ఇక ప్రతిభకే పట్టం : డొనాల్డ్

ఇక ప్రతిభకే పట్టం : డొనాల్డ్

18-05-2019

ఇక ప్రతిభకే పట్టం : డొనాల్డ్

మార్పులు చేర్పులు చేసిన నూతన వలస విధానాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. ఈ విధానంలో ప్రస్తుతం ఇస్తున్న గ్రీన్‌ కార్డులను బిల్డ్‌ అమెరికా వీసా పేరుతో మార్పు చేశారు. ఇప్పటిదాకా కుటుంబ సంబంధాల ఆధారంగా 66 శాతం, నైపుణ్యాల ఆధారంగా 12 శాతం గ్రీన్‌ కార్డులు జారీ చేస్తున్నారు. కొత్త విధానంలో మాత్రం ప్రతిభకే పట్టం కట్టారు. నైపుణ్యాల ఆధారంగా ఇస్తున్న కోటాను 12 శాతం నుంచి 57 శాతానికి పెంచారు. దీనివల్ల దశాబ్దాలుగా గ్రీన్‌కార్డులు దొరక్క, దినదినగండంగా కాలం నెట్టుకొస్తున్న వేలాది మంది భారతీయులు లాభపడనున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాల ద్వారా నైపుణ్యవంతులకు ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నాం. నూతన విధానం ఆమోదం పొందితే అలా జరిగే అవకాశం ఉండదు అని ట్రంప్‌ తెలిపారు.

ముందే చచ్చిన బిల్లు : డెమోక్రాట్లు

అమెరికాలో సరికొత్త జీవితాన్ని కలలు కనే వారికి ట్రంప్‌ నిరాశనే మిగిల్చారని ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీ స్పందించింది. పుట్టక ముందు చచ్చినట్లుగా ఈ ప్రతిపాదన ఉందని ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ వ్యాఖ్యానించారు. పిల్లలుగా ఇక్కడికి  వచ్చిన వేలాది మంది డ్రీమర్స్‌కు ఎటువంటి భరోసా కల్పించలేకపోయినట్లు ట్రంప్‌ విధాన ప్రకటనతో వారికి ఇక్కడ జీవించే చట్టపరమైన హక్కు పోయినట్లు విమర్శించారు. అమెరికాలోని దిగువ చట్టసభలో డెమోక్రాట్లకు బలం ఉండటంతో ట్రంప్‌ ప్రతిపాదనలు ఈ సభలో నెగ్గాల్సి ఉంటుంది. అమెరికా లోని కుటుంబ ఆధారిత ప్రవేశాల వ్వవస్థను కించపర్చినట్టు డెమోక్రాటిక్‌ సభ్యురాలు ప్రమీలా జయపాల్‌ విమర్శించారు. అమెరికా పౌరసత్వం కోరుకుంటున్న కోటికి మందికి పైగా ఇమిగ్రేంట్లపై ఏమీ చెప్పలేదని ఆక్షేపించారు. ఇక ట్రంప్‌ విధానం పట్ల పలు వ్యాపార సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. వీటి వల్ల రైతులకు, తాత్కాలిక కార్మికులను తీసుకునే సీజనల్‌ యాజమాన్యాలకు ఒరిగేదేమీ లేదని విమర్ళలు వెలువడ్డాయి.