అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను

అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను

16-04-2018

అమెరికాను వణికిస్తున్న మంచు తుపాను

వసంత రుతువు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గల్ఫ్‌ తీరం నుంచి గ్రేట్‌ లేక్స్‌ ప్రాంతం వరకు ఏర్పడిన తుఫాను వాతావరణం మధ్య అమెరికాను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. విపరీతంగా కురుస్తున్న మంచు, చలిగాలులు, వర్షాలు, వడగాళ్ల కారణంగా వందలాది విమానాలను రద్దు చేశారు. రహదారుల నిండా మంచు పేరుకుపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. లూసియానాలో వేగంగా వీస్తున్న గాలుల కారణంగా చెట్టు కుప్పకూలి పక్కనున్న ఇంటిపై పడటంతో, అందులో నిద్రిస్తున్న రెండేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

రన్‌వేపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో మిన్నియాపోలిస్‌-సెయింట్‌ పాల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలను రద్దు చేశారు. దక్షిణ డకోటాలో అతిపెద్ద నగరమైన సియోక్స్‌ ఫాల్స్‌లోనూ విమానాశ్రయాన్ని వరుసగా రెండోరోజూ మూసేశారు. మిన్నియాపోలిస్‌లో శనివారం రాత్రికి 33 సెంమీ మేర మంచు కురవడంతో ఆదివారం జరగాల్సిన బేస్‌బాల్‌ గేమ్‌ను రద్దు చేశారు. వర్షాలు కురుస్తుండటంతో యాంకీస్‌, టైగర్స్‌ నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. ఆదివారం నాటికి దక్షిణ మిన్నెసోటా, మిన్నియాపోలిస్‌, సెయింట్‌పాల్‌లో 51 సెంమీ మంచు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆదివారంనాటి మిన్నెసోటా, విస్కాన్సిస్‌, మిచిగాన్‌ మీదగా న్యూయార్క్‌ న్యూఇంగ్లాండ్‌ను తుపాను తాకే అవకాశం ఉంది.