ఎన్‌ఆర్‌ఐలు మాతృభూమి రుణం తీర్చుకోవాలి
Nela Ticket
Kizen
APEDB

ఎన్‌ఆర్‌ఐలు మాతృభూమి రుణం తీర్చుకోవాలి

19-04-2017

ఎన్‌ఆర్‌ఐలు మాతృభూమి రుణం తీర్చుకోవాలి

మనస్వ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు రేవతి

విదేశాల్లో స్థిరపడ్డ వారు మాతృభూమి రుణం తీర్చుకోవాలని మనస్వ్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు, ఎన్‌ఆర్‌ఐ రేవతి మెట్టుకూరు అన్నారు. హైదరాబాద్‌లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మనం ఆర్జించే దాంట్లో కొంతైనా పేదల బాగుకోసం సాయం చేయాలని తన నాన్న చెప్పేవారని, దాన్ని ఇప్పుడు తాను నెరవేర్చే అవకాశం లభించిందన్నారు.

ఉద్యోగరీత్యా అమెరికాలో ఉంటున్నానని, మాతృభూమి రుణం తీర్చుకోవడానికి ఫౌండేషన్‌ ఏర్పాటు చేశానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.వీ.రమణాచారి సూచనలు, సలహా మేరకు మొయినాబాద్‌ మండలంలోని బాకారం గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఎవరి నుంచీ సాయం ఆశించకుండా పూర్తిగా తన సంపాదన నుంచే గ్రామాన్ని మార్చాలని కంకణం కట్టుకున్నట్లు వివరించారు. ఈ నెల 5 నుంచి 15 వరకు గ్రామంలో పలు సేవా కార్యక్రమాలను చేపట్టినట్టు చెప్పారు. గ్రామస్తుల కోసం ఉచిత వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేసినట్లు చెప్పారు.

రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.  పిల్లల చదువులకోసం అవసరమైన ఖర్చులు తనే చూసుకోనున్నట్లు చెప్పారు. అపరిశుభ్రత, అనారోగ్యం, రైతుల సమస్యలు, నిరుద్యోగం తదితరాలు ఉన్నాయని, వాటన్నింటిని తొలగించడంతో పాటు సౌర విద్యుత్తును వినియోగించేలా తీర్చిదిద్దుతామని అన్నారు. విదేశాల్లో సిర్థపడ్డ వారు దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ముందు కొస్తేనే గ్రామలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రభుత్వ సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఫౌండేషన్‌ ప్రతినిధులు గోపాల్‌, భానుప్రకాష్‌, రోషన్‌, తదితరులు పాల్గొన్నారు.