భారతీయ విద్యార్థులకు మరో కష్టం

భారతీయ విద్యార్థులకు మరో కష్టం

17-05-2018

భారతీయ విద్యార్థులకు మరో కష్టం

అమెరికా అధ్యక్షునిగా ట్రంప్‌ వచ్చిన తరువాత భారతీయ విద్యార్థులకు కష్టకాలం ఎదురైందనే చెప్పాలి. వీసా గడువు ముగిసినా అమెరికాను వీడని విదేశీ విద్యార్థుల వివరాలు తెలుసుకునేలా వీసా నిబంధనలు కఠినతరం చేస్తూ ట్రంప్‌ యంత్రాంగం ఇటీవలే ఒక ముసాయిదా విధానాన్ని రూపొందించింది. ఈ కొత్త విధానం ఆగస్టు 9 నుంచి అమల్లోకి రానుంది. ప్రతిపాదిత విధానం ప్రకారం.. నిర్దేశిత కోర్సు సమయం ముగిసిన రోజు నుంచి లేదా అనుమతించిన గ్రేస్‌ పీరియడ్‌ ముగిసినప్పటి నుంచే విద్యార్థులు అక్కడ ఉన్న ప్రతి రోజునూ చట్టవిరుద్ధంగా ఉన్నట్టే భావిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారమైతే.. అలాంటివారిని గుర్తించిన రోజు నుంచి చట్టవిరుద్ధంగా ఉన్నట్టు లెక్కిస్తున్నారు.

ఉదాహరణకు ఒక విద్యార్థి వీసా కాలపరిమితి అక్టోబరు 1తో ముగిసిందనుకుంటే.. ఏ జనవరిలోనో ఆ విద్యార్థిని ఇమిగ్రేషన్‌ అధికారులు గుర్తిస్తే జనవరి నుంచే అతడి ఉనికిని చట్టవిరుద్ధంగా భావిస్తున్నారు ప్రస్తుతం. కొత్త నిబంధనల ప్రకారమైతే.. అక్టోబరు 1న కాలపరిమితి ముగిస్తే రెండో తేదీ నుంచి అతడు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉన్నట్టే. ఒక వ్యక్తి అమెరికాలో ఎన్ని రోజులపాటు అక్రమంగా ఉన్నాడనే దాని ఆధారంగా తదుపరి చర్యలుంటాయి. ఒక విద్యార్థి వీసా కాలపరిమితి ముగిసిన తర్వాత 180 రోజుల కన్నా ఎక్కువ రోజులు అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటే సదరు విద్యార్థిని డీపోర్ట్‌ చేసి మళ్లీ 3 నుంచి 10 సంవత్సరాల దాకా అమెరికలో అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తారు. ఏడాది కన్నా ఎక్కువకాలం అక్రమంగా ఉంటే.. శాశ్వతంగా నిషేధం విధిస్తారు.