సూపర్ స్టార్ అమెరికా పర్యటన

సూపర్ స్టార్ అమెరికా పర్యటన

21-04-2018

సూపర్ స్టార్ అమెరికా పర్యటన

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించిన కాలా సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. తమిళనాడులో చిత్రపరిశ్రమ సమ్మె విరమణతో విడుదలకు అడ్డంకులు తొలిగాయి. ఇక రాజకీయాల్లోకి వస్తున్నట్టు గతంలోనే రజనీకాంత్‌ ప్రకటించి ఉన్నారు. పార్టీని మాత్రం ప్రకటించలేదు. ఆయన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వివిధ సమస్యలపై మాత్రం రజనీ స్పదించడం అభిమానులకు ఆనందం కలిగిస్తోది. కొత్త పార్టీ తేదిపై మాత్రం సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఆ మధ్య ఆకస్మాత్తుగా ఆధ్మాత్మిక పర్యటన చేపట్టారు. రిషికేష్‌, బాబా ఆశ్రమాలు, ఉత్తరాఖండ్‌ వంటి ప్రదేశాలకు వెళ్ళారు. తిరిగి వచ్చాక పార్టీని ప్రకటిస్తారని అంతా ఆశగా ఎదురుచూసినా వారిని నిరాశే ఎదురైంది. 

ఇప్పుడు రజనీకాంత్‌ అమెరికా పర్యటనకు వెళుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో కబాలి విడుదల సమయంలో ఆయన అమెరికాలోనే ఉన్నారు. అప్పట్లో ఆరోగ్యకారణాలే అంటూ ప్రచారం జరిగింది. కానీ వాటన్నింటికి తోసి రాజని పూర్తి ఆరోగ్యంగా కనిపించారు. ఈసారి అమెరికా పర్యటన దేనికోసం అనేది తెలియరాలేదు. రాజకీయాల్లో పూర్తిగా మునిగిపోతే వ్యక్తిగత పర్యటనలు చేయడానికి వీలవదనే ఉద్దేశంతో ముందుగానే వెళుతున్నట్టు అభిమానులు భావిస్తున్నారు. తలైవా అమెరికా వెళ్లినప్పటికీ పార్టీ ఏర్పాట్లను సన్నిహితులు చూస్తారనే మాట వినిపిస్తోంది. రజనీ నటిస్తున్న చిత్రాలు 2.0, కాలా పూర్తయ్యాయి. వీటి ప్రమోషన్లలో రజనీ పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే మరో కొత్త సినిమాలో నటించడానికి రజనీ అంగీకరించి ఉన్నారు. అంటే ఈ ఏడాది నటునిగా ఆయన బిజిగానే ఉంటారని భావించవచ్చు. ఆ తర్వాతే రాజకీయ పార్టీ గురించి ఆలోచిస్తారని సన్నిహితులు అంటున్నారు. తమిళనాడులో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి పార్టీ విషయంలో తొందరపడాల్సిన అవసరం లేదని ఆయన వర్గీయులు భావిస్తున్నట్టు సమాచారం.