23నుంచి అమెరికాలో చంద్రబాబు పర్యటన

23నుంచి అమెరికాలో చంద్రబాబు పర్యటన

12-09-2018

23నుంచి అమెరికాలో  చంద్రబాబు పర్యటన

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబర్‌ 22 నుంచి అమెరికాలో పర్యటించనున్నారు. యునైటెడ్‌ నేషన్స్‌ ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో సెప్టెంబర్‌ 23 నుంచి జరిగే సహజసిద్ధ వ్యవసాయంపై జరిగే సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. న్యూజెర్సిలో జరిగే తెలుగు దేశం పార్టీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు.

ఐకరాజ్యసమితి నిర్వహిస్తున్న ఈ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయం లో పురుగుమందులను తగ్గించి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవశ్యకతపై ప్రసంగించనున్నారు. సెప్టెంబర్‌ 23వ తేదీన ఎపిఎన్‌ఆర్‌టీ, ఎన్నారై టీడిపి ఇతర సంఘాలు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26వ తేదీన అమెరికా వ్యాపార వాణిజ్య ప్రముఖుల తోనూ, భారతీయ సంతతి ప్రముఖుల తోనూ సమావేశమవుతారని సమాచారం. ఆయనతో పాటు రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర,  ఎపిఎన్‌ఆర్‌టీ చైర్మన్‌ రవి వేమూరు, ఎపి ఇడిబి సిఇఓ కృష్ణకిశోర్‌ జాస్తి, రాష్ట్ర సమాచారశాఖ కమిషనర్‌ వెంకటేశ్వర్‌ కూడా అమెరికా వస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి కూడా ముఖ్యమంత్రి పర్యటనలో పాల్గొనేందుకోసం 10వ తేదీన అమెరికా బయలు దేరుతున్నారు. ఆయన కూడా న్యూజెర్సి ముఖ్యమంత్రి సభలో పాల్గొంటున్నారు.

న్యూయార్క్‌, న్యూజెర్సిలో పర్యటించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యక్రమా లపై ఎపిఎన్‌ఆర్‌టీ అధ్యక్షుడు రవి వేమూరు ఇప్పటికే పలువురితో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కూడా ఆయన కలుసుకున్నారు. ఎన్నికల ముందు జరుగుతున్న పర్యటన కాబట్టి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ఎపిఎన్‌ఆర్‌టీ తరపున పలువురు కో ఆర్డినేటర్లతోపాటు ఇతరులు కూడా ఈ పర్యటన విజయవంతానికి కృషి చేస్తారని రవి వేమూరు ముఖ్యమంత్రికి తెలిపారు.

న్యూజెర్సి సభ ఏర్పాట్లను సమీక్షించిన చంద్రబాబు

తన అమెరికా పర్యటనలో భాగంగా న్యూజెర్సిలో తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఇతరులతో జరగనున్న సమావేశంపై ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షిం చారు. అమెరికాలో ఎన్నారై టీడిపి ప్రముఖునిగా ఉన్న,  ఉత్తర అమెరికా ఎపి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి మర్యాదపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును సెప్టెంబర్‌ 5వ తేదీన కలిసినప్పుడు ఈ సమావేశంపై ఆయనకు కొన్ని సూచనలు చేశారు. ఇది పార్టీ పరంగా జరిగే సభ అంటూ, ఈ సభ జయప్రదా నికి తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్ర బాబు అభిమానులు, నందమూరి అభిమానులు అందరూ కృషి చేయాలని కోరారు.

భారీ ఏర్పాట్లు చేస్తున్న అభిమానులు

న్యూజెర్సిలో సెప్టెంబర్‌ 23న జరగనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశానికి ఎన్నారై తెలుగుదేశం పార్టీ అభిమానులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. న్యూజెర్సిలోని నెవార్క్‌లో జరిగే ఈ సమావేశం మూడు నుండి నాలుగు గంటలపాటు జరుగుతుందని, ఈ సమావేశానికి అమెరికా నలుమూలలా ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులతోపాటు, విదేశాంధ్రులకోసం ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎపిఎన్‌ఆర్‌టీ, ఎపి జన్మభూమితోపాటు ఎన్నారై టీడీపి నాయకులు, అభిమానులు, వలంటీర్లు, కార్యకర్తలు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమాని అయిన, తానా అధ్యక్షుడు సతీష్‌ వేమనతోపాటు, నాట్స్‌ మాజీ అధ్యక్షుడు మోహనకృష్ణ మన్నవ, ఫిలడెల్ఫియాలో ఉంటున్న రవి పొట్లూరి, అట్లాంటాలో ఉంటున్న లావు అంజయ్య చౌదరి, న్యూయార్క్‌లో ఉన్న బుచ్చిరాం ప్రసాద్‌ తదితరులతోపాటు ఎన్నారై టీడిపి కార్యకర్తలు, తెలుగుదేశం అభిమానులు, ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమానులు తదితరులు ఈ సమావేశం విజయవంతానికి కృషి చేస్తున్నారు.