శ్రీనాధుని సమాజ దర్శనం ప్రసంగంతో అలరించిన 129వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

శ్రీనాధుని సమాజ దర్శనం ప్రసంగంతో అలరించిన 129వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

17-04-2018

శ్రీనాధుని సమాజ దర్శనం ప్రసంగంతో అలరించిన 129వ టాంటెక్స్ సాహిత్య వేదిక సదస్సు

ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) సాహిత్య వేదిక ఆధ్వర్యంలో "నెలనెలా తెలుగు వెన్నెల" సాహిత్య సదస్సు ఆదివారం ఏప్రిల్ 15 వ తేదీన సాహిత్యవేదిక సమన్వయకర్త శ్రీ వీర్నపు చినసత్యం అధ్యక్షతన ఘనంగా నిర్వహించబడింది. ప్రవాసంలో నిరాటంకంగా 129 నెలలపాటు ఉత్తమ సాహితీవేత్తల నడుమ సాహిత్య సదస్సులు నిర్వహించటం ఈ సంస్థ విశేషం. డాలస్ లోని భాషాభిమానులు,సాహిత్యప్రియులు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి విచ్చేసి సభను జయప్రదం చేసారు.

స్వాతిమూర్తి శిష్య బృందం ప్రధాన గీతంతో ఆరంభమైన ఈ కార్యక్రమంలో, డా.ఊరిమిండి నరసింహారెడ్డి తెలుగు సామెతలు మీద ఆసక్తి కరమైన అంశాలు పంచుకొన్నారు.  స్వర్ణ అట్లూరి గారు ఎప్పటిలా తెలుగు క్విజ్ చక్కగా నిర్వహించారు.  చిన్నారులు సాహితి,సింధూర వేముల అన్నమయ్య కిర్తనలతో అందరిని అబ్బుర పరిచారు. శ్రీనాధ్ జంధ్యాల సభకు అంత్ర్వేది పుస్తక పరిచయం చేశారు. పుదూర్  జగదీశ్వరన్ గారు ఆముక్తమాల్యద, శ్రీ భాగవతం నుండి కొన్ని ఎంచుకొన్న పద్యాలు, సాహిత్య మెళుకువలు తెలియచేశారు. ప్రముఖంగా శ్రీ కృష్ణ దేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో "శ్రీ కమనీయ హారమణి .." అనే మొట్టమొదటి పద్యంలో ఉన్న కవిత్వాన్ని సోదాహరణలతో వివరించి ప్రసంశలు అందుకొన్నారు.

తదుపరి అమెరికాలో USA ఓపెన్ ఇంటర్నేషనల్ కరాటే పోటీలలో బంగారు పతకం సాధించిన తెలుగు తేజం రవితేజను సాహితీ మండలి సభ్యులు బసాబత్తిన శ్రీనివాసులు సభకు పరిచయం చేశారు . వివేక్ తేజ మాట్లాడుతూ ఆత్మరక్షణార్థం వీలైనంతవరకు ప్రతి ఒక్కరూ కరాటే, తైక్వండో లాంటి విద్యలు అభ్యసించాలి అని, తనను సంప్రదిస్తే సహాయపడడానికి సిద్ధంగా ఉన్నానని 2020 టోక్యో లో జరిగే ఒలింపిక్స్ లో పతకమే తన లక్ష్యం అని హర్షధ్వానాలమద్య ప్రకటించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ డా. జంధ్యాల జయకృష్ణ బాపూజీ విచ్చేశారు. జలసూత్రం చంద్రశేఖర్ ఆయనను సభకు పరిచయం చేస్తూ, సరస్వతీ పుత్రుడు అయిన జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారిని సభకు పరిచయం చేయడం, మర్చిపోలేని అనుభూతి అని తెలియచేసారు. ఆయన ప్రఖ్యాత కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి గారికి వీరు  స్వయానా కుమారుడు కావడం, తండ్రి అడుగుజాడల్లో నడిచి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా  చంద్రోదయం అనే కవితకు బంగారు పతకంతో సత్కరింపబడడం విశేషం. ఆయన "శ్రీనాథుని సమాజ దర్శనం " అనే అంశం మీద అమితాసక్తి గొలిపే ప్రసంగం చేశారు. శ్రీనాథుడు 15 వ శతాబ్దానికి చెందినవారని, కొండవీడు రాజ్యానికి రాజుగా ఉన్న పెదకోమటి వేమారెడ్డి కొలువులో విద్యాధికారి గా ఉండేవారని  తెలియచేసారు. సంసృత, తెలుగు భాషలతో పాటు, కన్నడ, తమిళ్ ఇంకా ఎన్నో భాషల్లో ప్రావీణ్యుడు అని తెలిపారు. 12 ఏళ్ల వయసులోనే  మరుత్త రాజ చరిత్రను, తదుపరి శృంగార నైషధం వంటి 17 కావ్యాలు రాసినా ప్రస్తుతం 7 మాత్రమే లభ్యం అవుతున్నాయని తెలిపారు. ఆయన ఎక్కువగా దేశాటనం చేశారని,  ఆనాటి కవులలో ఎక్కువగా దేశాటనం చేసిన కవి శ్రీనాధుడే నని, భాగవతాన్ని రాసిన పోతన సమకాలికుడు శ్రీనాధుడని తెలియచేసారు. ఆయనకు కవిసార్వభౌమ అనే బిరుదు ఎలా వచ్చిందో ఆసక్తికరమైన కథగా వర్ణించారు. 

హంపీ విజయనగరం రాజైన అచ్యుత రాయల కొలువులో గౌడ డింఢిమ భట్టు అనే గొప్ప కవి ఉండేవారు, శ్రీనాథుడు రాజాజ్ఞపై కొండవీడు నుండి విజయనగరం ప్రయాణం చేసి,   గౌడ డింఢిమ భట్టు ను తన వాద పటిమతో ఓడించి  కవిసార్వభౌమ బిరుదాంకితుడు అయ్యాడని తెలియచేసారు. ఇలా ఎన్నో ఆసక్తి కరమైన విషయాల తో శ్రీనాథుడుని స్మరించుకొనేలా చేసి, అందరి అభినందనలు అందుకొన్నారు.  శ్రీనాధుని జీవితాన్ని కళ్లకు కట్టినట్లు వర్ణన చేయడమే కాకుండా, తన చక్కని గాత్రంతో ఆ మహాకవి రాసిన చాటు పద్యాలు పాడి వినిపించారు. 

జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారిని, వివేక్ తేజ గారిని టాంటెక్స్ సాహితీ కమిటీ సభ్యులు,  టాంటెక్స్ అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి శీలం, ఉపాధ్యక్షుడు చినసత్యం వీర్నపు, డా. సుధ కలవగుంట, స్వర్ణ అట్లూరి, పాలకమండలి సభ్యులు శాలువా, జ్ఞాపిక ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కార్యవర్గ మరియు పాలకమండలి బృందం, ఉపాధ్యక్షుడు క్రిష్ణారెడ్డి కోడూరు, జొన్నలగడ్డ సుబ్రమణ్యం, డా.ఊరిమిండి నరసింహారెడ్డి, కాకర్ల విజయ్, డా.తోటకూర ప్రసాద్, సతీష్ బండారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తనను ఎంతో ఆదరించి, చక్కటి ఆతిధ్యం అందించిన  టాంటెక్స్ కార్యవర్గానికి శ్రీ జంధ్యాల జయకృష్ణ బాపూజీ గారు  కృతజ్ఞతలు తెలియచేయడంతో కార్యక్రమం ఘనముగా ముగిసింది. 

సమన్వయకర్త వీర్నపు చినసత్యం సాహిత్యం మీద ప్రేమ, మాతృ భాష మీద మమకారంతో విచ్చేసిన భాషాభి మానులకు, సాహితీ ప్రియులకు కృతజ్ఞతలు తెలిపారు.  ప్రత్యేక ప్రసార మాధ్యమాలైన టీవీ 5, మన టీ.వి, టీవీ9,టి.ఎన్.ఐ, ఏక్ నజర్ లకు కృతఙ్ఞతాపూర్వక అభివందనములు తెలియజేసారు.

Click here for Event Gallery