కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నాం

కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నాం

08-02-2018

కేటీఆర్ సవాల్ ను స్వీకరిస్తున్నాం

2019 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్‌ ఓడిపోతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అన్న మంత్రి కేటీఆర్‌ సవాల్‌పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందించారు. ఉత్తమ్‌తో మాట్లాడానని, కేటీఆర్‌ సవాల్‌ను స్వీకరిస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలవకపోతే ఉత్తమ్‌తోపాటు తాను రాజకీయ సన్యాసం తీసుకుంటామని కోమటిరెడ్డి సవాల్‌ విసిరారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ  కేటీఆర్‌ అధికారం ఉందని మూర్ఖంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్‌ వాడింది మనుషులు మాట్లాడే భాషేనా? అని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు తనను పార్టీలోకి రమ్మని అడగలేదా? అని నిలదీశారు. మీరు తన దగ్గరకు వచ్చారు తప్ప తాను ఏనాడూ రాలేదని, కావాలంటే సీసీ టీవీ పుటేజ్‌ చూపిస్తానని తెలిపారు. మిషన్‌ భగీరథ, ఫైబర్‌గ్రిడ్‌లో సగం కంపెనీలు కేటీఆర్‌వే  అని ఆరోపించారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోలేకపోవడం మీ అసమర్థతే అన్న కోమటిరెడ్డి మోదీని విమర్శించాలంటే భయపడుతున్నారని దుయ్యబట్టారు. దళితుడిని ముఖ్యమంత్రి చేయకపోతే తల నరుక్కుంటానని కేసీఆర్‌ చెప్పారని కోమటిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు మంత్రివర్గంలో మొత్తం కేసీఆర్‌ కుటుంబమే ఉందని దుయ్యబట్టారు.