బాల్టిమోర్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

బాల్టిమోర్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

11-07-2018

బాల్టిమోర్ లో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం

అమెరికాలోని తెలుగు చిన్నారులకు మాతృభాష తెలుగును సులభంగా నేర్పిస్తున్న 'పాఠశాల' ఇప్పుడు 5వసంతాలను పూర్తి చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాశాఖవారు ఎన్నారై పిల్లల కోసం రూపొందించిన సిలబస్‌తో పాఠశాల అమెరికాలోని వివిధ నగరాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసి తెలుగు భాషను బోధిస్తోంది. ఇందులో భాగంగా బాల్టిమోర్‌లో ఉన్న పాఠశాల కేంద్రం తన వసంతోత్సవ వేడుకలను జూలై 9వ తేదీన ఘనంగా నిర్వహించింది. వార్‌ఫీల్డ్‌ మీటింగ్‌ రూమ్‌లో జరిగిన ఈ వేడుకలకు పాఠశాల కేంద్రం విద్యార్థులతోపాటు వారి తల్లితండ్రులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న పాఠశాల సిఇఓ చెన్నూరి వెంకట సుబ్బారావు మాట్లాడుతూ, వారధి సహకారంతో ఇక్కడ పాఠశాలను విజయవంతంగా నడుపుతున్నామని చెప్పారు. చిన్నారులు  తెలుగు భాషను నేర్చుకోవడానికి ఆసక్తితో ముందుకురావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎన్నారై చిన్నారులు తెలుగు భాషను సులభంగా నేర్చుకోవడానికి పాఠశాల సులభమైన పద్ధతిని ప్రవేశపెట్టిందని, LSRW Method ద్వారా మొదటగా పిల్లలకు భాష అర్థం అవడం (Learning), మాట్లాడటం (Speaking), చదవడం (Reading), రాయడం (Writing) నేర్పే విధంగా పాఠ్యాంశాలను రూపొందించడం జరిగిందని చెప్పారు. ఈ పద్ధతి వల్ల చిన్నారులు సులభంగా తెలుగును నేర్చుకోగలుగుతారని వివరించారు. పాఠశాల టీచర్లు కూడా చిన్నారులకు అర్థమయ్యే విధంగా బోధన చేస్తారని చెప్పారు.

వారధి ప్రెసిడెంట్‌ దామోదర్‌ పోరెడ్డి మాట్లాడుతూ, తెలుగు భాష పరిరక్షణకు తమ వంతుగా కృషి చేస్తున్నామని అందులో భాగంగా పాఠశాల ద్వారా చిన్నారులకు తెలుగు భాషను నేర్పించడం ద్వారా భాషను విస్తరింపజేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇక్కడ ఉన్న తెలుగువారు తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో వారధి పాఠశాల టీమ్‌తోపాటు, ఏరియా కో ఆర్డినేటర్‌ లవన్‌ గంగిశెట్టి, టీచర్లు వంశీ మిట్టపల్లి తదితరులు పాల్గొన్నారు.

Click here for Event Gallery