ఏపీలో మెరైన్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటుకు డోయెర్ సంసిద్ధత

ఏపీలో మెరైన్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటుకు డోయెర్ సంసిద్ధత

25-09-2018

ఏపీలో మెరైన్ రీసెర్చ్ వింగ్ ఏర్పాటుకు డోయెర్ సంసిద్ధత

అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలువురు ప్రముఖులతో, సంస్థలతో సమావేశమవుతున్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి సహకరించాల్సిందిగా ఆయన కోరుతున్నారు. రెండోరోజు తన అమెరికా పర్యటనలో భాగంగా తొలుత డోయెర్‌ (డీప్‌ ఓషన్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ అండ్‌ రీసెర్చ్‌) సంస్థ ముఖ్య కార్యనిర్వాహక అధికారి లిజ్‌ టేలర్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుదీర్ఘ కోస్తాతీరం గల ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాలపై ఆమెతో  చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో సముద్ర సంబంధిత పరిశోధన-అభివద్ధి విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన 'డోయెర్‌' సంసిద్ధత వ్యక్తం చేసింది.

సముద్ర సంబంధిత సాంకేతిక పరిశోధనలపై శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులకు శిక్షణ అందించడానికి ఆరంభంలో రూ.200 కోట్లు వెచ్చించడానికి సిద్దంగా వున్నట్టు డోయెర్‌ సీఈవో లిజ్‌ టేలర్‌ ప్రకటించారు. ఏపీని సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల ముఖ్యస్థావరంగా తీర్చిదిద్దడానికి డోయెర్‌ సహకరిస్తుందని ఆమె ముఖ్యమంత్రికి హామీఇచ్చారు. తూర్పుతీరంలో వ్యూహాత్మక వాణిజ్య స్థావరంగా వున్న ఆంధ్రప్రదేశ్‌లో తమ సంస్థ వ్యాపార, పరిశోధన కార్యకలపాలను ఆరంభించడానికి సంసిద్ధంగా ఉన్నట్టు కూడా తెలిపారు. ఏపీలో 974 కిలోమీటర్ల మేర గల కోస్తాతీరంలో అపార వాణిజ్య, వ్యాపార, పరిశోధనలకు పుష్కలంగా అవకాశాలు వున్నాయని ముఖ్యమంత్రి తొలుత డోయెర్‌ సీఈవోకు వివరించారు. సముద్ర పరిశోధనా రంగంలో డోయెర్‌ అభివృద్ధి చేసిన శాస్త్ర సాంకేతికతను ఏపీకి అందించడం ద్వారా ఉభయులూ కలిసి అద్భుతాలు సృష్టించవచ్చునని అభిప్రాయపడ్డారు. దేశంలో సుదీర్ఘ తీరప్రాంతంగా వున్న ఏపీలో ప్రస్తుతం నౌకాశ్రయ అభివద్ధి కార్యకలాపాలపై దృష్టి నిలిపామని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో ఆక్వా రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం తీసుకోవడానికి వెంటనే ఒక బృందాన్ని పంపించాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు.