తెలుగును చక్కగా నేర్పించే పాఠశాల ఇది!

తెలుగును చక్కగా నేర్పించే పాఠశాల ఇది!

04-08-2018

తెలుగును చక్కగా నేర్పించే పాఠశాల ఇది!

అమెరికాలో తెలుగువెలుగుల ప్రస్థానం పతాకస్థాయికి చేరుకుంది. నేడు ఎక్కడ చూసినా తెలుగువాళ్ళు మీకు కనిపిస్తారు. ప్రతి ఊరిలోనూ, ప్రతి రాష్ట్రంలోనూ తెలుగువాళ్ళు విస్తరించిపోయారు. అన్నీ రంగాల్లోనూ తమ ఉనికిని వారు చాటుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్‌లోకాని, ఆతిధ్యరంగంలో కాని, ప్రభుత్వ ఉద్యోగంలో కాని, సాంస్కృతిక వేడుకల్లో కాని ఇలా వివిధ రంగాల్లో తెలుగువాళ్ళు తమ ఉనికిని సత్తాను చాటుతున్నారు. ఇదే సమయంలో తమ భాషను, సంస్కృతిని అంతరించిపోకుండా తమ పిల్లలకు కూడా వాటిని అందించాలని వారు భావిస్తున్నారు. తమలాగానే ఇక్కడే పుట్టిన పిల్లలకు తెలుగు భాషను నేర్పించి వారి ద్వారా తమ అమ్మానాన్నలతో మాట్లాడి వారిని సంతోషపరచాలని అనుకుంటున్నారు. అలాగే తాము చేస్తున్న తెలుగు కార్యక్రమాలు తమ పిల్లలకు సరిగా అర్థం కావడం లేదని కూడా వారు గుర్తించారు.

ఈ నేపథ్యంలో అలాంటి పిల్లలకు తెలుగు భాషను సులువుగా నేర్పించడానికి ముందుకు వచ్చింది 'పాఠశాల'. ఐదేళ్ళ క్రితం బే ఏరియాలో ప్రారంభమైన ఈ పాఠశాల నేడు అంచెలంచెలుగా అన్నీ నగరాల్లోకి విస్తరిస్తోంది. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు తెలుగు భాషను నేర్పిస్తోంది. అంకితభావంతో పనిచేసే టీచర్లతో, వలంటీర్లతో విద్యార్థులకు చక్కగా తెలుగును వారికి అర్థమయ్యేలా చెబుతోంది.  5 వసంతాలను పూర్తి చేసుకున్న ఈ పాఠశాల ఇప్పుడు 6వ వసంతంలోకి అడుగుపెడుతోంది. పాఠశాల 2018-19 విద్యాసంవత్సరం అడ్మిషన్లను ప్రారంభించింది. తమ పాఠశాలల్లో మీ చిన్నారులను చేర్పించాలని కోరుతోంది.

తెలుగుభాషను మన చిన్నారులకు ఎందుకు నేర్పించాలంటే...

మన మాతృభాష తెలుగు. మాటకైనా, పాటకైనా మన తెలుగువంటి భాష మనకు ఎక్కడా కనిపించదు. అమ్మలా కమ్మనైనది. మాధుర్యంలో అమృతానికి మించినది మన తెలుగు భాష. ఒక సంస్కారం, ఒక సౌకుమార్యం ఎలాంటి భాషా శబ్దాలనైనా తనలో ఇముడ్చుకునే శక్తి కలిగిన ఏకైనా భాష మన తెలుగు. అచ్చ తెలుగు నుడికారాలు, ఛందస్సులు, పద ప్రయోగాల్లో చురుక్కులు, చమక్కులు, ప్రాంతాల వారీగా యాసలు, శ్రావ్యమైన చక్కటి పద్యాలు మన తెలుగుకు ఉన్న ఘనమైన సొత్తు. ఇలాంటి తెలుగు భాషను మన చిన్నారులకు నేర్పించకపోతే కొద్దికాలానికే తెలుగు భాష ఉనికిని కోల్పోతుంది. తరువాతి తరానికి తెలుగు భాష ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. సముద్రతరంగాలు వెళ్ళాక స్నానం చేస్తానంటే ఎలా కుదరదో, తెలుగు భాషను చక్కగా, సులువుగా నేర్పించే పాఠశాలలు దగ్గరలో ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకోకపోతే ఇబ్బందులను పడాల్సి ఉంటుంది.

పాఠశాల ప్రత్యేకతలు ఏవిటి?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ గుర్తింపుతో, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నారై తెలుగు పిల్లలకోసం తయారు చేసిన సిలబస్‌తో పాఠశాల తెలుగుభాషను బోధిస్తోంది. పాఠశాలకోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విద్యాశాఖవారు లెర్నింగ్‌ స్పీకింగ్‌-రీడింగ్‌- రైటింగ్‌ (ఎల్‌ఎస్‌ఆర్‌డబ్ల్యు) పద్ధతిలో తెలుగు పలుకు కోర్స్‌ను రూపొందించారు.

APSCERT (AP State Council for Educational Research Training Official body developing Text books and Teaching material in AP) పూర్తి శాస్త్రీయ పద్ధతులతో సరికొత్త సిలబస్‌ను రూపొందించింది. LSRW Method ద్వారా మొదటగా పిల్లలకు భాష అర్థం అవడం (Learning), మాట్లాడటం (Speaking), చదవడం (Reading), రాయడం (Writing) నేర్పే విధంగా పాఠ్యాంశాలను రూపొందించడం జరిగింది.

 పిల్లలకు తెలుగు అర్థమై మాట్లాడేందుకు వీలుగా తొలి సంవత్సరం తెలుగు పలుకు కోర్స్‌ బోధనలో 50శాతం రాత, 50 శాతం చెప్పడం ఉంటుంది. ఆ నుంచి ఱ వరకు 56 అక్షరాలు నేర్పడం అనేది పాత పద్ధతి. ఆధునిక శాస్త్ర పరిశోధనల ద్వారా తయారైన కొత్త పద్ధతిని పాఠశాల పరిచయం చేస్తోంది. ఎన్నారై ప్రపంచంలో ఇలాంటి ప్రక్రియ ద్వారా తెలుగు అక్షరాలను నేర్పించే పద్ధతిని పాఠశాల తొలిసారిగా అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త పద్ధతి ద్వారా పిల్లలకు ముందుగా కొన్ని సరళపదాలను నేర్పి, వాటిని పలకడం, చదవడం చేయిస్తారు.

కేవలం భాష నేర్పడమే కాకుండా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు సంగీత సాహిత్యాలను మమేకం చేస్తూ 'పదహారణాల తెలుగుదనం' వెల్లివిరిసేలా పాఠశాల  పుస్తకాలు ఉంటాయి. అమ్మ భాషలోని మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ  'మాట్లాడుతూ భాష నేర్చుకోవడం' అనే పద్ధతిలో పాఠ్యపుస్తకాలను రూపొందించడం జరిగింది. తెలుగులో మాట్లాడడం, విన్నది అర్థం చేసుకునేలా చూడటం,  వారిలో ఆలోచనలు కలిగేలా చెప్పడం, వారి భావాలను తెలుగులోనే చెప్పేలా  ప్రోత్సహించడం వంటివి చేయడం ద్వారా చిన్నారులకు తెలుగు భాషపై పట్టు పెంచేలా తెలుగు పలుకు కోర్స్‌ పుస్తకాలను తయారు చేయడం జరిగింది. మరోవైపు అక్షరాల కన్నా బొమ్మలతో మరింత నేర్చుకోగలరన్న ఉద్దేశ్యంతో బొమ్మల ద్వారా తెలుగును నేర్చుకునే అవకాశం ఇందులో ఉంది.  పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలు స్వేచ్ఛగా మాట్లాడడానికి, వాళ్ళు తెలుగు ఇష్టపడి నేర్చుకునేలా శ్రద్ధ తీసుకోవడం మా ప్రత్యేకతలో ఓ భాగం.

బోధన సమయంలోనే వారికి కొన్ని సన్నివేశాలను చూపించి దానిపై మాట్లాడమని చెప్పడం ద్వారా వారిలో తెలుగుపై ఉన్న బెరుకును పోగొట్టుకునేందుకు పాఠశాల కృషి చేస్తుంది. ఒకవేళ వారు సరైన తెలుగు పదాలను కాకుండా ఇంగ్లీష్‌లో చెప్పినప్పుడు ఆ పదాలకు సరైన తెలుగు పదాన్ని తెలియజేసి దానిని వారి చేత చెప్పించడం ద్వారా వారు తెలుగులో ఆ పదాలను తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. స్లేట్‌' అని విద్యార్థి చెప్పారనుకోండి. 'పలక' అని తెలుగులోనూ చెప్పమనాలి.

అలాగే తెలుగు భాష ఎంత వింటుంటే అంత బాగా మాట్లాడడం వస్తుంది. అటువంటి వాతావరణాన్ని పాఠశాల కల్పిస్తుంది. బోధించే టీచర్లు కూడా చిన్నారులతో చిన్న చిన్న మాటలను బోధన తరువాత తెలుగులోనే మాట్లాడిస్తారు.

పాఠం ద్వారా పరిచయం చేసే కీలక పదం ఉన్న వాక్యాలను (తెలుగులో మాట్లాడుదాం / ఈ  పాట పాడుకుందాం)  బోర్డుపై రాయడంతోపాటు, చిన్నారుల చేతనే ఆ బోర్డుపై ఉన్న వాక్యాలను చదివించడం జరుగుతుంది. దాంతోపాటు ఆ వాక్యంలో ఉన్న కీలకమైన పదాన్ని వారు గుర్తించేలా చేయడం ద్వారా వారిలో భాషా పటిమ పెరిగేలా పాఠశాల చేస్తుంది. కీలక పదం ఎక్కడ ఉందో గుర్తింప జేయడంతోపాటు, ఈ పదాన్ని విడిగా బోర్డు మీద రాసి, అందరితోను చదివిస్తారు. ప్రతి పదాన్ని పరిచయం చేసేటపుడు దాని పలికే విధానాన్ని టీచర్లు సృష్టంగా నేర్పుతారు. పదాలలోని అక్షరాలను గుర్తించేలా చేస్తారు. పదాలను పరిచయం, చేసేటపుడు ఆ కొత్తపదం లోని అక్షరాలతో వీలైనన్ని ఎక్కువ పదాలను  వారిచేత తయారు చేయిస్తారు. చదివిస్తారు. దాంతోపాటు అభ్యాసం కూడా చేయిస్తారు. కొత్త పదం ఎలా రాయాలో బోర్డు మీద మీరు రాస్తూ పిల్లలను పరిశీలించమని చెప్పి తరువాత వారిచేతనే ఆ పదాన్ని రాసే క్రమాన్ని నేర్పిస్తారు. చుక్కలను కలుపుతూ రాయడం. గీతలలో అందంగా రాయడం వంటి అభ్యాసాలు రాయించి తర్వాత వారి చేత సాధన  చేయిస్తారు.  

భాష నేర్పడంలో 50 శాతం మాట్లాడడానికి 30 శాతం చదవడానికి 20 శాతం రాయడానికి కేటాయించడం వల్ల చిన్నారులకు భాషపై పట్టు పెరుగుతుంది. క్రమక్రమంగా ఈ శాతాన్ని కూడా మార్చుతూ బోధనను ముందుకు తీసుకెళుతారు. పాఠశాల బోధనను తెలుసుకోవాలన్న వారికోసం ఆన్‌లైన్‌లో 30రోజుల ఉచిత శిక్షణ ను కూడా పాఠశాల కల్పించింది.

తెలుగు పలుకు 4 సంవత్సరాల కోర్సులో తెలుగు పలుకు, తెలుగు అడుగు, తెలుగు పరుగు, తెలుగు వెలుగు ఉంటాయి. 2వ సంవత్సరం, 4వ సంవత్సరం చివరిలో జరిపే పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎపి ప్రభుత్వ సర్టిఫికెట్లను కూడా అందిస్తుంది. 

ఎక్కడెక్కడ పాఠశాల కేంద్రాలు ఉన్నాయి?

అమెరికాలో వివిధ నగరాల్లో స్థానికంగా ఉన్న తెలుగు సంఘాల సహకారంతో పాఠశాల కేంద్రాలు పనిచేస్తున్నాయి. బే ఏరియాలో బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) సహకారంతో డబ్లిన్‌, ఫ్రీమాంట్‌, శాన్‌హోసె, శాన్‌రామన్‌, సన్నివేల్‌లో పాఠశాల కేంద్రాలు పనిచేస్తున్నాయి.

మేరీలాండ్‌లో స్థానిక తెలుగు సంఘం వారధి సహకారంతో బాల్టిమోర్‌, ఎల్లికాట్‌ సిటీలో పాఠశాల కేంద్రాలు ఉన్నాయి.
ఒహాయో రాష్ట్రంలో కొలంబస్‌ ఒహాయోలో పాఠశాల కేంద్రం ఉంది.
న్యూజెర్సి రాష్ట్రంలో స్థానిక తెలుగు సంఘం తెలుగు కళాసమితి (టిఫాస్‌) చేయూతతో ఈస్ట్‌ బ్రన్స్‌విక్‌, రాబిన్స్‌విల్లే, సోమర్‌సెట్‌లో పాఠశాల కేంద్రాలు పనిచేస్తున్నాయి.
ఫిలడెల్పియా రాష్ట్రంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సహకారంతో ఎక్స్‌టన్‌, చెస్టర్‌బ్రూక్‌, వూరీస్‌లలో పాఠశాల కేంద్రాలు దిగ్విజయంగా నడుస్తున్నాయి.
సదరన్‌ కాలిఫోర్నియాలో ఇర్విన్‌ (సిఎ), లేక్‌ ఫారెస్ట్‌లలో పాఠశాల కేంద్రాలను నిర్వహిస్తున్నారు.
వర్జీనియా రాష్ట్రంలో గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సమితి (జిడబ్ల్యుటిసిఎస్‌) సహకారంతో హేర్న్‌డన్‌, సౌత్‌రైడింగ్‌లలో పాఠశాల కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మిచిగన్‌ రాష్ట్రంలో డిట్రాయిట్‌లో పాఠశాల కేంద్రం, కనెక్టికట్‌లో పాఠశాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
చికాగో, డల్లాస్‌, అట్లాంటా, హ్యూస్టన్‌, ఇండియానాపొలిస్‌లో కూడా పాఠశాల కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

పాఠశాల గురించి ఇతర వివరాల కోసం సంప్రదించండి.

చెన్నూరి వెంకట సుబ్బారావు, సిఇఓ పాఠశాల
ఫోన్‌ 317 544 9132
subbarow.chennuri@gmail.com
www.paatasala.net
Email : info@paatsala.net
Ph: 4089339518