పెరుగుతున్న తెలుగు సంఘాలు - మారుతున్న తీరు తెన్నులు

పెరుగుతున్న తెలుగు సంఘాలు - మారుతున్న తీరు తెన్నులు

03-11-2018

పెరుగుతున్న తెలుగు సంఘాలు - మారుతున్న తీరు తెన్నులు

(చెన్నూరి వెంకట సుబ్బారావు)

అమెరికాలోని తెలుగు కమ్యూనిటీ సంఖ్య పెరిగేకొద్ది తెలుగు సంఘాల కూడా పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు దేశానికంతా కలిపి రెండు మూడు సంఘాలు ఉండేవి. ఇప్పుడు ఊర్లకి ఒక్కొక్క తెలుగు సంఘంగా పెరుగుతూ వస్తోంది. పెద్ద పట్టణాలలో అయితే 2-3 సంఘాలు కూడా వున్నాయి. కమ్యూనిటీకి సేవలందించాలంటే ఆయా చోట్ల తెలుగు సంఘాలు ఏర్పడటం మంచి పరిణామమే....

తెలుగు సంఘాల విషయానికి వస్తే కాలిఫోర్నియాలో సాన్ హోసే ప్రాంతం లో తొలుత బే ఏరియా తెలుగు అసోసియేషన్‌ (బాటా) ఒక్కటే ఉండేది. తరువాత సిలికానాంధ్ర వచ్చింది. ఇప్పుడు మరో మూడు అసోసియేషన్లు వచ్చాయి. అలాగేలాస్ ఏంజెల్స్ లో మొదట సదరన్ కాలిఫోర్నియా తెలుగు సంఘం ఉండేది... ఆ తరువాత లాస్‌ ఏంజెల్స్‌ తెలుగు అసోసియేషన్‌ (లాటా), కాలిఫోర్నియా తెలుగు సంఘం (టిఎఎస్‌సి) వంటివి వచ్చాయి. అట్లాంటాలో కూడా రెండు తెలుగు సంఘాలు కనిపిస్తాయి. మెట్రో అట్లాంటా తెలుగు సంఘం, గ్రేటర్‌ అట్లాంటా తెలుగు సంఘం ఇక్కడ ఉన్నాయి. కొలరాడోలో రెండు తెలుగు సంఘాలు కనిపిస్తాయి. కొలరాడో తెలుగు అసోసియేషన్‌, కొలరాడో స్ప్రింగ్స్‌ తెలుగు అసోసియేషన్‌ వంటివి. కనెక్టికట్‌లో రెండు తెలుగు సంఘాలు కనిపిస్తాయి. కనెక్టికట్‌ తెలుగు అసోసియేషన్‌, పశ్చిమ కనెక్టికట్‌ తెలుగు సంఘం ఉన్నాయి. ఫ్లోరిడాలో కూడా నాలుగు తెలుగు సంఘాలు పనిచేస్తున్నాయి. ఫ్లోరిడా తెలుగు సంఘం, సౌత్‌ ఫ్లోరిడా తెలుగు సంఘం, జాక్సన్‌విల్లే ఏరియా తెలుగు సంఘం, గ్రేటర్‌ ఓర్లాండో తెలుగు సంఘం ఇక్కడ ఉన్నాయి. జార్జియా రాష్ట్రంలో కూడా రెండు తెలుగు సంఘాలు మెట్రో అట్లాంటా, గ్రేటర్‌ అట్లాంటా తెలుగు సంఘం కార్యక్రమాలను నిర్వహిస్తుంటాయి. ఇల్లినాయి రాష్ట్రం లో చికాగో నగరం లో ఒక జాతీయ సంఘంతోపాటు 4 తెలుగు సంఘాలు ఉన్నాయి.

అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, గ్రేటర్‌ చికాగో తెలుగు సంఘం, చికాగో తెలుగు సంఘం, ట్రైస్టేట్‌ తెలుగు సంఘం, బ్లూమింగ్టన్‌ తెలుగు సంఘం ఇక్కడ కమ్యూనిటీకి సేవ చేస్తున్నాయి. మేరీలాండ్‌లో కూడా రెండు తెలుగు సంఘాలు క్యాపిటల్‌ ఏరియా తెలుగు సొసైటీ, వారధి తెలుగు సంఘం ఇక్కడ ఉన్నాయి. మసాచుసెట్స్‌లో కూడా రెండు తెలుగు సంఘాలు ఉన్నాయి. అందులో ఒకటి జాతీయ తెలుగు సంఘం కాగా, మరొకటి ప్రాంతీయ తెలుగు సంఘం. ఉత్తర అమెరికా తెలుగు సంఘం, గ్రేటర్‌ బోస్టన్‌ తెలుగు సంఘం. మిచిగన్‌లో కూడా మూడు తెలుగు సంఘాలు అవి డిట్రాయిట్‌ తెలుగు సంఘం, ట్రాయ్‌ తెలుగు అసోసియేషన్‌, లాన్సింగ్‌ తెలుగు అసోసియేషన్‌. న్యూజెర్సిలో కూడా జాతీయ తెలుగు సంఘంతోపాటు ప్రాంతీయ సంఘాలు పనిచేస్తున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), తెలుగు కళాసమితి (టిఫాస్‌), న్యూజెర్సి తెలుగు అసోసియేషన్‌ ఇక్కడ ఉన్నాయి. న్యూయార్క్‌లో కూడా రెండు తెలుగు సంఘాలు ఉన్నాయి. మిడ్‌హడ్సన్‌ ఏరియా తెలుగు సంఘం, అల్బనీ తెలుగు అసోసియేషన్‌, నార్త్‌ కరోలినాలో కూడా గ్రేటర్‌ ఛార్లెట్‌ ఏరియా తెలుగు సంఘం, ట్రయాంగిల్‌ ఏరియా తెలుగు అసోసియేషన్‌ ఉంది.

ఒహాయోలో మియామి వాలీ తెలుగు సంఘం, నార్త్‌ ఈస్ట్‌ ఒహాయో తెలుగు సంఘం, సెంట్రల్‌ ఒహాయో తెలుగు అసోసియేషన్‌, గ్రేటర్‌ సిన్సినాటి తెలుగు సంఘం ఉంది. పెన్సిల్వేనియాలో కూడా రెండు తెలుగు సంఘాలు హారీస్‌బర్గ్‌ తెలుగు అసోసియేషన్‌, గ్రేటర్‌ డెలావేర్‌ వ్యాలీ తెలుగు సంఘం ఉంది. సౌత్‌ కరోలినాలో తెలుగు సంఘాలు ఒకటికిపైగానే ఉన్నాయి. సౌత్‌ కరోలినా తెలుగు అసోసియేషన్‌, గ్రేటర్‌ గ్రీన్‌విల్లే తెలుగు సంఘం, టెన్నెస్సీలో టెన్నెస్సీ ఆంధ్రాసమితి, మెంఫిస్‌ తెలుగు సంఘం ఉంది. టెక్సాస్‌లో ఉత్తర టాంటెక్స్‌ తెలుగుసంఘం, శాన్‌ఆంటోనియో తెలుగు సంఘం, అస్టిన్‌ తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌, హ్యూస్టన్‌ తెలుగు కల్చరల్‌ అసోసియేషన్‌ ఉంది. వర్జీనియాలో గ్రేటర్‌ రిచ్‌మండ్‌ తెలుగు అసోసియేషన్‌, సెంట్రల్‌ వర్జీనియా తెలుగు సంఘం, గ్రేటర్‌ వాషింగ్టన్‌ తెలుగు సంఘం ఉంది. విస్‌కాన్సిన్‌లో ఆంధ్ర సమాజం ఆఫ్‌ గ్రేటర్‌ మిల్‌వాకీ, మాడిసన్‌ ఏరియా తెలుగు సంఘం గ్రేటర్‌ మిల్‌వాకీ తెలుగు అసోసియేషన్‌ ఉంది. ఇవే కాకుండా ఇంకొన్ని సంఘాలు కూడా ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అన్నీ నగరాల్లోనూ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ సంఘాలు పుట్టుకొచ్చాయి. ఆంధ్రవారి కోసం అంటూ సంఘాలు కూడా వస్తున్నాయి. ఇలా వస్తున్న తెలుగుసంఘాల వల్ల కమ్యూనిటీకి లాభమేనని చెప్పవచ్చు. అమెరికన్‌ తెలంగాణ అసోసియేషన్‌, తెలంగాణ అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌, తెలంగాణ డెవలప్‌మెంట్‌ ఫోరం, ఛార్లెట్‌ తెలంగాణ అసోసియేషన్‌, తెలంగాణ ఎన్నారై అసోసియేషన్‌, చికాగో తెలంగాణ అసోసియేషన్‌, ట్రయాంగిల్‌ తెలంగాణ అసోసియేషన్‌, డల్లాస్‌ ఏరియా తెలంగాణ అసోసియేషన్‌, వాషింగ్టన్‌ తెలంగాణ అసోసియేషన్‌, తెలంగాణ అసోసియేషన్‌ ఆఫ్‌ గ్రేటర్‌ హ్యూస్టన్‌, ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్‌, తెలంగాణ పీపుల్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ డల్లాస్‌, శాక్రమెంటో తెలంగాణ అసోసియేషన్‌, కన్సాస్‌ సిటీ తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌, గ్రేటర్‌ అట్లాంటా తెలంగాణ సొసైటీ వంటివి ఏర్పడ్డాయి.

ఆంధ్రవాళ్ళ కోసమంటూ ఆల్బనీ ఆంధ్ర తెలుగు అసోసియేషన్‌ ఏర్పడింది. అన్నీ రాష్ట్రాల్లో తెలుగు సంఘాలు కొత్తగా రావడం, ఎక్కువగా ఉండటం కమ్యూనిటీకి మంచిదే. దీనివల్ల కమ్యూనిటీకి విస్తృతంగా ప్రయోజనం లభిస్తుంది. సేవా కార్యక్రమాలు అందరికీ అందుతాయి. కళల ప్రదర్శనకు, ప్రతిభను చాటేందుకు ఎంతోమందికి అవకాశం లభిస్తుంది. తెలుగు సంఘాలు ఎక్కువగా రావడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి.

 

ఎంపిక నుంచి ఎన్నిక వరకు...

గతంలో తెలుగు సంఘాల కార్యవర్గాన్ని ఎంపిక ద్వారా భర్తీ చేసేవారు. సంఘంలోని పెద్దలు నాయకత్వ బాధ్యతను బాగా చేయగలరన్న నమ్మకంతో కొంతమందికి అధ్యక్ష బాధ్యతలను అప్పగించేవారు. వూరికి లేదా పట్టణానికి వున్నా ఒకరిద్దరు పెద్ద మనుషులు తమ సలహాలు, సూచనలు ఇస్తూ కొత్త నాయకుల ఎంపిక సజావుగా జరిగేలా చూసేవారు. కాని మారిన పరిస్థితులు యువతరం అన్నీచోట్లా ముందుండటంతో నాయకత్వ బాధ్యతలను కూడా యువతరానికి అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికి తోడు ఈ పదవిని నిర్వహించేందుకు ఎంతోమంది పోటీ పడుతుండటంతో ఎన్నికలు అనివార్యమవుతోంది. కాని ఈ ఎన్నికలు మినీ అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా తయారవుతోంది. ఎన్నికల్లో పోటీకి నిలబడుతున్నవారు ఓ ప్యానల్‌గా తయారవుతున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న తలంపుతో అనేక మార్గాలకు వారు దిగుతున్నారు. తమకు మద్దతుగా ఓట్లను సాధించాలంటే సంఘంలో తమ వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉండాలి. దాంతో చాలామంది ఎన్నికల్లో పోటీ చేసేవారు తమకు తెలిసినవారిని, తమవాళ్ళను అప్పటికప్పుడు సంఘంలో సభ్యులుగా చేర్పించుతూ వుంటారు. దీనికోసం వారు తమ సొంత డబ్బును ఖర్చు పెట్టివారికి సభ్యత్వాన్ని ఇప్పిస్తున్నారని కూడా తెలుస్తోంది. ఎన్నికల సమయంలోనే చాలామందికి సంఘం సభ్యత్వాల విషయం గుర్తుకు వస్తుంటుంది. ఎన్నికల తరువాత కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న తలంపు వారికి ఉండదు. తెలుగు సంఘం లోని సభ్యులను చేర్చుకొని కార్యక్రమం మంచిదే కానీ ఎన్నికల ముందు చెయ్యటం ఎంత వరకు సమంజసం అని పెద్దలు భాద పడుతున్నారు.

అలాగే ఎన్నికల సమయంలో ప్రచారానికి కూడా వారు ఎన్నో మార్గాలను ఎంచుకుంటారు. అందులో ఒకటి తమకు సానుకూలమైన ప్రచారం, రెండోది ప్రత్యర్థిగా ఉన్నవారిపై ఆరోపణల దుష్ప్రచారం. ఈ రెండింటిని వారు సామాజికమాధ్యమాల ద్వారా విపరీతంగా చేస్తుంటారు. ఇ-మెయిల్‌ ప్రచారం, ఫేస్‌బుక్‌ మీడియా ప్రచారం, వాట్సప్‌ ప్రచారంతోపాటు వ్యక్తిగతంగా, ఫోన్‌ల ద్వారా కూడా ప్రచారాన్ని చేస్తుంటారు. ఈ ప్రచారాలన్నీ పరిశీలిస్తే రాష్ట్రంలో జరిగే అసెంబ్లీ ప్రచారమే గుర్తుకు వస్తుంటుంది. మరికొంతమంది ఎన్నికల్లో ఉన్నవారు సభ్యులను ప్రలోభపెట్టేందుకు వెనుకాడరు. వారికి అవసరమైనది కొని ఇవ్వడం, లేదా వారికి కావాల్సినవి ఏర్పాటు చేయడం వంటివి చేస్తారు. ఇలా ఎంతో కష్టపడి, ధనవ్యయ ప్రయాసలతో గెలుపొందేందుకు ప్రయత్నిస్తుంటారు. సంఘం పదవులకు ఇంత పోటీయా అని అనుకుంటే ప్రస్తుతం చాలాచోట్ల ఇలాగే జరుగుతోంది.

గెలిచిన తరువాత...

ఎన్నికలు జరపటం ప్రజాస్వామ్యం లో భాగమే అనుకొందాం. ఎన్నికల్లో గెలిచిన తరువాత కొంతమంది హుందాగా ప్రవరిస్తుంటారు. మరికొంతమంది తమ ఇష్టప్రకారం నడుచుకుని తమకు ఇష్టం లేనివారిపై, మాజీ నాయకులపై అమర్యాదకరంగా ప్రవర్తించి వారు సంఘం కార్యకలాపాలకు దూరంగా ఉండేలా చేస్తారు. ఎన్నికలలో ఓడిన అధ్యక్షుడు లేదా అధ్యక్షుని టీం కూడా ఆ సంఘం లో మెంబర్లే కదా.. వారిని దూరంగా పెట్టి అవమాన పరిస్తే వారు కూడా బయటకు వెళ్లి పోతారు. అంటే సంఘం కొందరు నాయకులను కోల్పోతుంది అన్న మాట. ఇలాంటివి కొన్నిచోట్ల జరిగింది. ఇది మంచిది కాదు. ఎందుకంటే సంఘం ఎదగాలంటే ఎంతోమంది కృషి అవసరం. అందరూ కృషి చేస్తేనే కానీ సంఘం పటిష్టంగా తయారవదు. లేకుంటే 2, 3 సంవత్సరాల్లో నిధులు, సభ్యులు లేక నీరసపడిపోతుంది. సంఘం నేడు పటిష్టంగా ఉండేందుకు నాటి నుంచి నేటి వరకు నాయకులు, ఇతరులు చేసిన కృషిని కొత్తగా వచ్చిన నాయకులు మరచిపోరాదు. వారికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి, సంఘం కార్యకలాపాల్లో వారి సలహాలను కూడా తీసుకుంటే మరింత బలంగా కొత్త నాయకులు ఎదగడంతోపాటు సంఘం కూడా బలపడుతుంది. అల్లాగే కొన్ని చోట్ల దిగిపోయిన అధ్యక్షడు లేదా అధ్యక్షురాలు ని కొత్తగా ఎన్నికయినా వారు సరిగ్గా గౌరవం ఇవ్వకుండా వారు బయటకు వెళ్లే పరిస్థితి కలగా చేస్తూన్నారు. ఇది కూడా సంఘానికి నష్టమే కదా!

ఇక కమ్యూనిటీ ఎలా ఉంటోంది?

అసలు సంఘం ఏర్పడినదే కమ్యూనిటీ కోసం. కమ్యూనిటీకి కావాల్సిన వేడుకలను జరుపుకోవడానికి వేదికగా ఉండేందుకే సంఘాలను మనవాళ్ళు అప్పుట్లో ఏర్పాటు చేశారు. దాంతోపాటు సంఘాల ముఖ్య ఉద్దేశ్యాలను కూడా వారు తెలియజేశారు. కమ్యూనిటీకి సేవ చేయడం, తెలుగు భాష, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయాన్ని కాపాడటం. ఈ ఉద్దేశ్యాలతో ఏర్పడిన ఈ తెలుగు సంఘాలు కమ్యూనిటీకి సేవ చేస్తున్నా, కమ్యూనిటీ నుంచి రావాల్సిన సహకారం లేకపోవడంతా కష్టాలపాలవుతోంది. సంక్రాంతి, ఉగాది, దీపావళి వేడుకలను ప్రతి సంఘం వైభవంగా జరుపుకుంటుంది. దేశం కాని దేశంలో ఉన్న మనవాళ్ళందరినీ ఒకేచోట చేర్చి, సంప్రదాయాన్ని తెలియజేసే విధంగా పండుగలను సంఘం నాయకులు నిర్వహిస్తుంటారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంలో ఎంత కష్టమో నాయకులకు, సంఘంలో పనిచేసిన వాళ్లకు బాగా తెలుసు.

ఈ కార్యక్రమాలకు వచ్చేవాళ్ళు కొంత సహకారాన్ని అందిస్తే నిర్వహణ భారం కొంత తగ్గుతుంది. కాని కార్యక్రమానికి వచ్చేవారు ఇదేదో వాళ్ళకోసమో నిర్వహిస్తున్నట్లుగా భావించి తమకు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి ఎంజాయ్‌ చేసి వెళ్ళిపోతుంటారు. తమ కోసం ఏర్పడిన సంఘం కష్టనష్టాలపాలైతే సేవా కార్యక్రమాలపై ఆ ప్రభావం ఉంటుందన్న ఉద్దేశ్యం కూడా కమ్యూనిటీలో కనిపించదు. దేశం కాని దేశంలో ఏదైనా ఆపద ఎదురైతే ఆదుకునే సంఘాలను మనం నిర్లక్ష్యం చేస్తే మనకే నష్టమన్న సంగతి వాళ్ళు గ్రహించడం లేదు. సాధారణంగా సంఘం నాయకులు వేడుకల నిర్వహణ కోసం కొంత తమ డబ్బును కూడా ఖర్చుపెడుతుంటారు. ఏదో ఆశించే ఆ నాయకుడు ఈ వేడుకలను సొంత డబ్బులను ఖర్చుపెట్టి ఘనంగా నిర్వహిస్తున్నారని కొందరు చెప్పడం దురదృష్టకరం. అవివేకంతో వారు చెప్పేమాటలు ఇవి. ఎవరైనా తమఇంటి కార్యక్రమాలకు సొంత డబ్బులను ఖర్చుపెడుతారు. కానీ, దీనివల్ల పేరు ప్రతిష్టలు పెరిగి, పదవులు కిరీటాలు వస్తాయని ఆశించి చేయరు. కమ్యూనిటీలో కొందరు చెప్పే ఇలాంటి మాటల వల్ల కమ్యూనిటీకి నష్టం కలుగుతోంది. ఇప్పటికైనా కమ్యూనిటీ మారాలి. ఏదైనా కార్యక్రమం జరిగితే అందరూ అందులో పాల్గొనాలి. సహకారమందించాలి. అవసరమైతే విరాళాల సేకరణకు తోడ్పడాలి. అప్పుడే సంఘం బాగా బలపడి మరిన్ని కార్యక్రమాలను చేస్తుంది. విరాళాలు ఇవ్వకపోయినా, కనీసం టికెట్ కొని సంఘానికి చేయూతనివ్వాలి. మంచి సాంస్కృతిక కార్యక్రమం ఉంటే ఫ్రీ డిన్నర్ వున్నా, లేక పోయినా వెళ్ళాలి అన్న ఆలోచన అందరికి రావాలి.

అమెరికా అంటే నే క్రమశిక్షణ అని అందరికి తెలుసు. అ కమ్యూనిటీ కూడా బ్యాంకు కు వెళ్లినా, షాపింగ్ మాల్ కి వెళ్ళిననా ఎంత క్రమ శిక్షణ తో జరిగే వేడుకలలో కూడా అదే క్రమశిక్షణ తో వుంటారు.

కాని మన కమ్యూనిటీ మాత్రం అమెరికాలోనే ఉన్నా క్రమశిక్షణకు, క్లీనింగ్‌కు ఆమడదూరం అని మరీ నిరూపించుకుంటున్నారు. తెలుగు సంఘాలు వేడుకలు నిర్వహించే ప్రాంతం ప్రారంభానికి ముందు ఎలా మెరిసిపోతుందో, వేడుకల తరువాత చూస్తే ఆ ప్రాంతం అపరిశుభ్రతతో కనిపిస్తుంటుంది. నిర్వాహకులే ఈ ప్రాంతం క్లీనింగ్‌ మరికొంత ఖర్చు పెట్టి క్లీనింగ్‌ చేయించుకోవాల్సి వచ్చేది. సంఘం వేడుకలు మనకోసమే, సంఘం మనదే అన్న భావన మాత్రం కమ్యూనిటీలో కలగడం లేదు. ఎవరికోసమో వాళ్ళు వేడుకలు జరుపుతున్నారనే భావన...పేరుకోసమే ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారని మరికొంతమంది వ్యంగ్యంగా మాట్లాడుతూ సంఘం నాయకులపై చులకనభావాన్ని ప్రదర్శిస్తుంటారు.

తెలుగు భాష, సంస్కృతి కోసం తెలుగు సంఘాలలో పెరుగుతున్న ధోరణి అందరి దృష్టికి తేవాలని మాత్రమే ఈ ఆర్టికల్‌ ఉదేశ్యం ..అంతే కానీ ఎవరిని కించ పరచాలని గాని, అగౌరవ పరచాలని మా ఉద్దేశ్యం కాదు. దయచేసి అందరు ఈ వ్యాసాన్ని సరి అయిన కోణం లో అర్ధం చేసుకొని తెలుగు కమ్యూనిటీ మరింత ముందుకు వెళ్లేందుకు తయారు కావాలని మా ప్రార్ధన.

అమెరికాలో తెలుగు వారి సంఖ్య, తెలుగు భాష ఉనికి బాగా పెరిగిందని అమెరికా సంస్థలే చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఉన్న తెలుగు సంఘాలు మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాలన్న ఉద్దేశ్యంతో ఈ ఆర్టికల్‌ను రాయడం జరిగింది. ఇటీవలి కాలంలో తెలుగు సంఘాల్లో చోటు చేసుకున్న పరిణామాలను పరిశీలించినప్పుడు ఇలాంటివి జరగకుండా ఉంటే బావుంటుందన్న ఉద్దేశ్యంతో కూడా ఈ ఆర్టికల్‌ను రాయడం జరిగింది. ఎందుకంటే తెలుగుటైమ్స్‌ మీది.. మీలో ఒకటి.