భారత స్వాతంత్య్రదినోత్సవాన్ని పురస్కరించుకుని ఇండో అమెరికన్స్ అసోసియేషన్ (ఎఐఎ), బాలీ 92.3 ఆధ్వర్యంలో సంజీవ్ గుప్తా (సిపిఎ) సమర్పించిన 'స్వదేశ్' వేడుకలు ఆగస్టు 4వ తేదీన ఘనంగా జరిగింది. శాన్‌హోసెలోని శాంతాక్లారా కౌంటీ ఫెయిర్‌గ్రౌండ్‌లో జరిగిన ఈ స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో బే ఏరియాలోని దాదాపు 30కిపైగా భారతీయ సంఘాలు పాల్గొన్నాయి. దేశభక్తి నినాదాలతో, ఆటాపాటలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఈ సంవత్సరం గతంలో కన్నా మరింత వైభవంగా జరిగిందని కార్యక్రమంలో పాల్గొన్న పలువురు పేర్కొనడం విశేషం.
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన ఆధ్వర్యంలో జరిగిన మ్యూజికల్ కన్సర్ట్ మరచిపోలేని విధంగా సాగింది. ఈ వేడుకలకు గ్రాండ్ స్పాన్సర్‌గా అపెక్స్ కన్సల్టింగ్ సర్వీసెస్, గోల్డ్ స్పాన్సర్స్‌గా ఆన్‌షోర్ కరె, వెల్స్ఫర్గో, ఫోర్చూన్ ఇన్స్యూరెన్స్ సర్వీస్‌తోపాటు యు స్మైల్ డెంటల్, పిఎన్జి జ్యూవెల్లర్స్, న్యూయార్క్ లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (సిఎ), మంత్రి డెవలపర్స్ స్పాన్సర్లుగా వ్యవహరించాయి. ఈ వేడుకలను ది ఫెయిర్ ప్రమోట్ చేసింది. విరిజల్లు మీడియా స్పాన్సర్‌గా వ్యవహరించింది.
వేడుకల్లో భాగంగా ఉదయం 11 నుంచి రాత్రి 11 దాకా జరిగిన కార్యక్రమాలను దాదాపు 20,000 మందికిపైగా వీక్షించారు. ఛోటో భీమ్, చుట్కిల పలకరింపులు, నిరంతరాయంగా వేదికపై జరిగిన కార్యక్రమాలు, ఆటల పోటీలు, పెట్టింగ్ జూ, డిజె, కార్నివాల్ గేమ్స్, చిన్నారులకోసం ప్రత్యేక కార్యక్రమాలు, వాటర్ బాల్స్, టీ కప్ రైడ్, ట్రైన్ వంటివి చిన్నారులను ఆకట్టుకున్నాయి. భారతీయ వేడుకలు ఉట్టిపడేలా వేదిక ప్రాంతాన్ని అలంకరించారు. దాదాపు 60 మంది వ్యాపారవాణిజ్యస్టాల్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. దుస్తులు, జూవ్వెల్లరి, డెంటిస్ట్, మెహంది, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఐటీ ట్రైనింగ్, హెల్త్ సర్వీసెస్ వంటి సంస్థలు తమ స్టాల్స్‌ను ఇక్కడ ఏర్పాటు చేశాయి. వేడుకల్లో భాగంగా కూచిపూడి, భరతనాట్యం, కథక్, భాంగ్రా, శాస్త్రీయ నృత్యాలు, బాలీవుడ్ నృత్యాలు వంటివి వచ్చినవారిని ఎంతో ఉల్లాస పరిచాయి. స్థానికంగా ఉన్న 100కు పైగా సంస్థలు ఈ ప్రదర్శనలో పాల్గొన్నాయి.
స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకుని మువ్వన్నెల జెండాను కూడా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్, బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీలహరి, శాన్‌హోసె మేయర్ శామ్ లిక్కర్డో, కాలిఫోర్నియా స్టేట్ సెనెటర్బాబ్ వికోస్కీ, స్టేట్ అసెంబ్లీ మెంబర్ యాష్ కల్రా, కుపర్టినో కౌన్సిల్ మెంబర్ సవితా వైద్యనాథన్, రాజ్సల్వాన్ ఫ్రీమాంట్ కౌన్సిల్ మెంబర్‌తోపాటు ఫ్రీమాంట్, కుపర్టినో మేయర్లు తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.
తరువాత 2 గంటలపాటు బప్పీలహరి మ్యూజికల్ విభావరి జరిగింది. ఈ సందర్భంగా బప్పీలహరి మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న భారతీయుల దేశభక్తి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నానని చెప్పారు. ఎఐఎ టీమ్ ఈ?వేడుకలను తనకు మరచిపోలేని విధంగా తీర్చిదిద్దిందని అభినందించారు.