ఎస్పీ బాలుకు ఇళయరాజా నుంచి లీగల్‌ నోటీస్‌
APEDB

ఎస్పీ బాలుకు ఇళయరాజా నుంచి లీగల్‌ నోటీస్‌

20-03-2017

ఎస్పీ బాలుకు ఇళయరాజా నుంచి లీగల్‌ నోటీస్‌

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు సంగీత దర్శకుడు ఇళయరాజా నుంచి లీగల్‌  నోటీసు అందింది. ఎస్పీబీ-50 కార్యక్రమంలో భాగంగా అమెరికాలో ఉన్న బాలసుబ్రహ్మణ్యం దీనిపై సామాజిక మాధ్యమంలో స్పందించారు. ఇళయరాజా నుంచి లీగల్‌ నోటీసు అందుకున్న తర్వాత ఆశ్చర్యం వేసింది. నాతోపాటు నా కుమారుడు చరణ్‌, చిత్రకు కూడా నోటీసులు వచ్చాయి. అందులో ఇళయరాజా అనుమతి లేకుండా ఆయన పాటలు పాడకూడదని, అలా చేస్తే కాపీరైటు నిబంధనల ఉల్లంఘన కింద పెద్ద మొత్తంలో జరిమానా కట్టాల్సి వస్తుందని ఉంది. అయితే నా కుమారుడు చరణ్‌ ఎస్పీబీ-50 పేరిట ప్రపంచ యాత్రను గతేడాది ఆగస్టులో ప్రారంభించారు. అందులో భాగంగా ఇప్పటికే భారత్‌తోపాటు, టోరంటో, రష్యా, శ్రీలకం, మలేసియా, సింగపూర్‌, దుబాయ్‌ల్లో చాలా కచేరీలు ఇచ్చాం. అమెరికాలో కచేరీ నిర్వహించేటప్పుడే ఈ నోటీసుల గొడవ మొదలైంది. ఈ విషయంలో తనకు ఎలాంటి సంబంధమూ లేదు. చట్టాన్ని గౌరవిస్తాను. చట్టపరంగా నోటీసులు వచ్చినప్పుడు నేను కూడా చట్టపరంగానే స్పందించాల్సి ఉంటుంది. కానీ, నాకు అది ఇష్టం లేదు అని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. న్యాయపరమైన అంశాలు తనకు తెలియవని, తన ప్రియమిత్రుడైన ఇళయరాజాకు అసౌకర్యం కలిగేలా ఇకపై  పాటలు పాడబోమని తెలిపారు.

 ఇప్పటివరకు సాగిన ఎస్పీబీ-50 ప్రపంచ యాత్రలో అనేక మందికి చెందిన గీతాలను ఆలపించామని, అందులో తనవి కూడా ఉన్నాయని గుర్తు చేశారు. ఇళయరాజా పాటలు ఇకపై ఆలపించబోమని సృష్టం చేశారు. ఈ యాత్ర నిర్వాహకులు, ప్రయోజకులను ఇబ్బంది పట్టేలా తప్పుడు ప్రచారాలు చేయొద్దని కోరారు. మరోవైపు, సామాజిక మాధ్యమాల్లో ఈ లీగల్‌ నోటీసుల వ్యవహారంపై చర్చ విస్తృతంతా సాగుతోంది. దీనిపై కొందరు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మద్దతుగా, మరికొందరు ఇళయరాజాకు మద్దతుగా వ్యాఖ్యాలు పెడుతున్నారు. దాదాపు 40 సంవత్సరాలుగా బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాలు కలిసి కొన్ని వేల పాటలకు పనిచేశారు.