యరెడ్డివర్మ, మాడపాటి హనుమంతురావు, సురవరం ప్రతాపరెడ్డి, రావిచెట్టు రంగారావు, వట్టికోట అల్వార్‌స్వామి, దాశరథి కృష్ణమాచార్య, రావి నారాయణరెడ్డి, సంఘం లక్ష్మీబాయమ్మ తదితరులు గ్రంథాలయ ఉద్యమంలో పెనవేసుకున్న వారే. ఈ మహాసభల్లో ప్రధాన వేదిక ఎల్‌బీ స్టేడియంలో సమాచార కేంద్రం, ఛాయచిత్ర ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్రంలోని పురాతన గ్రంథాలయాలు, అరుదైన పుస్తకాల చిత్రాలను ఉంచబోతున్నాం. తెలంగాణ గ్రంథాలయ వైభవాన్ని తెలపనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు.

మహాసభలంటే కేవలం భాషకు సంబంధించిన సభలు కాదు. తెలుగువారి సాహిత్యం, సంస్కృతి, కళలు, సమాజ జీవితం లాంటి ఎన్నో అంశాలను ప్రతిబింబిస్తాయి. ఇతర దేశాలు, రాష్ట్రాల్లోని తెలుగు వారెందరో హాజరవుతున్నారు. వారందరితో కలసి జరుపుకునే తెలుగు పండగ ఇది. ఒకరికి ఒకరం మేమున్నామని చెప్పుకునేలా ఈ?మహాసభల నిర్వహణ ఉంటుందని చెప్పారు.