ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ

ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ

20-03-2019

ఏప్రిల్ 1 నుంచి హెచ్ 1బీ వీసాల దరఖాస్తుల స్వీకరణ

2020 ఆర్థిక సంవత్సరానికి కొత్త హెచ్‌-1బీ వీసా దరఖాస్తుల్ని ఏప్రిల్‌ 1 నుంచి స్వీకరించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలసల సేవల సంస్థ యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. ఈ వీసాలు పొందిన వారి ఉద్యోగ జీవితకాలం అక్టోబర్‌ 1న ప్రారంభమవుతుందని అమెరికా బజార్‌ అనే దినపత్రిక తెలిపింది. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా హెచ్‌-1బీ వీసాల సంఖ్యను 65 వేలకు పరిమితం చేశారు. అమెరికా వర్సిటీల్లో మాస్టర్స్‌ లేదా ఇతర ఉన్నత పట్టాలు పొందిన వారికి మరో 20 వేలు అదనంగా ఈ తరహా వీసాలు జారీ కానున్నాయి. ఈ ఏడాది తొలినాళ్లలో వీసా మంజూరు నిబంధనలు మారిన నేపథ్యంలో ధ్రువపత్రాల పరిశీలన, ఇతర నిబంధనలు కఠినంగా అమలవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీసాలు పొందే అడ్వాన్స్‌డ్‌ డిగ్రీ అభ్యర్థుల సంఖ్య 16 శాతం పెరుగుతుందని యూఎస్‌సీఐఎస్‌ అంచనా వేస్తోంది.