"ఒక్కడు మిగిలాడు" చిత్రంలోని మంచు మనోజ్ సెకండ్ లుక్ విడుదల!!
MarinaSkies
Kizen
APEDB

"ఒక్కడు మిగిలాడు" చిత్రంలోని మంచు మనోజ్ సెకండ్ లుక్ విడుదల!!

19-05-2017

రాకింగ్ స్టార్ మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ గా, బాధ్యతగల యువ విద్యార్ధిగా ద్విపాత్రాభినయం చేస్తున్న చిత్రం "ఒక్కడు మిగిలాడు". అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పద్మజ ఫిలిమ్స్-న్యూ ఎంపైర్ సెల్యులాయిడ్స్ పతాకాలపై ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 

ఇదివరకు విడుదలైన ప్రభాకరన్ గా మంచు మనోజ్ ఫస్ట్ లుక్ కు విశేషమైన స్పందన రాగా.. రేపు (మే 20) మంచు మనోజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో మంచు మనోజ్ పోషిస్తున్న మరో పాత్ర లుక్ ను విడుదల చేశారు. మిలిటెంట్ లీడర్ పాత్ర కోసం భారీగా బరువు పెరిగిన మంచు మనోజ్ స్టూడెంట్ లుక్ కోసం దాదాపు 15 కేజీలు తగ్గడం విశేషం.   

సెకండ్ లుక్ విడుదల సందర్భంగా చిత్ర నిర్మాతలు ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్ లు మాట్లాడుతూ.. "ఎల్.టి.టి.ఐ కమాండర్ గా మంచు మనోజ్ లుక్ కు ఇప్పటికీ విశేషమైన రీతిలో ఆదరణ లభిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ చిత్రంలో మనోజ్ సెకండ్ లుక్ ను ఆయన పుట్టినరోజు సందర్భంగా నేడు విడుదల చేశాం. పాత్ర కోసం ఆయన పడిన శ్రమ స్క్రీన్ పై కనిపిస్తుంది. కేవలం నెలల వ్యవధిలో 15 కేజీల బరువు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. పాత్ర పండించడానికి మనోజ్ పడే ప్రయాస ఏంటో అదే చెబుతుంది. షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకొన్నాయి. జూన్ మొదటివారంలో ఆడియోను విడుదల చేసి.. నెలాఖరుకు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం" అన్నారు. 

మంచు మనోజ్, అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ, పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కళ: పి.ఎస్.వర్మ, సినిమాటోగ్రాఫర్: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక శ్రీనివాస్, స్క్రీన్ ప్లే: గోపీమోహన్, సంగీతం: శివ నందిగామ, నిర్మాత: ఎస్.ఎన్.రెడ్డి-లక్ష్మీకాంత్, దర్శకత్వం: అజయ్ ఆండ్రూస్ నూతక్కి!