రికార్డులకెక్కిన 'తానా' నృత్య ప్రదర్శనలు

రికార్డులకెక్కిన 'తానా' నృత్య ప్రదర్శనలు

09-11-2018

రికార్డులకెక్కిన 'తానా' నృత్య ప్రదర్శనలు

ఓహియోలో బాస్కెట్‌బాల్‌ క్రీడ ప్రారంభ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా భరతనాట్యం, కూచిపూడి నృత్య ప్రదర్శనలు నిర్వహించి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చరిత్ర సృష్టించింది. ఇండియన్‌ హెరిటేజ్‌ నైట్‌ పేరుతో నిర్వహించిన ఈ ప్రదర్శనలు బాస్కెట్‌బాల్‌ చరిత్రలో తొలిసారి కావడం విశేషం. క్విక్కెన్‌లోన్‌ ఎరీనా మైదానంలో క్లీవ్‌ల్యాండ్‌ క్యావలియర్స్‌, డెన్వర్‌ నగ్గెట్స్‌ జట్ల మధ్య జరిగిన పోటీల సందర్భంగా వీటిని నిర్వహించారు. తొలుత అమెరికా జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులు అనంతరం నృత్యాలు ప్రదర్శించారు. మొత్తం 20 వేల మంది తిలకించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు సతీశ్‌ వేమన మాట్లాడుతూ భారతీయ సంస్కృతిని పెంపొందించడంలో తానా మరోసారి రికార్డు సాధించిందన్నారు. ఉపాధ్యక్షుడు తాళ్లూరి జయశేఖర్‌ మాట్లాడుతూ అమెరికాలోని మరిన్ని రాష్ట్రాల్లో కార్యక్రమాన్ని నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. తానాతో పాటు నార్త్‌ ఈస్ట్‌ ఒహియో తెలుగు సంఘం కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యమైనట్లు వివరించారు. యువతను ప్రోత్సహించడంలో తానా ముందుందని నేషనల్‌ బాస్కెట్‌ బాల్‌ అసోసియేషన్‌ ప్రశంసించింది. కార్యక్రమ నిర్వహణలో జాయింట్‌ ట్రెజరర్‌ కొల్లా అశోక్‌ కీలక పాత్ర వహించారు.