అమెరికాలో మనవాళ్లే ఎక్కువ

అమెరికాలో మనవాళ్లే ఎక్కువ

18-09-2018

అమెరికాలో మనవాళ్లే ఎక్కువ

అమెరికాలో వలసదారులను నియంత్రించేందుకు ఒకవైపు అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శతవిధాల ప్రయత్నిస్తోంటే మరోవైపు విదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడుతున్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగిపోతోంది. అమెరికా జనాభా లెక్కల కేంద్రం గత వారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశ జనాభాలో 14 శాతం మంది విదేశీయులే ఉన్నారు. అంటే ప్రతి ఏడుగురు అమెరికన్లలో ఒకరు విదేశీయుడన్నమాట.

అమెరికాకు వలస వచ్చిన విదేశీయుల్లో ఎక్కువ మంది భారతీయులే. 2010-17 ఈ ఏడేళ్లలో 8.30 లక్షల మంది భారతీయులు (47 శాతం పెరుగుదల) అమెరికా వెళ్లారని సీఐఎస్‌ నివేదిక వెల్లడించింది. తర్వాత స్థానాల్లో చైనా (6.77 లక్షలు- 31 శాతం), డొమినికన్‌ రిపబ్లిక్‌ (2.83 లక్షలు -32 శాతం) ఉన్నాయి. ఈ కాలంలో నేపాల్‌ వలసదారులు 120 శాతం పెరిగారు. 2017 జులై నాటికి అమెరికాలో 1.52 లక్షల మంది నేపాలీలు ఉన్నారు. పాకిస్తాన్‌ నుంచి 4 లక్షల మంది అమెరికాకు వలస వచ్చినట్లు సీఐఎస్‌ గణాంకాలు చెబుతున్నాయి. 2010-17 మధ్య 95 లక్షల మంది కొత్త వలసదారులు అమెరికాలో సిర్థపడ్డారు. అయితే ఏటా దాదాపు 3 లక్షల మంది వలసదారులు స్వదేశం వెళ్లిపోతున్నారు. మరో 3 లక్షల మంది చనిపోతున్నారు.