వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలకు నాటా పురస్కారం

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలకు నాటా పురస్కారం

09-07-2018

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సేవలకు నాటా పురస్కారం

నెల్లూరు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు, విపిఆర్‌ ఫౌండేషన్‌ అధినేత వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డికి ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేసింది. ఫిలడెల్పియాలో జూలై 6 నుంచి మూడురోజులపాటు జరిగిన నాటా మహాసభల్లో ఈ జీవిత సాఫల్య పురస్కారాన్ని నాటా ఆయనకు బహుకరించింది. దాదాపు 5000 మందికిపైగా హాజరైన ఈ వేడుకల్లో నాటా అడ్వయిజరీ చైర్మన్‌ డాక్టర్‌ ప్రేమ్‌రెడ్డి, నాటా అధ్యక్షుడు రాజేశ్వర్‌ రెడ్డి గంగసానితోపాటు డాక్టర్‌ పైళ్ళ మల్లారెడ్డి, డాక్టర్‌ ఎంఎస్‌ రెడ్డి ఈ పురస్కారాన్ని అందరి సమక్షంలో అందజేశారు.

వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సమాజానికి ఏదైనా చేయాలన్న తలంపు ఉన్న వ్యక్తి. వ్యాపారంలో ఒడిదొడుకులను ఎదుర్కొని నేడు అంతర్జాతీయ పారిశ్రామికవేత్తగా పేరు గడించినప్పటికీ తాను పుట్టిన జన్మభూమిని మరచిపోకుండా పలుసేవా కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. నెల్లూరు జిల్లాతోపాటు తమిళనాడులో కూడా పలు సేవా కార్యక్రమాలను ఆయన విపిఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా చేపట్టారు.

రాజకీయాల్లోకి రాకమునుపు నుండే వేమిరెడ్డి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు.  నెల్లూరులో విపిఆర్‌ విద్య పేరుతో 6వ తరగతి నుండి పదో తరగతి వరకూ కార్పొరేట్‌ స్థాయి విద్యను పూర్తి ఉచితంగా అందిస్తున్నారు. అలాగే విపిఆర్‌ వైద్యం పేరుతో ఉచిత ఆసుపత్రి నిర్వహిస్తున్నారు. వీటితోపాటు విపిఆర్‌ వికాస్‌ కార్యక్రమంలో భాగంగా 'అమతధార' పేరుతో జిల్లాలోని 52 గ్రామ పంచాయతీల్లో సొంత నిధులతో సురక్షిత తాగునీటి ప్లాంట్లు ఏర్పాటు చేయించారు. ఇంకా మరికొన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అలాగే విపిఆర్‌ సేవ ద్వారా వద్ధాశ్రమాలు, అనాథ, అంగవైకల్యం కలిగిన బాలబాలికలకు ఆశ్రయం ఇస్తున్న వివిధ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు.   జిల్లా కేంద్ర కారాగారంలోని ఖైదీలకు వస్తు రూపేణా సహాయం, జిల్లాలోని క్రీడాకారులు, కళాకారులను ప్రోత్సహిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహించారు. క్రికెట్‌ కిట్‌లను చాలామందికి ఆయన అందజేశారు. అంగవైకల్యం కలిగిన వారికి జైపూర్‌ ఫుట్‌ అందిస్తున్నారు. గుడుల నిర్మాణానికి కూడా ఆయన విరాళాలను ఇచ్చారు.

ఇలా పలు సామాజిక, ఆధ్మాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని గౌరవించడం తమ బాధ్యతగా భావించి ఆయనకు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందజేస్తున్నట్లు నాటా పేర్కొంది.

తనకు జీవితసాఫల్యపురస్కారాన్ని అందజేసిన నాటా నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలుపుతూ, విదేశాల్లో ఉన్నప్పటికీ నాటా నాయకులు, సభ్యులు తమ మాతృరాష్ట్రాన్ని విస్మరించకుండా గ్రామాలకు తరలివెళ్ళి సేవలను అందించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. నాటా చేస్తున్న సేవా కార్యక్రమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, నాటా చేస్తున్న సేవలకు తనవంతు సహాయాన్ని కూడా అందిస్తానని ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు. ఓ ప్రజాప్రతినిధిగా తనకు మరింతగా సేవలందించే అవకాశాన్ని వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కల్పించారని, ఆయనకు తాను ధన్యవాదాలను చెబుతున్నానని చెప్పారు. ఎంపిగా మిగతా చోట్ల కూడా తన సేవా కార్యక్రమాలను విస్తరించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. భవిష్యత్తులో నాటా నిర్వహించే కాన్ఫరెన్స్‌లో కూడా తాను పాల్గొంటానని, అదే విధంగా నాటా చేపట్టే సమాజ సేవలో కూడా తనవంతు చేయూతను అందిస్తానని ఆయన చెప్పారు.

Click here for Event Gallery