విశ్వాస నమ్మకాల సమ్మిళితమే మనజీవితం

విశ్వాస నమ్మకాల సమ్మిళితమే మనజీవితం

18-05-2019

విశ్వాస నమ్మకాల సమ్మిళితమే మనజీవితం

ఒక వ్యక్తి ఒక రోజు నిద్రలో కలకంటాడు. ఆ కలలో అతను సముద్రపువొడ్డులో ఇసుకమీద తన ఇష్టమైన దేవుడితో వాకింగ్ చేస్తూవుంటాడు. అతనికి జీవితంలో జరిగిన సంఘటనలు  ఎన్నో ఆకాశంలో మెరుపుల్లా గుర్తుకువస్తాయి. ప్రతి సంఘటనా ఇసుకమీద దేవుడు, తను నడిచిన కాలిముద్రల్లాగా కనిపిస్తాయి, కొన్నిచోట్ల ఒక జత కాలిముద్రలుంటే మరికొన్ని చోట్ల రెండుజతల కాలిముద్రలు గుర్తిస్తాడు.  జీవితంలో కష్టాలొచ్చిన సంఘటనల్లో ఒక జత కాలిముద్ర, మిగతా సమయాల్లో రెండుజతల కాలిముద్రలు  చూసి కలతచెంది దేవుడ్ని అడుగుతాడు 'అన్నివేళలా నువ్వు నా వెంట ఉంటానని అభయం ఇచ్చావు, నేను నిన్ను అనుసరించాను. కానీ నేను కష్టసమయాలలో వున్నపుడు ఒక జత కాలిముద్రలే వున్నాయి. నాకు అవసరమైనప్పుడు నువ్వునాతో లేవు’ అని వాపోతాడు. దానికి దేవుడు నువ్వు కష్టాల్లో వున్నపుడు నేను నీతోనే వుండి నిన్ను  నా చేతుల్లో ఎత్తుకొని నడిచాను  ఆ  కాలిముద్రలు నావే అని అంటాడు. 

దీనివలన తెలిసేదేంటంటే మనకు దేవుడిమీద విశ్వాసంవుంటే దేవుడు అన్నివేళలా, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, ఆనందంలోనూ, బాధలోనూ మనతో మనవెన్నంటే ఉంటాడు అని. 

కొంతమంది దేవుడిపై విశ్వాసం ఉండాలి అని అంటే మరికొందరు నమ్మకం ఉండాలి అని అంటారు. అసలు మనకు దేవుడిపై ఉండేది విశ్వాసమా? లేక నమ్మకమా ? మనలో చాలామంది విశ్వాసం, నమ్మకం అనేమాటలను తేడాలేకుండా వాడుతూ వుంటారు. కొంతమంది దేవుడిపై విశ్వాసం వుంది అని అంటే మరికొంతమంది దేవుడిపై నమ్మకం వుంది అంటుంటారు. వీటిని విశ్లేషించి అసలు తేడా ఏంటో చూద్దాం.

విశ్వాసం అనేది హృదయంలో జరిగే ఒక స్పందన అయితే, నమ్మకం అనేది మనస్సులో జరిగే ఒక భావన.  మన పంచేద్రియాలు సృంజించలేని స్పందనే విశ్వాసం, ఇది ఒక అనుభూతితో ఏర్పడుతుంది అంతేకాని నెమ్మదిగా నేర్చుకుంటే నేర్చుకునేది కాదు.  ఈ అనుభూతి కొంతమందికి జీవితకాలంలో కూడా రాదు. విశ్వాసం అనేది క్షణికంలో జరిగే అనుభూతి, ఆ అనుభూతే విశ్వాసంగా పరివర్తన చెందుతుంది.. మనకున్న అనుభవాలు విశ్వాసాన్ని బలపరుస్తాయి కానీ, విశ్వాసం కలుగచేయలేవు. అనుభూతి హృదయంలో ఏర్పడేది కాబట్టి దానికి రుజువులతో పనిలేదు.

ఇకపోతే  నమ్మకం మన మనస్సుతో ముడిపడి ఉంటుంది కాబట్టి అది తొందరగా తృప్తి చెందదు. మనకు జరిగే అనుభవాలను బట్టి నమ్మకం పెరగడం లేక తగ్గడం జరుగుతూ ఉంటుంది.  అది నిత్యం అనుమానం అనే తెరతో తొంగి చూస్తూవుంటుంది. నమ్మకమనేది సమయానుకూలంగా, సందర్భానుకూలంగా, కాలంతోటి మారుతూ ఉంటుంది. అది నిరంతరం పరీక్షకు గురవుతూ ఉంటుంది.

మనిషి మేధాశక్తికి, సైన్స్ కి అందనిదే విశ్వాసం. మనకు మనం నమ్ముకున్న పరమాత్మలో ఉన్న విశ్వాసం మనం చేయలేని పనిని చేయిస్తుంది, మనం చూడలేని దానిని చూపిస్తుంది. ఆ విశ్వాసమే కాలగమనంలో దాని ఫలితాలు చూపిస్తుంది.

రామాయణంలో ఒకసారి హనుమంతుడు రాముడితో 'మీ కంటే శక్తివంతమైనది ఇంకొకటి వుంది' అంటాడు. శ్రీ రామచంద్రుడు అది ఏమిటని ఆడిగితే దానికి హనుమంతుడు మీకంటే మీనామం శక్తివంతమైంది, మీరు నదిని దాటడానికి పడవను వాడారు, కానీ నేను సముద్రాన్ని మీనామశక్తితో దాటాను. కాబట్టి మీకంటే మీపేరే శక్తివంతమైంది అని అంటాడు. అదే విధంగా ప్రహ్లాదుడు సర్వాంతర్యామి అయిన విష్ణుమూర్తిని భక్తితో తనతండ్రి హిరణ్యకశిపుడికి ఒక స్తంభంలో చూపిస్తాడు.

ఇక్కడ దేవుడు ఎంత శక్తివంతుడో  కాకుండా  మనవిశ్వాసం దేవునిమీద  ఎంత గట్టిదో మనం విశ్లేషించు కోగలగాలి. దీని ఆంతర్యం తెలుసుకోవాలంటే మనకు శివపురాణంలో శివుడు గణాధిపత్యం  ఇవ్వడానికి వినాయకుడిని, సుబ్రమణ్యస్వామిని మూడు లోకాల్లో ఉన్న పుణ్యనదుల్లో ఎవరు స్నానం చేసి ముందుగా వస్తే వారికి ఇస్తానంటాడు. అప్పుడు సుబ్రమణ్యస్వామి మూడు లోకాల్లోని నదులకు వెళ్తే, వినాయకుడు శివునిమీద విశ్వాసంతో ఆదిదంపతులైన శివపార్వతుల చుట్టూప్రదక్షణలు చేసి గణాధిపత్యం పొందుతాడు. అదేవిధంగా నిండుకొలువులో  దుశ్శాసనుని బారి నుండి శ్రీకృష్ణుని మీద ఉన్న విశ్వాసంతో  ద్రౌపది మానభంగం నుండి బయటపడుతుంది. కురుక్షేత్రయుద్ధంలో అర్జునిడికి కృష్ణునిపై ఉన్న విశ్వాసం, కృష్ణుడు తనతో ఉంటే చాలు విజయం తమదే అని విశ్వసించాడు.  

కాకపోతే మనం దేవుని సామర్ధ్యాన్ని లెక్కకట్టాలని చూస్తాం, అందుకే ఒకడు మా దేవుడు ఇంత గొప్ప అంటే మరొకడు మాదేవుడు ఇంకాగొప్ప అనటం సర్వసామాన్యంగా వింటూవుంటాం. ఇంకా కొంతమంది విమర్సిస్తూవుంటారు. అసలు దేవుని శక్తిసామర్ధ్యాలు తెలుసుకోవడం  మానవునికి సాధ్యపడే విషయమా? మనలో చాలామంది మనకు దేవునిపైన ఉన్ననమ్మకాన్ని రుజువుచేసుకోవడానికి దేవునికి పరీక్షలు పెడుతూ వుంటారు.  నిత్యమూ చూస్తూ ఉంటాము దైనందిక జీవితంలో చాలామంది    ఫలానా పరీక్ష పాసయితే తలనీలాలు ఇస్తాము అని, ఫలానా కాలేజీలో సీట్ వస్తే 100 కొబ్బరికాయలు కొడతాము అని, విదేశాలకు వీసా వస్తే 108 ప్రదక్షిణాలు చేస్తాము అని, ఇలా మనకు నిత్యమూ వచ్చే సవాళ్లకు మనకు తెలియకుండానే దేవునికి ప్రతిదీ ముడిపెట్టి పరిక్షిస్తాము.  ఇక వ్యాపారవేత్తలు, రాజకీయవేత్తలు దేవునితో భాగస్వామ్యానికి గూడా దిగి పరీక్షిస్తూవుంటారు.

కొంతమంది దేవునిపై విశ్వాసంతో దేవుడే అన్నీచూసుకుంటాడు, మనకి విశ్వాసం ఉంటేచాలు అని అనుకుంటారు. కానీ దేవునిలీలలు అర్ధం చేసుకొనే విజ్ఞత కూడా ఉండాలి. దేవునిపై విశ్వాసంతో పాటు విజ్ఞత తోడు కాకపోతే ఏమవుతుందో ఈ కథలో చుడండి. ఒక ఊరిలో ఒక గుడి ఉండేది. ఆ గుడిలో ఒక పూజారి పూర్తివిశ్వాసంతో భక్తిశ్రద్దలతో అర్చకత్వం చేసుకొంటూ  జీవిస్తూవుంటాడు. ఒక సంవత్సరం  ఆ  గ్రామానికి పెనుతుఫానుతో పాటు వరదలు గూడా వస్తాయి. గ్రామం అంతా చిందరవందర అయి మొదట్లో మోక్కాళ్లదాకా వరదనీరు వస్తుంది. గ్రామప్రజలు కొందరు భయభ్రాంతులై గ్రామాన్ని వదలి సురక్షిత ప్రాంతానికి వెళ్తూ పూజారి ని గూడా తమతో రమ్మంటారు. దానికి పూజారి నేను అన్నివేళలా దైవకైంకర్యాలు చేస్తూ గడుపుతున్నాను, నన్ను ఆ దేవుడే రక్షిస్తాడు అని వాళ్లతో వెళ్ళడు. మరికొంతసమయానికి వరద ఉదృతి పెరిగి మనిషి మునిగేనంత వరకు వస్తుంది. అప్పుడు పూజారి కొంత ఎత్తైన ప్రదేశంలో నిలబడివుంటాడు. అప్పుడు ఆర్మీ వాళ్లు పడవలో మిగిలిన గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తూ పూజారిని చూసి ఆయనను గూడా రమ్మంటారు. తిరిగి పూజారి నాకు ఏమీకాదు నన్ను దేవుడే రక్షిస్తాడు అని అంటాడు. ఇంకొంతసేపటికి వరదనీరు ఇంకాపెరిగి గుడిగోపురం అంత ఎత్తుకి వస్తాయి. ఆర్మీ వారు హెలీకాఫ్టర్లో వచ్చి పూజారి ని సురక్షితప్రాంతానికి తీసుకువెళతాం రమ్మంటారు. అందుకు గుడిగోపురం మీద కూర్చున్న పూజారి నేనువిశ్వసించిన ఆ భగవంతుడే నన్ను రక్షించుకుంటాడు, మీఅవసరం లేదు అని పంపివేస్తాడు. ఇంకాసేపటికి వరదవుధృతం పెరిగి పూజారి నీట మునిగి ప్రాణాలు వదులుతాడు.  ఈ కథలో పూజారిగారు దేవుని పూర్తిగా విశ్వసించినా చివరకు నీటమునిగి చనిపోయాడు, దేవుడు రక్షించలేదా అంటే, మూడు సార్లు రక్షించాలని చూచినా దానిని పూజారిగారు గుర్తించలేకపోతాడు. దేవుడే  స్వయంగా వచ్చి  రక్షిస్తాడు అని తనను రక్షించడానికి  పంపిన  గ్రామప్రజలను, పడవలో వచ్చిన ఆర్మీ వారిని, హెలీకాఫ్టర్లో వచ్చిన ఆర్మీ వారినిమూడు సార్లు  గుర్తించక తిరస్కరిస్తాడు. దీనివలన మనకు తెలిసేదేమిటంటే విశ్వాసంతో పాటు విఙ్ఞతగూడా సమ్మిళతమై ఉండాలి.

పురాణాల్లో  నమ్ముకున్న దైవం  అనేక సందర్భాల్లో ప్రత్యక్షించి భక్తులను, నమ్మినవారిని, శరణుకోరినవారిని ఆదుకున్నా అవి పురాణాలవరకే పరిమితమయ్యాయి. పూర్తి విశ్వాసం, అనుభూతి, హృదయస్పందన ఇవి అన్నీ మనకి పురాణాలకే పరిమితమైనట్లుగా అనిపిస్తుంది. వాటిని మనం పారదర్శకంగా తీసుకోని మన జీవితాలను మలచుకోవాలి కాని, అలాగే జరగాలి  అని అనుకోకూడదు.   ప్రస్తుతం మన జీవితాలు,  పైన ఉదహరించిన కథలో  పూజారికి జరిగినట్లుగా  పరోక్షంగా దేవుడు  రక్షించాలని వేర్వేరు విధాలుగా చూచినా అది మనం గ్రహించే స్థితిలో వుండం. దీనికి కారణం మన మనసే అన్నిటిని నిర్దారిస్తుంది. మనస్సుకి నిశ్చలపరిస్థితి ఉండదు. ఎప్పుడూ చంచలంగానే ఉంటుంది. ఏదైనా ఒక సంఘటనతో మనం ఒక నిశ్చలమైననిర్ణయానికి వచ్చినా, మన మనస్సు నిత్యమూ సంఘర్షణకు లోనై ఆ నిర్ణయానికి మార్పులు, చేర్పులు చేస్తూవుంటుంది. మనస్సు దేనిని త్వరగా ఒప్పుకోదు. ఇతరుల అభిప్రాయాలుకూడా మన నిర్ణయంమీద ఎక్కువగా  ఒత్తిడిని తెస్తాయి. ఎవరైనా ఏదైనా మనకు అనుకూలంగా చెప్తే, ఆలా జరగడానికి ఆవకాశంలేకపోయినా వెంటనే మన అభిప్రాయాన్ని మార్చేసుకొంటాము.  

ఎవరైనా మనతో ఫలానా గుడికివెళ్తే లేక ఫలానా స్వామీజీని కలిస్తే మన సమస్యలు సమసిపోతాయి అంటే మనం వెంటనే ఆ పని చేయాలనుకొంటాము కానీ మనం ఆ సమస్యపరిష్కారానికి మనవంతు కృషిచేయం. మనకు కష్టపడకుండా సమస్యా పరిష్కారం కావాలి. పైగా పదిమందికి చెప్పుకుంటాం అన్నిసమస్యలు మాకే వస్తాయి అని. మనం చేసే పనులలో దేవుడు మనవెంట ఉంటాడు కానీ మనం ఏమి చేయకుండా, కష్టపడకుండా ఉంటే దేవుడు మనకు ఏమి చేయడు. మనం కష్టాల్లో వున్నపుడు దేవుడు మనవెనుక వుండి, మనల్ని ముందుకు నడిపిస్తాడు. ఏమీ కష్టపడకుండా  నేను ఫలానా దేవుడ్ని నమ్మాను కాబట్టి నాకు ఆపని అయిపోతుంది అని సామాన్యంగా అందరూ అంటుంటారు.  మరికొంతమంది దేవుడ్ని పూజించడం, లేదా దేవాలయానికి వెళ్లడం కేవలం దేవుడు వాళ్ళ కోరికలు తీర్చడానికే అనుకొంటారు.  వారు దేవాలయాలకి వెళ్లడమే పెద్దకోరికల జాబితాతో వెళ్తారు.  కొంతమంది వారికోరికలే కాక తోటివారివికూడా సిఫారసు చేస్తూవుంటారు. ఇలా కొంతమంది అయితే, మరికొంతమంది ఎవరినైనా లేదా దేవుడిని సంతృప్తి పరచడానికి  లేదా ఆనంద పరచడానికి దేవాలయాలకి వెళ్తూవుంటారు, అక్కడ కైంకర్యాలు, పూజా కార్యక్రమాలు చేస్తూవుంటారు. దేవాలయాల్లో కూడా వాళ్ళని గుర్తిస్తున్నారా అన్నదానిమీదే ధ్యాస పెడతారుగాని దేవునిమీద పెట్టేది మొక్కుబడిగా ఉంటుంది.

ఈ ఆధునిక జీవనవిధానంలో క్షణక్షణం మారిపోతున్న యాంత్రిక  జీవనశైలిలో విశ్వాసం, నమ్మకం వీటి గురించి ఆలోచించే వ్యవధి గాని ఆసక్తి గాని నేటి యువతకు లేదనే చెప్పాలి. కొంతమంది యువత  తల్లితండ్రులు లేదా పెద్దల మాటకాదనలేక లేదా ఏదైనా జరుగుతుందేమో అనే భయంతో కొంతమటుకు మన సంప్రదాయాలు, ఆచారాలను  గౌరవిస్తున్నారు. ఈయాంత్రిక జీవనంలో ఒకవేళ ఏదైనా చికాకులతో ప్రశాంతతకై గుడికి వెళ్తే, ప్రస్తుత గుళ్ళలో ప్రశాంతత కాదుకదా కనీసం కాసేపు ప్రాంగణంలో  కూర్చోడానికి స్థలంకూడా ఉండదు.  ఏదిఏమైనా త్రోసిరాజనలేము. కొంతమంది చిన్నతనంనుంచి  తల్లితండ్రుల దగ్గర  నేర్చుకున్న పద్ధతులు, సంప్రదాయాలు, నమ్మకాలతో ఒక వయస్సు వరకు ఏకీభవించి అనుకరించినా, తర్వాత  వారివ్యక్తిత్వానికి అనుకూలంగా వాటిని  మార్చుకుంటుంటారు.  తలితండ్రుల దృక్పధంలో అది బాధాకరమైనా, పిల్లలు దానినే అనుకరించాలని లేదు. మనిషి వ్యక్తిత్వ వికాసానికి, ఎదుగుదలకు నమ్మకాలూ, విశ్వాసాలూ దోహదించేలా ఉండాలి గాని వాటిమధ్య పడి నలిగిపోయే పరిస్థితి రాకూడదు. అవి మన అస్తిత్వానికి అవరోధం కాకూడదు. అందుకే నేను అనుకుంటాను విశ్వాస నమ్మకాల సమ్మిళితమే జీవితం అని.

Syam Sunder Vasili
Cell: 91 9849033460
Spiritual Foundation, Inc
7062 South Beringer Drive
Cordova, Tennessee 38018