మే 3 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

మే 3 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

25-04-2017

మే 3 నుంచి సీఎం చంద్రబాబు అమెరికా పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మే 3వ తేదీ రాత్రి పొద్దుపోయాక అమెరికా పర్యటనకు బయలుదేరనున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. ఈ బృందం తిరిగి 12వ తేదీ ఉదయం ఇండియాకు రానున్నది.

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సాగనున్న ఈ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్‌, ఐటీ సలహాదారు జె.ఎ.చౌదరి, ఏపీఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు వేమూరి రవి కుమార్‌, ఉన్నతాధికారులు సాయి ప్రసాద్‌, అజయ్‌జైన్‌, సాల్మన్‌  ఆరోఖ్యరాజ్‌, విజయానంద్‌లతో  పాటు ఎకనమిక్‌ డెవలప్‌మెంట్‌ బోర్డ్‌ అధ్యక్షుడు కృష్ణ కిశోర్‌ తదితరులు అమెరికాలో పర్యటించే బృందంలో ఉన్నారు.  అమెరికా వ్యాప్తంగా తెలుగు వారు అధికంగా నివశించే ప్రాంతాల్ని వీరు సందర్శించడంతోపాటు అక్కడి ఎన్నారైలు ఏర్పాటు చేసిన సమావేశాల్లో పాల్గొననున్నట్లు తెలిసింది.

ముఖ్యమంత్రి కాలిఫోర్నియా పర్యటనను దృష్టిలో ఉంచుకుని బే ఏరియాలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి ఇప్పటికే ముఖ్యమంత్రి పర్యటనకు కావాల్సిన ఏర్పాట్లపై అక్కడి ఎన్నారైలతో సమీక్షించారు.